తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'మోదీ సారథ్యంలో ఉజ్జ్వల భారతం వైపు వడివడిగా..'

ఆరు దశాబ్దాల్లో సాధించలేకపోయినదాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆరేళ్లలో సాధించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అభిప్రాయపడ్డారు. స్వావలంబన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరోచిత పోరాటం జరుపుతున్నారని చెప్పారు. ఉజ్జ్వల భారతావనిని సాధించాలనే ఆయన లక్ష్యం త్వరలో నెరవేరనుందని అభిప్రాయపడ్డారు.

Modi
మోదీ

By

Published : May 30, 2020, 9:12 AM IST

గడచిన ఆరేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యశీల నేతృత్వంలో భారతదేశ అభివృద్ధి యానం అద్భుతంగా, అనూహ్యంగా, ప్రశంసనీయంగా సాగింది. 2014లో మోదీ అధికారం చేపట్టడానికి ముందున్న పాలకులు నిష్ఫల వాగ్దానాలతో పొద్దుపుచ్చడంవల్ల ప్రజల్లో నిర్వేదం, దేశార్థికంలో ఎదుగూబొదుగూ లేని స్థితి, అంతటా ఆదుర్దా రాజ్యమేలేవి. మోదీజీ పగ్గాలు చేపట్టాక ఆయన పటిష్ఠ నాయకత్వంలో లక్ష్యాలను అనుకున్న సమయానికన్నా ముందే సాధించడాన్ని దేశ ప్రజలు సంతోషంగా వీక్షించారు.

ప్రజల శక్తి మీద నమ్మకం ఉంచి, వారి సహకారంతో ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం చూశారు. భారతదేశ చరిత్రలో మోదీజీ ఆరేళ్ల పాలన సువర్ణాక్షరబద్ధం కానున్నది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తొలి సంవత్సరం కాల చక్రంపై చెరగని ముద్ర వేయనున్నది. భారతదేశ అద్వితీయ పురోగమన గాథలో ఇది మరపురాని అధ్యాయం అవుతుంది. గడచిన ఆరు దశాబ్దాల్లో ప్రగతిపరంగా నెలకొన్న అగాధాన్ని మోదీ సర్కారు ఆరేళ్లలోనే అధిగమించి, స్వావలంబన భారత్‌కు పటిష్ఠ పునాది వేసింది.

అగ్రశ్రేణిలో ఇండియా

కొంతకాలం క్రితం వరకూ అయిదు అత్యంత బలహీన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ను నేడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి దేశాల సరసన నిలిపిన ఘనత మోదీ సర్కారుది. ఉగ్రవాద నీడను పారదోలి, ఆ భూతంతో నిర్ణయాత్మక పోరుకు జాతిని సమాయత్తం చేయడం, స్వచ్ఛ భారత్‌ ఉద్యమంతో శుచీశుభ్రతను ప్రజల జీవనంలో అంతర్భాగం చేయడం, పేద రైతుల జీవితాలనూ, గ్రామీణ భారతాన్ని రూపాంతరం చెందించడానికి పూనిక వహించడం మోదీ నాయకత్వ విశిష్టతలు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడమెలా అన్నది నరేంద్రమోదీ తన మొదటి విడత పాలనలోనే చేసి చూపించారు.

రెండో విడత పాలనలో తొలి సంవత్సరంలోనే దేశ ప్రజల కలలు సాకారమవుతాయని భరోసా కలిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో తానిచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది. ఇంతకాలం ఎన్నికల ప్రణాళికలంటే తమను మోసపుచ్చడానికి పార్టీలు ప్రచురించే అబద్ధాల దొంతరలని ఓటర్లు భావించేవారు. భాజపా ప్రభుత్వం ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి దృఢ సంకల్పం ప్రదర్శించడం ద్వారా ఎన్నికల ప్రణాళికలపై మళ్లీ నమ్మకం కలిగించి, ప్రజాస్వామ్య పునాదులను బలీయం చేసింది.

మోదీ హయాములో..

మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో 35ఎ, 370 అధికరణల రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి రంగం సిద్ధం చేయడం, తలాక్‌ త్రయం నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కలిగించడం, గత 70 సంవత్సరాల నుంచి అష్టకష్టాలు పడుతున్న వర్గాలకు పౌరసత్వ హక్కు కల్పనకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం వంటి చరిత్రాత్మక నిర్ణయాలెన్నో తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలివి.

50 కోట్లమంది పేదలకు ఆరోగ్య బీమా కోసం ఆయుష్మాన్‌ భారత్‌, కోట్లాది పేద మహిళలకు ఉజ్వల్‌ పథకం కింద వంటగ్యాస్‌, ఒక్కో రైతుకు ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం, పేదలకు గృహవసతి, జన్‌ధన్‌ ఖాతాల రూపంలో బడుగులను ప్రధాన ఆర్థిక స్రవంతిలో భాగస్వాములుగా మార్చడం వంటి నిర్ణయాలతో నవ భారత నిర్మాణానికి మోదీ ప్రభుత్వం వడివడి అడుగులు వేస్తోంది. రాజ్యసభలో మోదీ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోయినా ముఖ్యమైన బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోగలగడం, మన ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనం.

ఇంటా బయటా..

యూఏపీఏ, ఎన్‌ఐఏ చట్టాలతో ఉగ్రవాదం, అవినీతి భూతాల పనిపట్టి దేశ ప్రజల్లో కొత్త నమ్మకం కలిగించిన ఘనత మోదీ సర్కారుది. విదేశాంగ, రక్షణ విధానాలకు మునుపెరుగని దూకుడు తెచ్చి భారత్‌ పట్ల ప్రపంచ దృక్పథాన్ని మార్చేశారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో రెండో విడత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం- ఈసారి మొదటి ఏడాదిలోనే పలు కీలక నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకొచ్చింది.

పౌర విమానయాన రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, బ్యాంకుల విలీనం, ఎన్‌బీఎఫ్‌సీ రుణాలపై మారటోరియం, కంపెనీల చట్టానికి సవరణ, ఎంఎస్‌ఎంఈ రంగానికి సులభ రుణాలు, బోడో ఒప్పందం వంటివి మోదీ 2.0 తొలి సంవత్సర మైలురాళ్లు. దశాబ్దాల నుంచి నలుగుతున్న త్రివిధ దళాధిపతి పదవిని సాకారం చేసిన ఘనత కూడా మోదీ సర్కారుదే.

భారత శ్రేయస్సు కోసం..

రైతుల, వ్యాపారుల ప్రయోజనాలను సంరక్షించడానికే భారత్‌, ఆర్‌సీఈపీ ఒప్పందంపై సంతకం చేయకుండా వైదొలగింది. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా పాత్రపై అనుమానాలు రేగుతున్న వేళ ఆర్‌సీఈపీ ఒప్పంద భవిష్యత్తు ఏవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. రక్షణ పరిశ్రమ కారిడార్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా భారత ప్రభుత్వం రక్షణ కొనుగోళ్ల అగత్యాన్ని తగ్గించి అమూల్య విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది.

‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ అనే సూత్రంతో సామాజిక సముద్ధరణకు మోదీ సర్కారు కృషిచేస్తోంది. రైతులు, చిన్న వ్యాపారులు, కూలీలకు పింఛను పథకాలు, కొత్తగా జల శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, పంటలకు కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచడం వంటి పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాలకు భరోసా ఇస్తోంది.

సవాళ్లే అవకాశాలుగా...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్‌ సవాళ్లను అవకాశాలుగా మలచుకొంటోంది. కరోనాపై దృఢంగా పోరాడుతూ ప్రపంచానికి విభిన్న పంథా చూపుతోంది. కరోనావల్ల లాక్‌డౌన్‌ విధించక తప్పలేదు. దీని మూలంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కలిగిన నష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇది స్వావలంబన భారత్‌ నిర్మాణానికి కొత్త ఊపు తెచ్చింది.

పేదలు, కూలీలు, వృద్ధులు, రైతులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి కేవలం రెండు నెలల్లోనే రూ.60,000 కోట్లకు పైగా విడుదల చేయడం గమనార్హం. పేదలకు అయిదు నెలలపాటు ఉచిత రేషన్‌ ఇవ్వడమే కాక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.40,000 కోట్లను ప్రత్యేకంగా కేటాయించడం విశేషం.

ఏప్రిల్‌ నెలారంభం వరకు వ్యక్తిగత రక్షణ సాధనాలు (పీపీఈలు), వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కుల కోసం దిగుమతులే శరణ్యంగా ఉండేవి. ఇప్పుడు వాటిని మనమే సొంతంగా తయారుచేసుకోగలుగుతున్నాం. నేడు దేశంలో రోజుకు అయిదు లక్షల పీపీఈ కిట్లు, 2.5 లక్షల ఎన్‌95 మాస్కులను తయారు చేసుకొంటున్నాం. విదేశాల్లో కంటే చాలా తక్కువ ధరకు మన దేశంలో వెంటిలేటర్లు తయారవుతున్నాయి.

కరోనా రోగుల కోసం 10 లక్షలకు పైగా పడకలు సిద్ధం చేశాం. రోజుకు లక్షన్నర పరీక్షలు చేయగలుగుతున్నాం. కరోనా కష్టకాలంలో 55 దేశాలకు ప్రాణ రక్షక ఔషధాలను సరఫరా చేశాం. సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించి కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేయగలిగాం. స్వదేశీ, స్వావలంబన సాధనలకు మోదీ ఇచ్చిన పిలుపు జాతిని కదలించి కార్యోన్ముఖం చేసింది.

స్వావలంబన సాధ్యమైంది..

ఆయన నాయకత్వంలో భారతదేశాన్ని నిజంగా స్వతంత్ర స్వావలంబనాయుత దేశంగా తీర్చిదిద్దడానికి అవిశ్రాంత కృషి జరుగుతోంది. దోపిడికి తావులేని భారతదేశ నిర్మాణం, విద్య, ఉపాధి, వైద్య సేవల్లో అందరికీ సమానావకాశాలు లభించే, అన్ని వర్గాలకు సర్వతోముఖ అభివృద్ధి ఫలాలు అందే ఉజ్జ్వల భారతం కోసం మోదీ సర్కారు అవిరళ కృషి జరుపుతోంది. ఆరు దశాబ్దాల్లో సాధించలేకపోయినదాన్ని ఆరేళ్లలో సాధించి- స్వావలంబన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరోచిత పోరాటం జరుపుతున్నారు. ఉజ్జ్వల భారతావనిని సాధించాలనే ఆయన లక్ష్యం త్వరలో నెరవేరనుంది.

(రచయిత- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి)

ABOUT THE AUTHOR

...view details