సాంకేతికతలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్ స్పీకర్స్, కంప్యూటర్లు, గేమింగ్ డివైజ్‌లు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మరి, పాత ఉత్పత్తులను ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ పరిస్థితిపై భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు మీ వద్ద స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, స్మార్ట్‌వాచ్ ఉన్నాయి. వీటి మూడింటికి వేర్వేరు ఛార్జర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేస్తే, పాత డివైజ్‌ల ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్)గా మారిపోయినట్లే. దాంతోపాటు పాత ఫోన్, ట్యాబ్‌ను ఎలా? ఎక్కడ? పారేస్తారనేది కూడా ఆందోళనకరం.
మొబైల్ వ్యర్థాలే అధికం..
తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతుండగా, భారత్‌లో రెండు మిలియన్ టన్నులు ఉన్నట్లు సమాచారం. వీటిలో అధికంగా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతోపాటు వాటి యాక్ససరీలు ఉంటున్నాయట. అందుకే భారత్ సహా యూరోపియన్ యూనియన్, ఫోన్, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చాలని కంపెనీలకు సూచించాయి. ఈ క్రమంలో భారత వినియోగదారుల మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జర్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం. దీనిని దశల వారీగా అమలుచేయనున్నారు.