Coal Environmental Impact:బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచేస్తున్నాయని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. భూతాపంలో పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీలకు పరిమితం చేయాలని 2015నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం పిలుపిచ్చింది. పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే సగటు భూఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 డిగ్రీలకు పెరిగి, దాని దుష్ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. 2030కల్లా కర్బన ఉద్గారాలను 2010 స్థాయికన్నా 45శాతం మేర తగ్గించాలని, ఈ శతాబ్ది మధ్యనాటికైనా అదనంగా కర్బన ఉద్గారాలను వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కాప్-26 సదస్సు ప్రతిపాదించింది. అయితే భారత్, చైనాలతోపాటు అనేక వర్ధమాన దేశాలు అకస్మాత్తుగా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తే తమ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని, బొగ్గు వాడకాన్ని దశలవారీగా నియంత్రిస్తామని చెప్పాయి. అదనపు కర్బన ఉద్గారాలను నివారించి నెట్ జీరో స్థాయికి చేరడం తమకు 2070నాటికి కానీ సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. విద్యుదుత్పాదనకు, ఉక్కు ఉత్పత్తికి, మౌలిక వసతుల కల్పనకు బొగ్గే ప్రధాన ఆధారం.
Coal production in World
Coal demand in India
Coal import in India
ఈ సందర్భంగా ఉక్కు ఉత్పత్తి కోసం రష్యా నుంచి దీర్ఘకాల ప్రాతిపదికపై బొగ్గు దిగుమతి చేసుకోవడానికి భారత్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల మొదటివారంలో దిల్లీ వచ్చినప్పుడు భారత్‌లో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహ పథకం (పీఎల్‌ఐ) కింద ప్రత్యేక ఉక్కు తయారీకి చర్చలు జరిగాయి. రక్షణ, అంతరిక్ష, విద్యుత్, ఆటొమొబైల్, భారీ పారిశ్రామిక యంత్రాల తయారీకి ప్రత్యేక ఉక్కు కీలకం. దీంతోపాటు ఏ ఉక్కు తయారీకైనా కోకింగ్ బొగ్గే కీలకం. భారత్‌కు ఏటా నాలుగు కోట్ల టన్నుల కోకింగ్ బొగ్గు సరఫరాకు రెండు దేశాలూ గత అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం రష్యా అన్ని రకాల బొగ్గును ఏటా 80 లక్షల టన్నుల మేరకు భారత్‌కు సరఫరా చేస్తోంది. ప్రపంచంలో నాలుగో పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అయిన భారత్ బొగ్గు దిగుమతిదారుల జాబితాలో మూడో స్థానం ఆక్రమిస్తోందంటే- బొగ్గుకు ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో 70శాతం విద్యుదుత్పాదనకు బొగ్గే ఆధారం. కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం ఒక్క పెట్టున పెరిగిపోయిన గిరాకీని తీర్చగలిగే స్థాయిలో బొగ్గు నిల్వలు లేక విద్యుత్ కేంద్రాలు అల్లల్లాడిన సంగతి తెలిసిందే. కోట్లాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాలంటే త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించాలి.
Coal industry employment
చౌకగా, విరివిగా లభించే బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆర్థిక ప్రగతికి చోదక శక్తి. అందువల్ల ఉన్నపళాన బొగ్గుకు స్వస్తి చెప్పడం కుదరదని వాతావరణ మార్పులపై ఇటీవల బ్రిటన్‌లో జరిగిన కాప్-26 సదస్సుకు భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో స్థాపిత విద్యుదుత్పాదన సామర్థ్యం దాదాపు 400 గిగావాట్లు. 2040కల్లా విద్యుత్ గిరాకీ రెట్టింపు కానున్నది. ప్రస్తుతం జల విద్యుత్తు ఉత్పత్తి దాదాపు 50 గిగావాట్లుకాగా, సౌర, పవన తదితర పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుచ్ఛక్తి 100 గిగావాట్లు. దీన్ని 2030కల్లా 500 గిగావాట్లకు పెంచాలని లక్షిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్ సదస్సుకు చెప్పారు. భారతదేశంలో దాదాపు 40 లక్షల మంది జీవనోపాధి కోసం బొగ్గు పరిశ్రమ మీద ఆధార పడుతున్నారు. ఉన్నట్టుండి బొగ్గుకు స్వస్తి చెబితే వీరంతా వీధిన పడతారు. భారత్‌లో ఒకవైపు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతుంటే, మరోవైపు కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల స్థాపన సైతం అధికమవుతోంది. ప్రపంచంలో కొత్తగా ఏర్పడుతున్న ఈ తరహా విద్యుత్ కేంద్రాల్లో 80శాతం భారత్ సహా మొత్తం అయిదు ఆసియా దేశాల్లోనే ఉన్నాయని క్లైమేట్ ట్రాకర్ సంస్థ వెల్లడించింది. ఇటువంటి విద్యుత్ కేంద్రాల సంఖ్య మరికొద్ది సంవత్సరాలపాటు మాత్రమే కొనసాగి ఆపైన నిలిచిపోతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా.
global warming burning coal
తక్కిన దేశాల్లో సైతం బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన 2000 సంవత్సరం నుంచి పెరుగుతూనే ఉంది. ఈ తరహా విద్యుదుత్పాదన 2000 సంవత్సరానికి ముందునాటికన్నా ఇప్పుడు రెట్టింపు అయింది. భూఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలంటే ప్రపంచ బొగ్గు వినియోగాన్ని 80శాతం మేరకు తగ్గించాల్సి ఉంటుంది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదనలో అగ్రశ్రేణి దేశాల సంఖ్య 80కి పైమాటే. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సంఖ్య ప్రపంచమంతటిలోకీ చైనాలోనే అధికం. అక్కడ 1,082 థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. భారత్‌లోని థర్మల్ కేంద్రాల(281)కు ఆ సంఖ్య నాలుగింతలు. చైనా, భారత్‌ల తరవాతి స్థానాలను అమెరికా (252), జపాన్ (87), రష్యా (85) ఆక్రమిస్తున్నాయి. జర్మనీలో 70 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటే, బ్రిటన్‌లో కేవలం మూడే ఉన్నాయి. బొగ్గుతో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన బ్రిటన్ 2024 అక్టోబరుకల్లా బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదనను నిలిపేయాలని నిశ్చయించింది. జర్మనీ సహా మరో 18 దేశాలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదనను నిలిపేయడానికి సమాయత్తమవుతున్నాయి. 2019లో భారత్‌లో మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతంగా ఉన్న బొగ్గు వాటా 2040నాటికి 34 శాతానికి తగ్గుతుందని క్లైమేట్ ట్రాకర్ అంచనా కట్టింది. కర్బన ఉద్గారాలను తగ్గించే సూపర్ క్రిటికల్, అల్ట్రా క్రిటికల్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాల వైపు భారత్ మళ్లుతోంది. 2070నాటికి భారతదేశం నెట్‌జీరో లక్ష్యాన్ని అందుకోవాలంటే పెద్దయెత్తున పెట్టుబడులు అవసరమని సీఈఈడబ్ల్యూ అనే విశ్లేషణ సంస్థ లెక్కకట్టింది. ఆ భారాన్ని తట్టుకోవడానికి భారీ ఆర్థిక సహాయం అందించాలని ప్రధాని మోదీ సంపన్న దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు విన్నవించారు.
హరిత ఇంధనాలవైపు పయనం
పరిస్థితులు ఎలాగున్నా భూతాపానికి కారణమవుతున్న బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలకు క్రమేణా స్వస్తి చెప్పి, హరిత ఇంధనాలకు మారక తప్పదు. ఈ వాస్తవాన్ని గ్రహించడం వల్లనే బొగ్గు గనుల వేలంలో పాల్గొనడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. పోనుపోను బొగ్గు సరఫరా తగ్గిపోనున్నది కాబట్టి, ఇప్పుడు కొత్తగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పితే భవిష్యత్తులో ఇంధన కొరతతో వాటిని మూసేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
- ఏఏవీ ప్రసాద్