నగర్నో-కరాబక్ యుద్ధ సంధి ఒప్పందం ప్రకారం ఆర్మేనియా నుంచి స్వాధీనం చేసుకొన్న కల్‌బజర్ ప్రాంతంలోకి నవంబరు 25న అజర్ బైజాన్ సేనలు అడుగుపెట్టాయి. భారత్ ఈ యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆధునిక ఆయుధ తీరుతెన్నులను వేగంగా అందిపుచ్చుకోకపోతే భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన యుద్ధంలో ఆర్మేనియా సేనలు సంప్రదాయ ఆయుధాలతో రంగంలోకి దిగితే- అజర్‌బైజాన్ దళాలు కేవలం 'కమాండ్ కంట్రోల్ రూమ్'లో ఉంటూ విజయం సాధించాయి. తొమ్మిదో దశకం నాటి యుద్ధంలో లభించిన సంప్రదాయ ఆయుధ ఆధిపత్యాన్నే ఇంకా నమ్ముకున్నందుకు ఆర్మేనియా చెల్లించిన మూల్యం ఇది. అసలు యుద్ధట్యాంకులు, శతఘ్నులు, సాయుధ వాహనాలకే కాలం చెల్లిన పరిస్థితులు వచ్చాయని ఈ యుద్ధం చెబుతోంది. ఇజ్రాయెల్, టర్కీలనుంచి అజర్ బైజాన్ కొనుగోలు చేసిన డ్రోన్లు యుద్ధఫలితాన్ని శాసించాయి. ఆయుధ వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి. నిశ్శబ్ద ఆయుధాలు (స్టెల్త్), హైపర్‌సోనిక్, సముద్ర గర్భంలో 300మీటర్ల కంటే కింద ప్రయాణించే ఆయుధాలు, సూక్ష్మతరంగ ఆయుధాలు, అంతరిక్షంలో వినియోగించే ఆయుధాలు, ఎలక్ట్రానిక్ జామింగ్, కౌంటర్ జామింగ్ వ్యవస్థలను ధ్వంసం చేసే ఆయుధాలు, డ్రోన్లపై ఇప్పుడు ప్రపంచ ‘సూపర్ పవర్’ దేశాలు దృష్టిపెట్టాయి.
ముసురుకొచ్చే తేనెటీగల దండులా...
అత్యంత చౌకగా దొరికే డ్రోన్లు ప్రభావవంతమైన ఫలితాలు ఇస్తున్నాయి. చిన్నచిన్న దేశాలూ చివరికి ప్రభుత్వేతర శక్తులు కూడా వీటిని వినియోగిస్తున్నాయి. చిన్న డ్రోన్ల దాడిని ఎదుర్కోవడం అత్యంత శ్రమ, వ్యయంతో కూడుకొన్న వ్యవహారం. 2017లో సౌదీ అరేబియా ఒక చిన్న క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌ను కూల్చివేయడానికి దాదాపు 30 లక్షల డాలర్ల విలువైన పేట్రియాట్ క్షిపణిని వాడాల్సి వచ్చింది. ఇక ఆరామ్‌కో చమురు క్షేత్రాలపై హైతీ తిరుగుబాటుదారులు పంపిన చిన్న డ్రోన్ల దండు చేసిన దాడిని ఎదుర్కోలేక అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ చేతులెత్తేసింది. ఫలితంగా సౌదీకి వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ప్రత్యర్థి దళాలు ముందుకు కదల్లేవు. ఈ వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు ఓ ఎరలా భారీ డ్రోన్‌ను పంపి, ఆ తరవాత చిన్నస్థాయి డ్రోన్ల దండుతో వాటిపై దాడి చేస్తాయి. పురాతన ఆంటినోవ్ విమానాలను డ్రోన్లుగా మార్చి ఆర్మేనియా రాడార్లకు అజర్‌బైజాన్ ఎరలుగా వేసింది. ఆ తరవాత ఆ రాడార్లను ధ్వంసం చేసింది. పాక్, చైనాలే భారత్‌కు ప్రధానంగా ప్రత్యర్థులు. చైనాలో వివిధ శ్రేణుల్లో డ్రోన్ల తయారీ భారీయెత్తున జరుగుతోంది. వీటిలో అమెరికా రేపర్ డ్రోన్లతో పోటీపడే చైనా సీహెచ్-4 రెయిన్‌బో రకం డ్రోన్ ఆరు ఆయుధాలను ప్రయోగించగలదు. ఇక చైనానుంచి పాక్‌కు సీహెచ్-4 రెయిన్‌బో, వింగ్‌లూంగ్ డ్రోన్లు సరఫరా అవుతున్నాయి. వీటిలో వింగ్‌లూంగ్‌లు పాక్‌లోనే తయారు అవుతున్నాయి. దీనికి తోడు అజర్‌బైజాన్‌కు డ్రోన్లు సరఫరా చేసిన టర్కీ ఇప్పుడు పాక్‌తో అంటకాగుతోంది. మరోపక్క డ్రోన్లను అడ్డుకొనే ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కోసం ఇప్పటికే వ్యూహాత్మక మద్దతు దళ (ఎస్‌ఎస్‌ఎఫ్) విభాగాన్ని చైనా ఏర్పాటు చేసుకొంది. భారత్‌కు ప్రధానంగా ఇజ్రాయెల్ డ్రోన్లను సరఫరా చేస్తోంది. వీటిల్లో నిఘాకు వాడే 90వరకు హెరాన్ డ్రోన్లు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. దీంతోపాటు హరూప్ ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. గంటకు 800 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే నిఘా డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఏడాది మార్గం సుగమమైంది. దీంతో గత వారమే వీటిలో రెండు నౌకా దళానికి చేరాయి. నౌకాదళంలో ఎక్కువగా రష్యా ఆయుధాలు ఉండటంతో సాంకేతికత బయటకు పొక్కే ప్రమాదం ఉందని సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా జంకుతోంది.