India Pak relations 2022 : కొన్ని అంశాలు కష్టమే కాదు, అసాధ్యం కూడా! దాయాది దేశం పాకిస్థాన్‌తో సఖ్యత, స్నేహం విషయంలో భారత్ ఈ పరిస్థితినే ఎదుర్కొంటోంది. అలాగని సంబంధాల్ని పూర్తిగా తెంచుకుందామా అంటే, అది మరిన్ని కొత్త సమస్యలకు దారి తీస్తుంది. మనం దూరంపెట్టే కొద్దీ చైనాకు పాక్ దగ్గరవుతోంది. మొత్తంగా భారత్-పాకిస్థాన్ సంబంధాలు మునుపెన్నడూ లేనంత అధ్వాన స్థితికి చేరుకొన్నాయి. రెండు దేశాలు తమ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్న ఈ సమయంలో ఇటీవల వాఘాకి ఇరువైపులా కొన్ని సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దులు దాటి ప్రజలు దగ్గరవుతున్నారు.
ప్రజల మధ్య అనుబంధం
దేశ విభజన సమయంలో రీనావర్మ కుటుంబం పాకిస్థాన్‌లోని రావల్పిండిని వదిలి భారత్‌కు వచ్చింది. విశ్రాంత ఉపాధ్యాయురాలైన రీనా ప్రస్తుతం పుణెలో ఉంటున్నారు. 15 ఏళ్ల వయసులో రావల్పిండిలో తాను వదిలి వచ్చేసిన ఇంటిని చూడాలన్నది ఆమె చిరకాల కోరిక. చివరకు 75 ఏళ్ల తరవాత ఆమె వాఘా సరిహద్దు దాటి జులై 20న రావల్పిండి 'ప్రేమ్ గల్లీ'లోని ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ వీధికి రీనా తండ్రి పేరే పెట్టారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న కుటుంబం, స్థానికులు రీనాకు ఘనస్వాగతం పలికారు. ఆ ఇంట్లో నివసిస్తున్న హుస్సేన్ కుటుంబం లూధియానా నుంచి అక్కడకు వలస వెళ్ళడం మరో ఆసక్తికరమైన విషయం. 'ఇన్నాళ్లకు సొంత గూటికి చేరుకున్నా' అంటూ భావోద్వేగంగా మాట్లాడిన రీనా- ఆ ఇంటిని, పరిసరాలను తనివితీరా చూసుకున్నారు. కొవిడ్ సమయంలో ఆమె తన జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. సజ్జద్ భాయ్ అనే రావల్పిండి వాసి ఆమెకు ఆ ఇంటి ఫొటోలు, ఆ వీధి వీడియోలు పంపారు. ఎంతో ఆనందించిన ఆమె నేరుగా అక్కడికే వెళ్ళి చూడాలనుకున్నారు. తన చిరకాల వాంఛను వివరిస్తూ రీనా తీసిన వీడియోను పాక్ మంత్రి హీనా రబ్బానీ చూశారు. వీసా విషయంలో ఆమెకు సాయపడ్డారు.
Indo Pak relations : దేశ విభజన సమయంలో ఎక్కువగా సిక్కుల్లోనే సంబంధాలు తెగిపోయాయి. పంజాబ్ రాష్ట్రం నిట్టనిలువునా ముక్కలైంది. ఆ పేరుతో రెండు దేశాల్లోనూ రాష్ట్రాలున్నాయి. కర్తార్‌పుర్ కారిడార్ వచ్చాక ఎందరో సిక్కులు రెండు దేశాల సరిహద్దులకు ఆవల ఉన్న తమ తోబుట్టువులను, రక్త సంబంధీకులను కలుసుకుంటున్నారు. వారికి పాకిస్థాన్‌కు చెందిన 'పంజాబీ లెహర్' యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు నాసిర్ ధిల్లాన్ సాయపడుతున్నారు. నాలుగేళ్లలో నాసిర్ 200 కుటుంబాల్ని కలిపారు. ఈ ఛానెల్‌కు ఆరు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నాయి. నాసిర్ పూర్వీకులది భారత్‌లోని పంజాబ్ ప్రాంతం. పూర్వీకుల గ్రామం సందర్శించాలన్న తన తాత, తండ్రి కోరిక నెరవేరలేదు. అప్పుడే ప్రజల్ని కలిపేందుకు ఏదైనా చేయాలని వారు సలహా ఇచ్చారట. ఫేస్‌బుక్‌లో ఇమ్రాన్ విలియమ్ నిర్వహిస్తున్న 'ఇండియా-పాకిస్థాన్ హెరిటేజ్ క్లబ్' సరిహద్దులకు ఇరువైపులా ప్రజలు తమ చరిత్ర, సంప్రదాయాలను గుర్తుచేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ గ్రూప్‌లో 76వేల మంది ఉన్నారు. పాక్‌కు చెందిన అప్షీన్ గుల్ అనే అమ్మాయి మెడ వంకర తిరిగి ఇబ్బంది పడుతున్న విషయాన్ని పాక్ నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దిల్లీకి చెందిన వైద్యుడు రాజగోపాలన్ మానవతా దృక్పథంతో స్పందించి ఆమెకు ఇండియాలో ఉచిత శస్త్ర చికిత్స చేశారు. ప్రభుత్వాలకు ఆవల ప్రజల మధ్య అనుబంధాలు ఏర్పడుతున్నాయని అనడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో కనిపిస్తాయి.