శతాబ్దపు ఉత్పాతంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థలు గల దేశాల్నీ చిగురుటాకుల్లా వణికించేస్తోంది. వైద్య ఆరోగ్యరంగం దుస్థితిగతులు ముంజేతి కంకణమైన ఇండియా వంటి దేశాల దురవస్థ గురించి చెప్పేదేముంది? దేశ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నింటినీ కరోనా బయటపెట్టిందన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం- ప్రజావైద్యం కోసం ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం ఏమాత్రం సరిపోవడం లేదని నిష్ఠుర సత్యం పలికింది. మితిమీరిన వైద్య ఖర్చుల్లో మూడింట రెండొంతుల్ని తమ జేబుల్లో నుంచే భరిస్తున్న జనవాహినిలో ఏటా ఆరు కోట్లమంది ఆ కారణంగానే దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్న దేశం మనది. ఆ విషయాన్ని ప్రస్తావించిన స్థాయీసంఘం- సర్కారీ వైద్య సేవల్ని మెరుగుపరచడానికి పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, వచ్చే రెండేళ్లలోనే స్థూలదేశీయోత్పత్తిలో రెండున్నర శాతం నిధుల్ని ప్రత్యేకించాలని సూచించింది.
జాతీయ స్థాయి చికిత్స జరిగితేనే..
పేదలకు కొవిడ్ వ్యాక్సిన్లను సబ్సిడీ ధరల్లో అందించాలని, ఐఏఎస్ తరహాలో ఇండియన్ హెల్త్ సర్వీసును నెలకొల్పాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం జీడీపీలో ఒక్కశాతం కంటే తక్కువ కేటాయింపులతో ఈసురోమంటున్న వైద్యసేవారంగం సముద్ధరణకు 2.5 శాతం నిధుల బదిలీ అత్యవసరమన్న పదిహేనో ఆర్థిక సంఘం- ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మరింత అర్థవంతంగా పెనవడాల్సిన ఆవశ్యకతను ఎలుగెత్తుతూ దానికోసం ఓ అధ్యాయాన్నే ప్రత్యేకించింది. రుణభారం తడిసిమోపెడైన రాష్ట్రాలకు వచ్చే కొన్నేళ్లు గడ్డుకాలమేనని ఆర్‌బీఐ నివేదిక స్పష్టీకరించిన దశలో- ఆరోగ్య రంగంలో ఇతోధిక పెట్టుబడులకు రాష్ట్రాలూ కూడిరావాలని ఆర్థిక సంఘం అభిలషిస్తోంది! దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది వైద్యులు, 20 లక్షలమంది నర్సులకు; 20-30 శాతం ప్రాథమిక, సామాజిక స్వాస్థ్య కేంద్రాలకు కొరత పట్టిపీడిస్తున్న వేళ- చికిత్స ఏదైనా జాతీయ స్థాయిలోనే సర్వ సమగ్రంగా జరగాలి!
అవినీతి కోమాలోకి..