భారత్‌లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపుల విధానం ఇప్పటికే సర్వవ్యాప్తమైంది. దానివల్ల వీసా, మాస్టర్ కార్డుల ఆధిపత్యం హరించుకుపోతోంది. ఫ్రాన్స్‌లో లైరా నెట్‌వర్క్ సంస్థ యూపీఐ విధానాన్ని చేపట్టడంతో ఐరోపా సమాఖ్య (ఈయూ)లో తొలిసారి భారతీయ యూపీఐ అడుగు మోపింది. భీమ్ యూపీఐతోపాటు రుపే ఏటీఎం-డెబిట్ కార్డులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల ద్వారా దన్ను ఇస్తోంది. ఇండియాలో ప్రస్తుతం 60 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లలో 97శాతం గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై, మిగిలిన మూడు శాతం ఆపిల్ ఐఓఎస్ మీద నడుస్తున్నాయి. ఈ గుత్తాధిపత్యాన్ని నిలువరించేలా కేంద్రం మొబైల్ ఫోన్లలో వాడటానికి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఇండ్‌ఓఎస్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
గూగుల్ యజమాని అయిన ఆల్ఫబెట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ విపణిలో ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా, యాప్‌ల మార్కెట్లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా తనకు పోటీ లేకుండా చేసుకుందని గత అక్టోబరులో భారత పోటీతత్వ రక్షణ కమిషన్ (సీసీఐ) ఆరోపించింది. గూగుల్ సంస్థ తన గూగుల్ మ్యాప్స్, క్రోమ్ బ్రౌజర్, యూట్యూబ్ వంటి యాప్‌లను స్మార్ట్‌ఫోన్లలో ముందుగానే తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా ఫోన్ ఉత్పత్తిదారులను ఒత్తిడి చేస్తోందని, ఇకపై దీనికి స్వస్తి చెప్పాలని సీసీఐ ఆదేశించింది. గూగుల్‌కు 16.1 కోట్ల డాలర్ల జరిమానాను సైతం విధించింది. సీసీఐ జారీ చేసిన ఆదేశాన్ని గూగుల్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దానివల్ల ఆండ్రాయిడ్ ఓఎస్‌కు తీరని నష్టం వాటిల్లుతుందని, వెయ్యికి పైగా ఉత్పత్తి సంస్థలతో, వేలమంది యాప్ రూపకర్తలతో తాను కుదుర్చుకున్న ఒప్పందాలకు విఘాతం కలుగుతుందని కోర్టులో గూగుల్ వాదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతలోని త్రిసభ్య ధర్మాసనం సీసీఐ ఉత్తర్వు అమలును వారం రోజులపాటు వాయిదా వేసింది. ఆ ఉత్తర్వును రద్దు చేయడానికి మాత్రం అంగీకరించలేదు. మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యం చలాయిస్తున్న మాట నిజమేనని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఇప్పటికే పరిశీలిస్తున్న దిగువస్థాయి ట్రైబ్యునల్ మార్చి 31లోగా తుది నిర్ణయం ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది. తమ దేశంలో ఆండ్రాయిడ్ వినియోగంపై ఆంక్షలు విధించినందుకు గూగుల్‌కు దక్షిణ కొరియా జరిమానా విధించింది.