రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధించలేమా?- నాలుగేళ్ల క్రితం ప్రధాని మోదీ సంధించిన ప్రశ్న ఇది. ఆ స్వప్నం సాకారమయ్యే శుభదినం కోసమే దేశం ఏడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది! ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులతో భారతావని భద్రత పోనుపోను సంక్లిష్ట భరితమవుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సవాళ్లకు దీటుగా బదులివ్వాలంటే అత్యాధునిక ఆయుధాలతో పరిపుష్టమైన దళాలనే కాదు, స్వయంసమృద్ధమైన దేశీయ రక్షణ పరిశ్రమనూ తీర్చిదిద్దుకోవాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. తాలిబన్ల పరమైన అఫ్గానిస్థాన్ కేంద్రంగా భారత్‌పై చైనా, పాకిస్థాన్ పన్నాగాలు ముమ్మరిస్తున్న తరుణంలో అమాత్యుల ఆకాంక్ష- అవశ్యం ఆచరణ రూపం దాల్చాల్సిందే! ఆయుధాలు, సైనిక సామగ్రి కొనుగోళ్ల కోసం గడచిన పదిహేనేళ్లలో ఇండియా అయిదు లక్షల 90 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. అందులో నాలుగో వంతు నిధులను ఒక్క అమెరికాకే ధారపోసింది.
24వ స్థానంతో
భారత్‌కు ఎగుమతుల ద్వారా రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ సైతం భారీగా ఆర్జిస్తున్నాయి. ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకొనే ద్వితీయ దేశంగా కొనసాగుతున్న ఇండియా- ఎగుమతుల్లో మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకుంటోంది! 2011-15తో పోలిస్తే 2016-20 మధ్య భారత ఆయుధ దిగుమతులు 33 శాతం మేరకు దిగివచ్చినా సైనిక అవసరాల కోసం నేటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. డెబ్భై వేల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల కోసం రష్యాతో కుదుర్చుకొన్న ఒప్పందమే దీనికి తాజా ఉదాహరణ! బలగాల ఆధునికీకరణ కోసం రాబోయే దశాబ్ద కాలంలో ఇండియా 16 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు అంచనా. 209 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించిన కేంద్రం- భవిష్యత్తులో అధికశాతం ఆర్డర్లను స్వదేశీ సంస్థలకే ఇవ్వాలని తలపోస్తోంది. పరిశోధన, అభివృద్ధిపై దృష్టిసారిస్తూ; మేలిమి ఆయుధాలు, ఉపకరణాలను రూపొందించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే- రక్షణ రంగంలో ఆత్మనిర్భరత ఆవిష్కృతమవుతుంది.
జీడీపీలో 1.63శాతానికి..