విద్యార్థులకు పోషకాహారం, పాఠశాలల్లో హాజరు శాతం పెంచే ఉద్దేశంతో జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. విద్యార్థుల ఆహార కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఈ పథకానికి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు.
అయితే, కరోనా మహమ్మారి ప్రభావం బోధనపైనే కాకుండా విద్యార్థులకు అందించే పోషకాహారంపైనా పడింది. లాక్డౌన్లో పాఠశాలల మూసివేత కారణంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసే ప్రమాదం ఉందని ఈ ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. పిల్లలతో సహా పేదరికంలో మగ్గుతున్న వారికి ఆహార భద్రతను కల్పించాలని స్పష్టం చేసింది. తీవ్రం కానున్న పోషకాహార లోపం సంక్షోభాన్ని దీనివల్ల కొంతవరకైనా నియంత్రించవచ్చని తెలిపింది.
రాష్ట్రాలు స్పందించినా..
వెంటనే స్పందించిన కేంద్ర విద్యా శాఖ.. పిల్లల ఇళ్లకు మధ్యాహ్న భోజనం అందించాలని, లేదా ఆహార భద్రత భత్యం ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. కుటుంబాలకు నేరుగా ఆహార భద్రత భత్యం లేదా ధాన్యం అందించడాన్ని రాష్ట్రాలు వేగంగా అమలు చేశాయి. బిహార్ ప్రభుత్వం నగదు బదిలీ చేయగా.. రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం, పప్పులు, నూనె వంటివి అందించారు. కేరళ వంటి రాష్ట్రాల్లో బలవర్ధక ఆహారమైన పాలు, గుడ్లు కూడా అందించారు. వేసవి సెలవుల్లోనూ కొనసాగించేందుకు అదనపు నిధులు కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి.
కానీ, వీటి ద్వారా నిర్దేశించిన పోషకాహారం లబ్ధిదారులకు అందలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు చర్యలు తీసుకున్నప్పటికీ, చాలా మంది పిల్లలకు ప్రయోజనం జరగలేదని తేలింది. ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీలో 1,158 మందిపై ఆక్స్ఫామ్ నిర్వహించిన సర్వేలో 35 శాతం మంది మధ్యాహ్న భోజనం పొందలేదని వెల్లడైంది. ఉత్తర్ప్రదేశ్లో అధికంగా 92 శాతం ఉంది. ఇతర అధ్యయనాల్లోనూ ఇంతకన్నా తక్కువ మంది పిల్లలకే ప్రయోజనం అందినట్లు నివేదించాయి.
కరోనా వేళ మరింత..
ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పథకం ప్రణాళిక, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీలో సంక్లిష్టత వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ సవాళ్లు కరోనా ముందునుంచే ఉన్నా.. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పెద్దవిగా కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం లభించకపోతే తీవ్ర సంక్షోభానికి దారితీయవచ్చు.
పథకం అమలులో సమస్యలకు కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారనే అంశాన్ని బట్టి బడ్జెట్, నిధుల పంపిణీపై విశ్లేషణ జరగాలి.
60 శాతం కేంద్రమే..
మధ్యాహ్న భోజన సదుపాయం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో మౌలిక సదుపాయాలు, వంట ఖర్చుల్లో కేంద్రం 60 శాతం భరిస్తుంది. ఆహార ధాన్యాల ఖర్చు పూర్తిగా కేంద్రమే అందిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పథకానికి రూ.11,000 కోట్లు కేటాయించింది. అనంతరం దాన్ని రూ.12,600 కోట్లకు పెంచింది. అదనంగా పెంచిన రూ.1,600 కోట్లు వేసవి నెలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసేందుకు కేటాయించింది.
రాష్ట్రాలకు అందేది ఎంత?