తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అమెరికా, రష్యాలతో మైత్రిపై భారత్‌ ఆచితూచి అడుగులు! - అమెరికా అంతర్గత రాజకీయాల్లో రష్యా జోక్యం

అంతర్జాతీయంగా ఉండే చాలా అంశాల మీద అమెరికా, రష్యాలు ఒక తాటి మీదకు రావడం అనేది అరుదు. ఎప్పుడు చూసిన ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటునే ఉండే వారు. కానీ ఇప్పుడు చైనా ఆధిపత్య ధోరణితోనో లేక బైడెన్​ చొరవతోనో ఇరుదేశాధినేతలు కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారు, అయితే ఇంతకు ముందువరకు కేవలం రష్యాతోనే సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న భారత్​.. ట్రంప్ హాయాంలో మంచి ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పింది. దీంతో అంతర్జాతీయంగా మైత్రీ సంబంధాలు నెలకొల్పడంలో కూడా మోదీ సర్కార్​ సమతుల్యం పాటిస్తుంది.

america and Russia
అమెరికా, రష్యా

By

Published : Jun 28, 2021, 7:14 AM IST

అంతర్జాతీయంగా పలు అంశాల్లో అమెరికా, రష్యా విభేదాల సంగతి జగద్విదితం. దాన్ని మించి తమ అంతర్గత వ్యవహారాల్లో ఎదుటివారు జోక్యం చేసుకుంటున్నారని ఇటీవల ఇరుదేశాలూ ఒకదానిపై మరొకటి గుర్రుమంటున్నాయి. ఒకప్పుడు తమలో అంతర్భాగమైన ఉక్రెయిన్‌ను అమెరికా తమకు శాశ్వతంగా దూరం చేసిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆగ్రహంగా ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరిట తమ దేశ రాజకీయాల్లో అమెరికా తలదూరుస్తోందంటూ పుతిన్‌ సర్కారు మండిపడుతోంది. రష్యా సైతం తమ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుందంటూ అమెరికా భావిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి మాస్కో సైబర్‌ మార్గంలో జోక్యం చేసుకుందని అమెరికన్‌ రాజకీయ, భద్రతా వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. రష్యా, చైనాలను ఈ వర్గాలు అమెరికాకు బద్ధశత్రువులుగా పరిగణిస్తున్నాయి.

నాడు ఆంక్షలు-నేడు చర్చలు..

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక రష్యాతో సంబంధాలు మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించినా అమెరికా ప్రభుత్వ వర్గాలు, పార్లమెంటు ఆయన యత్నాలకు గండికొట్టాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం, దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఇటీవల అమెరికాలోని కొలోనియల్‌ పైపులైన్‌ సంస్థపై, ఇతర మౌలిక వసతులపై జరిగిన సైబర్‌ దాడులకు రష్యాయే కారణమని అమెరికన్లు అనుమానిస్తున్నారు. రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం చేసి, జైలులో పెట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో పుతిన్‌ హంతకుడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో పరిస్థితి రెండు దేశాలూ తమ తమ రాయబారులను వెనక్కు పిలిపించుకునేదాకా వెళ్లింది. ఇటీవల జెనీవాలో బైడెన్‌, పుతిన్‌ల మధ్య చర్చలు జరిగిన దరిమిలా రాజకీయ వాతావరణం కొంత చల్లబడింది.

సైబర్​ భద్రతపై ఒకే తాటిపైకి..

జెనీవా చర్చలతో సైబర్‌ భద్రత విషయంలో గొప్ప పురోగతి సంభవిస్తుందని ఎవరూ ఆశలు పెట్టుకోకపోయినా, కనీసం దాని గురించి మాట్లాడుకోవడానికి బైడెన్‌, పుతిన్‌లు అంగీకరించడం చెప్పుకోవలసిన పరిణామం. టెలికమ్యూనికేషన్లు, ఆహారం, ఆరోగ్య సేవలు, తాగునీరు, ఇంధన సరఫరా, బ్యాంకింగ్‌, రక్షణ పరిశ్రమల వంటి 16 కీలక మౌలిక వసతులపై సైబర్‌ దాడులకు ఒడిగట్టకుండా సంయమనం పాటించాలని బైడెన్‌ ప్రతిపాదించారు. తమ దేశం నుంచి అమెరికాపైనే కాదు, ఉక్రెయిన్‌, సౌదీ అరేబియాలపైనా సైబర్‌ దాడులు జరిగాయనే ఆరోపణలను పుతిన్‌ తోసిపుచ్చారు. అమెరికాయే తమపై సైబర్‌ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే, సైబర్‌ భద్రతపై చర్చించడానికి రెండు దేశాలూ నిపుణుల బృందాలను నియోగించాలనే అంగీకారం కుదరడం విశేషం. అంతమాత్రానికే ఏదో ఒరిగిపోతుందని ఆశలు పెట్టుకోనక్కర్లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడి మేధాహక్కులను చోరీ చేస్తోందనే ఆరోపణ చాలాకాలంగా వినవస్తోంది. దీన్ని నివారించాలని బరాక్‌ ఒబామా హయాములో జిన్‌పింగ్‌ను ఒప్పించినా, ఆచరణలో సైబర్‌ దాడులు ఆగలేదు. బైడెన్‌, పుతిన్‌ చర్చల్లో అఫ్గానిస్థాన్‌ విషయంలో మాత్రం ఆశావహ సూచనలు కనిపించాయి. అఫ్గాన్‌ సమస్యను పుతిన్‌ స్వయంగా లేవనెత్తారు. అక్కడి పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయనేది చాలావరకు పుతిన్‌పైనే ఆధారపడి ఉంటుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌తోపాటు ఇరాన్‌ విషయంలోనూ తన సహాయం ఉంటుందని పుతిన్‌ హామీ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలు విరమించుకోకముందే తాలిబన్లు విజృంభిస్తున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో... ఇకపై అక్కడ పాకిస్థాన్‌, చైనాల ప్రాబల్యం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా సైతం అఫ్గాన్‌ వ్యవహారాల్లో కీలక పాత్ర వహిస్తే, అది భారత్‌కు ప్రయోజనకరంగా మారుతుందనడంలో సందేహం లేదు.

అమెరికా, రష్యాలతో ఆచితూచి..

జెనీవా చర్చలను రష్యా నిర్మాణాత్మకమైనవిగా వర్ణించగా, బైడెన్‌ వాటిని సానుకూల చర్యగా పేర్కొన్నారు. మానవ హక్కులు, సైబర్‌ భద్రత, ఉక్రెయిన్‌ల విషయంలో విభేదాలు మిగిలే ఉన్నాయి. చైనాతో తెగతెంపులు చేసుకునేలా రష్యాను ఒప్పించడం సులువని అమెరికన్లు భావించే పరిస్థితి లేదు. తమవైపు నుంచి రష్యాపై ఒత్తిళ్లు తగ్గించడానికి మాత్రం వారు సుముఖత కనబరిచారు. ఇది ఎంతవరకు నిర్దిష్ట కార్యాచరణకు దారితీస్తుందో చూడాలని రష్యా భావిస్తోంది. అమెరికా, రష్యా సిగపట్ల మధ్య భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. గడచిన 70 ఏళ్లుగా భారత్‌, రష్యాల మధ్య స్నేహసహకారాలు వర్ధిల్లుతున్నా ఇటీవలి కాలంలో రష్యా, చైనాల మధ్య సాన్నిహిత్యం పెరగడాన్ని భారత్‌ నిశితంగా గమనిస్తోంది. భారత్‌-అమెరికాల మధ్య క్వాడ్‌ పేరిట సైనిక సంబంధాలు బలపడటం రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రతిగా పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగు పరచుకోవడానికి మాస్కో ముందడుగు వేసింది. ఈ పరిణామాల మధ్య భారత్‌ ఒకవైపు రష్యాతో బంధం చెడిపోకుండా చూసుకుంటూనే అమెరికా కూటమితో సంబంధాలు పటిష్ఠం చేసుకోవడానికి లౌక్యం, నేర్పరితనం ప్రదర్శించాలి.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని
(అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details