భారతదేశం ఇప్పుడు 'మాదక ఉగ్రవాద' మహాముప్పు (Drug menace) ముంగిట్లో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల హెచ్చరించారు. మాదకద్రవ్యాలే పెట్టుబడిగా పెద్దయెత్తున డబ్బు సమకూర్చుకుంటున్న నేరముఠాలు- విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దులకు ఆవల నుంచి చైనా రువ్వుతున్న సవాళ్లతో పోలిస్తే- పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాలతో యువశక్తులు నిర్వీర్యమైపోతూ ఆసేతుహిమాచలం అంతకు మించిన పెను విషాద దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశీయంగా గంజాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే- హెరాయిన్ వంటి మత్తుమందులు విదేశాల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచి సముద్ర మార్గంలో గుజరాత్‌లోకి మాదకద్రవ్యాలు (Gujarat drugs news) వెల్లువెత్తుతున్నాయి.
గడచిన వారం రోజుల్లోనే అక్కడి మోరబి, ద్వారక జిల్లాల్లో రూ.900 కోట్ల విలువైన మత్తుమందులు పట్టుబడ్డాయి. డార్క్‌వెబ్ ద్వారా అంతర్జాతీయ స్మగ్లర్లతో అనుసంధానమైన మాదక ముఠా ఒకటి తాజాగా అహ్మదాబాద్ పోలీసులకు చిక్కింది. విజయవాడ చిరునామాతో గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి (Gujarat drugs news) చేరిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుట్టు ఇటీవలే రట్టయ్యింది. ఆ తరవాతా అదురూబెదురూ లేకుండా మాదక ముఠాలు పేట్రేగిపోతున్న తీరు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం గంజాయి భారీగా పోటెత్తుతోంది. రెండు రోజుల క్రితం 1240 కేజీల సరకును హైదరాబాదు పోలీసులు పట్టుకుంటే- మహారాష్ట్రలోని నాందేడ్‌లో మరో 1127 కిలోల గంజాయిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనపరచుకున్నారు.
విశాఖ నుంచి భోపాల్, కోటా, ఆగ్రా తదితర నగరాలకు గంజాయి (Drug menace) తరలింపునకు అమెజాన్ ఈ-కామర్స్ వేదికను (Amazon drug case) వినియోగించుకుంటున్న నేరగాళ్ల కుయుక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. 'నషా ముక్త్ భారత్' కోసం కొన్నాళ్లుగా ఆదర్శాలు ఎంతగా జోరెత్తుతున్నా- క్షేత్రస్థాయిలో బలగాల మధ్య సమన్వయ రాహిత్యంతో ఆచరణే కొల్లబోతోంది. పోనుపోను వెర్రితలలు వేస్తున్న దారుణ విష వ్యసన సంస్కృతి- ప్రజారోగ్యాన్ని వధ్యశిలపైకి ఈడ్చుకుపోతోంది!