India Nepal relations China Influence :కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన చైనా- నేపాల్‌తో ద్వైపాక్షిక వ్యవహారాల్లో దూకుడు పెంచింది. కాఠ్‌మాండూకు తమ నేతలు, అధికారులను తరచూ పంపిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను విశ్లేషిస్తోంది. ముఖ్యంగా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) కింద నేపాల్‌లో చేపట్టిన ప్రాజెక్టుల్లో ( Nepal China BRI Agreement) తీవ్ర జాప్యానికి కారణాలపై ఆరా తీస్తోంది. ఆ పనులను వేగిరం చేయాలంటూ నేపాల్‌పై ఒత్తిడి పెంచుతోంది. కొవిడ్ విజృంభణతో నిలిచిపోయిన సంయుక్త సైనిక విన్యాసాలు సహా ద్వైపాక్షిక మిలిటరీ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవాలని ఇరు దేశాలు ఇటీవల నిర్ణయించుకోవడం మరో కీలక పరిణామం.
Nepal China Relationship :భారీ పెట్టుబడులతో తాము ఆకర్షిస్తున్నా ఇండియాతో మైత్రీబంధాన్ని నేపాల్ మరింత బలోపేతం చేసుకుంటుండటం చైనాకు మింగుడుపడటం లేదు. దాంతో కొన్ని తృతీయ పక్షాలు బీజింగ్-కాఠ్‌మాండూ సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేపాల్‌కు చైనా సూచనలు చేస్తోంది. బీఆర్‌ఐలో భాగమవుతున్నట్లు 2017లో కాఠ్‌మాండూ సంతకాలు చేసింది. దాని కింద తమ దేశంలో 35 ప్రాజెక్టులు చేపట్టాలని తొలుత భావించింది. తరవాత ఆ సంఖ్యను తొమ్మిదికి కుదించింది. వాటిలో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురవుతున్న చైనా- నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయం బీఆర్‌ఐలో భాగంగా చేపట్టిందేనంటూ ప్రచారం చేసుకుంటోంది. నిజానికి బీఆర్‌ఐపై సంతకాల కంటే ముందే ఆ విమానాశ్రయ నిర్మాణం ప్రారంభమైంది.
డ్రాగన్ పన్నిన రుణ ఉచ్చు సీపెక్
నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 65శాతం వాటా ఇండియాదే. డ్రాగన్ వాటా కేవలం 14శాతం. కాఠ్‌మాండూతో బీజింగ్ సంబంధాలకు రవాణా సదుపాయాల లేమి ప్రధాన అడ్డంకిగా ఉంది. బీఆర్‌ఐలో భాగంగా నేపాల్‌తో అనుసంధానం పెంచుకోవాలని చైనా కోరుకుంటోంది. కాఠ్‌మాండూను టిబెట్‌తో కలిపే రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఇండియాపై నేపాల్ ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నది చైనా యోచన. బీఆర్‌ఐ ప్రారంభమై పదేళ్లవుతున్న సందర్భంగా 'సిల్క్ రోడ్‌స్టర్' పేరుతో మరికొన్ని కీలక ప్రాజెక్టులను చైనా ప్రకటించింది. నేపాల్ ద్వారా ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలతో తమ అనుసంధానం ( Nepal China Relations ) పెంచుకునేందుకు అవి ఉపయోగపడతాయని చైనా చెబుతోంది. బీజింగ్ ఎంతగా ప్రేరేపించినా బీఆర్‌ఐ ప్రాజెక్టులను కాఠ్‌మాండూ పూర్తిస్థాయిలో పట్టాలెక్కించడం అనుమానమే. దాని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం అందుకు ప్రధాన కారణం.