మనుషులు లేకుండానే స్వయంగా ఎగిరే డ్రోన్ల సాంకేతిక నామం యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్). నేడు డ్రోన్లు యుద్ధ రంగాన్నే కాకుండా పౌర జీవితాన్నీ మార్చేస్తున్నాయి. 2020-21లో భారత్‌లో రూ.60 కోట్లుగా ఉన్న డ్రోన్ మార్కెట్ 2023-24 కల్లా రూ.900 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం అమెరికా, చైనా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యంలో ఉన్న అంతర్జాతీయ డ్రోన్ల మార్కెట్ పరిమాణం ఈ ఏడాది 2,847 కోట్ల డాలర్లకు (2.14 లక్షల కోట్ల రూపాయలకు పైగా) చేరుతుందని, అందులో భారత్ వాటా 4.25 శాతమని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ప్రపంచంలో సైనిక డ్రోన్లను పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానాన ఉంది. భారతీయ వాణిజ్య యూఏవీ మార్కెట్ ఇప్పటి నుంచి 2026 వరకు ఏటా 12.6 శాతం చొప్పున వృద్ధి సాధించనుందంటున్నారు.
వాణిజ్య, వాణిజ్యేతర ప్రయోజనాలకు డ్రోన్లను వినియోగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆగస్టు 25న నియమ నిబంధనలను విడుదల చేసింది. ఇటీవలి వరకు యూఏవీల వినియోగంపై జాగ్రత్తలు పాటించిన ప్రభుత్వం- ఇక గరిష్ఠ స్థాయిలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలనుకొంటోంది. తదనుగుణంగా డ్రోన్ల ఉత్పత్తి, దిగుమతి, పరిశోధన, వినియోగం, రిమోట్ పైలట్ లైసెన్సులకు అనుమతి కోసం నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి అయిదుకు తగ్గించింది. స్వదేశీ అంకురాలను డ్రోన్ల ఉత్పత్తి చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. యూఏవీలు తీసుకెళ్ళగల బరువును 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచింది. విమానాశ్రయాల చుట్టూ అవి ఎగరడానికి అనుమతించే గగనతల మండలాలనూ సరళీకరించింది. ఆ మండలాలు డిజిటల్ గగన వేదిక మీద ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి. లోగడ విమానాశ్రయాల నుంచి 45 కిలోమీటర్ల పరిధిలోపల డ్రోన్లు ఎగరడానికి వీల్లేదన్న ఆంక్షలు ఉండేవి. పసుపు మండలంగా పరిగణించే దీని పరిధిని 12 కిలోమీటర్లకు తగ్గించారు. విమానాశ్రయాల నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఆకుపచ్చ మండలంగా వ్యవహరిస్తారు. ఇందులో 200 అడుగుల ఎత్తు వరకు అనుమతులు లేకుండా యూఏవీలు ఎగరవచ్చు.
అన్ని రంగాల్లోనూ..
ప్రస్తుతం భారత్‌లో యూఏవీలను గగన తలం నుంచి ఫొటోలు తీయడానికి, సినిమా షూటింగ్‌లు, భూ సర్వే, మౌలిక వసతుల పరిశీలన, భవన నిర్మాణం, గనులు, రక్షణ, టెలికాం, ప్రకృతి ఉత్పాతాల సమయంలో సహాయ కార్యక్రమాలు తదితర అవసరాల\కు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో డ్రోన్లతో గ్రామీణ భూముల సర్వే కోసం ఉద్దేశించిన 'స్వామిత్వ' కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనివల్ల యూఏవీ పైలట్లకు ఉపాధి అవకాశాలు లభించాయి. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు మందులు, ఆరోగ్య సేవలు అందించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ పథకం చేపట్టింది. తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే నష్టాన్ని గగనతలం నుంచి పరిశీలించడానికి, సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి యూఏవీలు అక్కరకొస్తాయి. అక్రమ గనుల తవ్వకందారులను కనిపెట్టడానికి కోల్ ఇండియా 2019లో విజయవంతంగా డ్రోన్లను ఉపయోగించింది. ఇప్పటికే భారత్‌లో 191 డ్రోన్ అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ప్రోత్సహించదలచిన 26 రంగాల్లో గత ఏడాది డ్రోన్ల పరిశ్రమనూ చేర్చారు.
గాలిలో పోరాటం