India Strategy To Counter China :భారత్ అధ్యక్షతన దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరిక చేసుకుని ఈ నెల ఏడున ఇండొనేసియా వెళ్ళారు. అక్కడ ఏర్పాటుచేసిన ఆసియాన్-ఇండియా 20వ సమావేశంలో పాల్గొని వచ్చారు. దీన్నిబట్టి ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్)తో సంబంధాల వృద్ధికి ఆయన ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశ 'తూర్పు దిశగా కార్యాచరణ' విధానానికి, ఇండో-పసిఫిక్ వ్యూహానికి ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) చాలా కీలకం. చైనా దుందుడుకు ధోరణి ఆసియాన్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో తమ హక్కులను తోసిరాజని ఆ సముద్రమంతా తనదేనని డ్రాగన్ దబాయిస్తోంది. చైనాపై ఆసియాన్ ఆర్థికంగా అతిగా ఆధారపడాల్సి వస్తోంది. తమ ప్రాంతంలో చైనా ఆధిక్యాన్ని సమతులపరచే శక్తి కోసం ఆసియాన్ దేశాలు అన్వేషిస్తున్నాయి. కొవిడ్-19 ఉద్ధృతి వేళ ఆసియాన్ దేశాలు ఆరోగ్య సంక్షోభంతో సతమతమవుతుంటే చైనా యథావిధిగా దక్షిణ చైనా సముద్రంలో గిల్లికజ్జాల ధోరణిని కొనసాగించింది.
దక్షిణ చైనా సముద్రంలో ఇండొనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియాల ప్రత్యేక ఆర్థిక మండల జలాల్లోకి డ్రాగన్ దేశం పదేపదే చొరబడుతూనే ఉంది. అయినప్పటికీ, ఆసియాన్‌కు ఆర్థికంగా చైనా అతిపెద్ద భాగస్వామి కావడం ఆ దేశాల ముందరికాళ్లకు బందాలు వేస్తోంది. ఆసియాన్ దేశాల్లో అత్యధికంగా- 34,000కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టిన దేశం చైనాయే. బీజింగ్‌కు ఆసియాన్‌కు మధ్య 97,000కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. డ్రాగన్‌కు దీటుగా నిలవగలిగిన దేశాల్లో భారత్ ప్రముఖమైనది కాబట్టి ఆగ్నేయాసియాలో దిల్లీ చురుకైన పాత్ర పోషించాలని ఆసియాన్ ఆశిస్తోంది. 2020లో గల్వాన్ ఘర్షణలు జరిగినప్పటి నుంచి భారత్-చైనా సంబంధాలు క్షీణించాయి. దాంతో బీజింగ్‌ను నిలువరించడంలో భారత్ తమకు సరైన భాగస్వామి కాగలదని ఆసియాన్ దేశాలు భావిస్తున్నాయి.
చైనా పటంపై తీవ్ర నిరసన..
ఇటీవల చైనా విడుదల చేసిన కొత్త భౌగోళిక పటం- భారత్, ఆసియాన్ దేశాలను ఏకతాటిపైకి తెస్తోంది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లతో పాటు తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో ఆసియాన్ దేశాలకు చెందిన ప్రాదేశిక జలాలు, దీవులను తనవిగా చైనా మ్యాప్ చూపెట్టింది. దీన్ని భారత్, ఆసియాన్ దేశాలతోపాటు తైవాన్, జపాన్‌లు సైతం తీవ్రంగా నిరసించాయి. భూమిపైన, సముద్రంలోను చైనా కబ్జాకోరు విధానం భారత్, ఆసియాన్ సముద్రతల సహకార వృద్ధికి బలమైన ప్రేరణ ఇస్తోంది. సైనికంగా, దౌత్యపరంగా చైనా ఒత్తిళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు పురిగొల్పుతోంది. హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం మీదుగా పసిఫిక్ మహా సముద్రం వరకు విస్తరించిన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్‌ను ఎదుర్కోవడానికి భారత్-ఆసియాన్ సముద్రతల సహకారం వ్యూహపరంగా కీలక పాత్ర పోషించనుంది.
భారత్ 2015లో సింగపూర్‌తో, 2016లో వియత్నామ్‌తో వ్యూహపరమైన భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. 2018లో భారత్, ఇండొనేసియా జాతీయ భద్రతా సలహాదారులు భేటీ అయ్యారు. భారత్, ఆసియాన్‌ల మధ్య ద్వైపాక్షిక, బహుళపక్ష సంప్రతింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే వాటి మధ్య పలు ఒప్పందాలున్నాయి. ముఖ్యంగా సంయుక్త నౌకాదళ విన్యాసాలు, ఉమ్మడి పహరా, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాస్తవానికి భారత్, ఆసియాన్‌ల మధ్య 1992లో కొన్ని రంగాలవారీగా భాగస్వామ్యం కోసం సంప్రతింపులు మొదలయ్యాయి. 1995 డిసెంబరులో పూర్తిస్థాయి భాగస్వామ్యం కోసం సంభాషణలు ప్రారంభమయ్యాయి. 1996లో ఆసియాన్ ప్రాంతీయ ఫోరమ్‌లో భారత్ భాగస్వామి అయింది. 2002లో శిఖరాగ్రస్థాయి భాగస్వామిగా మారింది. 2003లో ఆసియాన్‌తో సహకార, సామరస్య ఒప్పందం కుదుర్చుకుంది. 2005లో ఆసియాన్‌తో భద్రతా బంధం కోసం సంప్రతింపుల ప్రక్రియ చేపట్టింది. 2010లో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో భారత్ సైతం పాలుపంచుకొంది. 2012లో వ్యూహపరమైన భాగస్వామ్యానికి అంకురారోపణ జరిగింది. 2021లో ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ విధానపత్రం వెలువడింది. 2022లో భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.