తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్,​ నేపాల్​ మధ్యలో చైనా- నిలిచేది ఎవరి బంధం? - నేపాల్ చైనా అప్పులు

భారత్​-నేపాల్ మధ్య వివాదాలు కొత్తేం కాదు. కానీ మరో దేశ మద్దతుతో భారత్​కు వ్యతిరేకంగా వ్యవహరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేపాల్​ ప్రజలు, నాయకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఎందుకిలా? తమను చైనా పావులా ఉపయోగించుకుంటోందని నేపాల్​కు తెలిసిపోయిందా? అందుకే ఇటీవల బీజింగ్ వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయా?

India- Nepal relations and China
భారత్​, చైనా మధ్యలో నేపాల్​! భవిష్యత్తేంటి?

By

Published : Jul 10, 2020, 2:53 PM IST

నేపాల్​ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యం తేల్చే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. జులై 8న జరగాల్సిన భేటీ మళ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఏర్పడిన ప్రతిష్టంభనకు స్నేహపూర్వక పరిష్కారం కనుక్కోవడానికి ప్రధాని ఓలికి మరో అవకాశం లభించింది.

ఇదీ చదవండి-'భారత్​-నేపాల్ వివాదం పరిష్కారానికి అదొక్కటే మార్గం'

నేపాల్-భారత్ మధ్య వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ దేశ రాజకీయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు దేశాల మధ్య ఈ వివాదాలు చైనానే తెరమీదకు తెచ్చిందనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవలి చైనా వ్యవహార శైలి ఈ అనుమానాలు నిజమేనని స్పష్టం చేస్తున్నాయి. తమ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యం పెరిగిపోవడాన్ని నేపాల్ ప్రజలు, రాజకీయ నాయకులు గ్రహిస్తున్నారు.

ఉద్రిక్తతలు సహజమే!

నేపాల్​తో దశాబ్దాలుగా నెలకొన్న సత్సంబంధాలను కొనసాగించడంలో విఫలమయ్యారని కేంద్రంలోని పాలకులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.... గత ప్రభుత్వాలు అమలు చేసిన విదేశాంగ విధానాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మోదీ సర్కార్ చెబుతోంది. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలే. రెండు పొరుగు దేశాలు ఎల్లకాలం ఒకే విధమైన సంబంధాలు కొనసాగించడమనేది సాధ్యం కాదు. ఆయా సమయాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఉద్రిక్తతలు తలెత్తుతాయి. ఇందుకు భారత్- నేపాల్​ కూడా మినహాయింపేమీ కాదు.

సిక్కింపై వివాదం

నేపాల్​లో రాచరిక పాలన కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి వివాదాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే దిశగా తమ రాచరిక పాలనను పడగొట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నేపాల్ రాజులు ఆరోపణలు చేశారు. 1975లో సిక్కిం రాజ్యం విషయంలో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. ఎలాంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించకుండా సిక్కింను శాంతియుత జోన్​గా పరిగణించాలని నేపాల్ ప్రతిపాదించింది. ఇదే సమయంలో నేపాల్​ను ఆకట్టుకోవడానికి చైనా, పాకిస్థాన్​ ఈ తరహా ప్రతిపాదనను ఆమోదించాయి. భారత్​ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. అంతకుముందే సిక్కిం రాజ్యానికి, భారత్​కు శాంతి, స్నేహపూర్వక ఒప్పందాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

మళ్లీ మొదలు

1988లో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి నేపాల్ విముఖత చూపించడం వల్ల ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తర్వాత భారత్​ చేపట్టిన చర్యల ఫలితంగా నేపాల్​లో ఆర్థిక దిగ్బంధం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 1991లో ఇరుదేశాలు రెండు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకునే వరకు ఈ సమస్య కొనసాగింది. 2015లో నేపాల్ రాజ్యాంగ సవరణ చేపట్టినప్పుడు ఇవే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశంలోని మాధేసి(నేపాల్​లో స్థిరపడ్డ భారత సంతతి) ప్రజలు రాజ్యాంగ సవరణను వ్యతిరేకించారు.

సరిహద్దు వివాదం

ప్రస్తుత సంక్షోభం భారత్-నేపాల్ సరిహద్దు వివాదం వల్ల మొదలైంది. ఇది బ్రిటీష్ కాలంనాటి సమస్య. 1816లో అప్పటి బ్రిటీష్ ఇండియా, నేపాల్​ దేశాలు కలిసి సుగౌలి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాలీ నది జన్మ స్థలాన్ని బట్టి నేపాల్ పశ్చిమ సరిహద్దును ఇందులో నిర్ణయించారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. కాలీ నది లిపులేఖ్​ పాస్​ వద్ద ఉద్భవించిందని భారత్​ చెబుతుండగా.. నేపాల్ మాత్రం నది మూలం లింపియాధురా వద్ద ఉందని వాదిస్తోంది. తద్వారా ఉత్తరాఖండ్​లోని కొంత భాగాన్ని తమదని చెప్పుకొస్తోంది.

ఇదీ చదవండి-ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

దీనికోసం నేపాల్ ప్రధాని ఓలి తమ దేశ మ్యాప్​ను సైతం సవరించారు. దేశంలో కూరుకుపోయిన అవినీతి, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అంతర్జాతీయ వివాదాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చైనా రాయబారి హౌ యాంకీతో అసాధారణ సన్నిహిత సంబంధాలపై దేశంలోని ప్రజల నుంచి విమర్శలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి-భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

కో ఛైర్మన్​ పదవిని త్యజించడానికి ఇష్టపడకపోవడం వల్ల పార్టీలో తన మద్దతును కోల్పోతున్నారు ఓలి. అసంతృప్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత్​పై నిరాధార ఆరోపణలు చేయడం పార్టీ నాయకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఫలితంగా ఓలికి వీరందరూ మరింత దూరమయ్యారు.

చైనా ప్రవేశం

ఇదే సమయంలో చైనా రాయబారి హౌ యాంకీ రంగంలోకి దిగారు. నేపాల్ ప్రధానిని పదవి నుంచి తప్పించకుండా ఉండేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. నిబంధనలు పక్కబెట్టి ఇన్నిసార్లు ప్రధానితో భేటీ కావడం వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటన్న విషయంపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి.

భారత్​- నేపాల్ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవడానికి చైనా ఎందుకు అంత ఆసక్తి చూపుతుందని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి.

  • బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ ప్రకారం భారత్​తో పోలిస్తే లాభదాయకమైన ప్రాజెక్టులను అందించి నేపాల్​ను అప్పుల ఉచ్చులో చిక్కుకునేలా చేయడం.
  • భారత్​ అసౌకర్యంగా ఉన్న ప్రాంతాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు నేపాల్​లో ప్రాభవాన్ని పెంచుకోవడం.
  • ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సత్తా భారత్​కు కాకుండా తమకే ఉందని సార్క్​ దేశాలకు సందేశమివ్వడం.
  • చైనాలోని మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎదుర్కొంటున్న విమర్శల నుంచి ప్రపంచదేశాల దృష్టిని మరల్చడం.

8 బిలియన్ డాలర్ల అప్పు

నేపాల్​ను రుణ ఊబిలో కూరుకుపోయాలా చేసేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్​లో ఎన్నో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. పోఖ్రాలో విమానాశ్రయం, ఓ విశ్వవిద్యాలయం, ఆనకట్టలు, భారత సరిహద్దు వరకు రహదారి నిర్మాణాలు చేపడుతోంది. 6 బిలియన్ డాలర్ల వ్యయంతో టిబెట్​ను కాఠ్​మాండూతో అనుసంధానించే మెగా రైల్వే ప్రాజెక్టు అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. కొండలు, లోయల గుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది.

ప్రస్తుతం చైనాకు నేపాల్​ దాదాపు 2 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఈ రైల్వే ప్రాజెక్టుతో ఇది 8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2020 గణాంకాల ప్రకారం ఈ రుణాలు నేపాల్​ జీడీపీలో 29 శాతానికి సమానం. ఈ అప్పులు తిరిగి చెల్లించే అవకాశాలు దాదాపుగా లేవు కాబట్టి చైనా ఉచ్చులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు చైనా వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

  • ఓలిపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడం
  • నేపాల్​లోని పలు భూభాగాలను చైనా ఆక్రమించుకుందని ప్రభుత్వం ధ్రువీకరించడం
  • రైల్వే ప్రాజెక్టు అమలుపై అనుమానాలు(నేపాల్​లోని చాలా మంది దీనిని పేపర్ ప్రాజెక్టుగానే పరిగణిస్తారు)
  • భారత్​ను వదులుకొని చైనాతో సంబంధాలు పెంచుకోవడంపై వ్యతిరేకత
  • సరిహద్దులో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్టులను తొలగించి.. భారత్​ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శించడం

అయితే భారత్- నేపాల్ సంబంధాలు, నేపాల్- చైనా మధ్య సంబంధాల విషయంపై ఇప్పుడే ఓ కొలిక్కి రావడం సరైనది కాదు. ప్రస్తుతం నేపాల్​లో రాజకీయ అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. ఇది పరిష్కారమైతేగానీ ఓ అంచనాకు రావడం కష్టమే. స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాతే భవిష్యత్తులో భారత్-నేపాల్ సంబంధాల విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది.

(రచయిత- జితేంద్ర కుమార్ త్రిపాఠీ, మాజీ రాయబారి)

ఇదీ చదవండి-భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

ABOUT THE AUTHOR

...view details