తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చతుర్భుజి కూటమి నావికాదళం భారత్​కు బలమేనా?

మలబార్ సైనిక విన్యాసాల్లో ఆస్ట్రేలియాను ఆహ్వానించే విషయంపై భారత్ సమాలోచనలు జరుపుతోంది. ఈ విషయంలో ముందడుగు పడితే... అమెరికా, జపాన్, భారత్​, ఆస్ట్రేలియా కలిసి చతుర్భుజ కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో పూర్తి పట్టు సాధించాలని చూస్తున్న చైనా.. దీనిపై ఎలా స్పందిస్తుంది? కూటమి ముందున్న సవాళ్లేంటి?

India likely to invite Australia to join Malabar naval exercises
చతుర్భుజి కూటమి- ఆస్ట్రేలియాకు మలబార్ స్వాగతం!

By

Published : Jul 21, 2020, 8:59 PM IST

వాస్తవాధీన రేఖ వద్ద భారత్- చైనా మధ్య వైషమ్యాలు, లద్దాఖ్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతూ ఉండగా.. భారత్ ఈ సంవత్సరం చివరలో నావికా దళ విన్యాసాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొనాలని ఆస్ట్రేలియాను భారత్ ఆహ్వానించే అవకాశం ఉంది. త్రివిధ దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి.

ఈ విషయంపై శుక్రవారం(జులై 19న) భారత రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. సాధారణంగా భారత్​, అమెరికా, జపాన్​ దేశాలు కలిసి నిర్వహించే ఈ విన్యాసాలకు ఆస్ట్రేలియానూ ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తా ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. త్వరలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారిక ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఎవరి సమస్య వారిదే

ఈ విన్యాసాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మూడు దేశాలకు ఆస్ట్రేలియా తోడైతే కార్యాచరణ మరింత సులభమవుతుంది. ఈ నాలుగు దేశాలు చతుర్భుజ కూటమిగా కలిసి విన్యాసాల్లో పాల్గొనడం వల్ల నౌకాదళాల మధ్య సహకారం బలపడుతుంది. అయితే వాస్తవాదీన రేఖ వద్ద పరిస్థితులకు, దీనికి ముడిపెట్టడం సమంజసం కాదు. సరిహద్దులో ఉద్రిక్తతల ఫలితంగానే ఈ విన్యాసాలు జరగుతున్నాయని అనడం సరైనది కాదు. ఎల్​ఏసీ వద్ద కొనసాగుతున్న ఘర్షణలు పూర్తిగా భారత్- చైనా మధ్య ద్వైపాక్షికంగానే ఉంటాయి.

ఆ ఒక్కటి మినహా...

భారత్​-చైనా మధ్య శక్తియుక్తులను అంచనా వేసినప్పుడు చాలా అంశాల్లో డ్రాగన్ దేశమే పైచేయి సాధిస్తుంది. ఆర్థిక సూచీలు, సాంకేతిక పరిజ్ఞానం, సైనిక శక్తి సహా ఏ రంగంలో చూసినా భారత్​కు అందనంత ఎత్తులో ఉంది చైనా. కానీ వీటన్నిటికీ ఒక్క విషయం మినహాయింపు. అదే నావికా దళం! ఈ విషయంలో ఇప్పటికే భారత్​ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. చైనాతో పోలిస్తే కాస్త పైచేయి సాధించేందుకు భారత భౌగోళిక పరిస్థితులు సైతం కొంతమేర దోహదం చేస్తున్నాయి. అయితే బీజింగ్ ఈ అంతరాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఈ ఆధిపత్యం కొంతకాలం మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.

మలక్కా జలసంధి సహా ప్రపంచ మహాసముద్రాలలో అమెరికా ఆధిపత్యం పెరగడంపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే గత 25ఏళ్లలో పీఎల్​ఏ నేవీ వృద్ధిని గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్​ నేవీ అభివృద్ధి చెందిన విధంగా ప్రస్తుతం చైనా నావికా దళం పుంజుకుంటోంది.

రెండు సమస్యలు

ప్రస్తుతం అంతర్జాతీయ సమాజానికి చైనా రెండు సవాళ్లను విసిరింది. మొదటిది కొవిడ్-19 మహమ్మారి. ఈ విషయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి బీజింగ్ ఎంత వరకు సిద్ధంగా ఉందనేది ఇప్పుడు ఓ ప్రశ్న. రెండు.. కొన్ని దేశాలను ప్రభావితం చేసే సరిహద్దులు, భూభాగం(తైవాన్), సముద్ర జలాలపై అధికారం ప్రకటించుకోవడం. ఈ వాదనలకు సంబంధించి చైనా సర్కార్ అవలంబిస్తున్న విధానాలు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్​ వంటి కార్యక్రమాలు వివిధ దేశాలకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. 2049 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యంతో చైనా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడమే అనేక దేశాల్లో పెరుగుతున్న ఆందోళనకు కారణం. 1949లో ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్ట్ రాజ్యం 2049కి శతాబ్దం పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 'పాక్స్ సినికా' అనే తన సొంత చరిత్ర రచనా సిద్ధాంతాన్ని వల్లె వేస్తోంది చైనా.

ఒకరికొకరు అవసరమే!

చతుర్భుజ కూటమిలోని దేశాలకు చైనాతో వ్యూహాత్మక సంబంధాలు క్షీణిస్తున్నాయి. కానీ జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాలు... చైనాతో బలమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలు హఠాత్తుగా చైనా నుంచి దూరం వెళ్లే అవకాశం లేదు. మరోవైపు అమెరికా-చైనా పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో జపాన్, భారత్, ఆస్ట్రేలియా సమయోచితంగా అడుగులు వేస్తున్నాయి.

చైనా సైతం చతుర్భుజి కూటమిలోని దేశాలను విస్మరించే పరిస్థితి లేదు. ఈ దేశాలను దూరం చేసుకొని పాకిస్థాన్, దక్షిణ కొరియా, ఇరాన్ వంటి భావసారూప్యత కలిగిన దేశాలపైనే ఆధారపడలేదు. చైనా పట్ల సానుభూతి వైఖరితో ఉన్నప్పటికీ.. రష్యా సైతం చైనా కేంద్రీకృత ప్రపంచాన్ని ఆమోదించే అవకాశం లేదు.

స్థిరంగా ముందుకెళ్లాలి

కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకొని, స్థిరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు స్పష్టమైన కార్యాచరణ, లక్ష్యాలతో క్వాడ్ నమూనా అభివృద్ధి చెందాలి. ప్రతి దేశం ఈ నూతన సమష్టి సముద్ర ప్రాంతంలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాయనే దాని గురించి స్వీయ సమీక్ష చేసుకోవాలి.

ఈ సముద్ర సహకారం నాలుగు దేశాలకు మరిన్ని అవకాశాలు అందిస్తుంది. భవిష్యత్తులో ఒకరికొకరు పూర్తిగా అవగాహనకు రావడానికి సహకరిస్తుంది. అయితే ఇందులో ఇండోనేసియా వంటి ఆసియాన్ దేశాలను సైతం ఇందులో చేర్చుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారు.

అదే సమస్య

ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు 'యుఎన్​సీఎల్ఓఎస్' ఒప్పందంపై సంతకం పెట్టకపోయినా ఒప్పందం స్ఫూర్తికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ దీనికి విరుద్ధంగా.. చైనా 'యుఎన్​సీఎల్ఓఎస్'పై సంతకం చేసింది. కానీ ఈ ఒప్పందం ఆధారంగా... దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి 'ఐసీజే'(ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) ఇచ్చిన తీర్పును తిరస్కరించించింది. అందువల్ల చైనా సమ్మతిని నిర్ధరించడం చాలా కష్టమైన పని అవుతుంది. తెలివి గల దౌత్యం, నావికా సామర్ధ్యాల శక్తి ఈ రెండింటి సమ్మిళితంగా వ్యవహరిస్తుంది. కాబట్టి చతుర్భుజ కూటమికి ముందున్న దీర్ఘకాలిక సవాలు ఇదే.

(రచయిత- సి. ఉదయ్ భాస్కర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్)

ABOUT THE AUTHOR

...view details