నలభై అయిదేళ్లలో మొట్టమొదటిసారిగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సేనల మధ్య కాల్పులు జరిగి నెల రోజులు దాటింది. మొన్న జూన్‌లో గల్వాన్ లోయలో చైనా దొంగ దెబ్బకు 20మంది భారత జవాన్లు మరణించడానికి చాలా రోజుల ముందు నుంచే చైనీయులు వాస్తవాధీన రేఖను మార్చడానికి కుట్రలు చేస్తూ వచ్చారు. వీటిని భగ్నం చేసే సత్తా తనకుందని భారత్ నిరూపించుకుంది. ఆగస్టు 29-30 తేదీల్లో మన జవాన్లు కైలాస్ పర్వతశ్రేణిని గుప్పిట పట్టి ఎటువంటి అవాంతరాన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే భారత్ శాంతినే కోరుకొంటోందని రెండు దేశాల రక్షణ మంత్రుల, విదేశాంగ మంత్రుల సమావేశాల్లో దిల్లీ విస్పష్టంగా చెబుతూ వచ్చింది.
అదేసమయంలో చైనా దూకుడును అడ్డుకునే సత్తా తనకుందని చాటుకుంటోంది. ప్రపంచ జనాభాలో భారత్, చైనాల వాటా 36శాతంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించాలని భారత్ శతథా ప్రయత్నిస్తున్నా, కవ్వింపు చర్యలతో ఎల్‌ఏసీపై చైనా ఎప్పటికప్పుడు కుంపటి రాజేస్తూనే ఉంది.
ఇండియాకు ఇరుగూపొరుగు
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ 2020 సంవత్సరాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ సంవత్సరంలో ప్రపంచం ఆర్థికంగా, సాంఘికంగా, ఆరోగ్యపరంగా దారుణ నష్టానికి గురైంది. కరోనా గురించి ముందే హెచ్చరించకుండా, పరిస్థితిని ఈకాడికి తెచ్చినందుకు యావత్ ప్రపంచం చైనాను దోషిగా నిలబెడుతోంది. కొవిడ్ వ్యాప్తిలో తన పాత్ర నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి చైనా ఎల్‌ఏసీపై దుస్సాహసానికి ఒడిగట్టింది. అదేసమయంలో స్వదేశంలో
కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చడానికీ భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. బ్రిటిష్‌వారు భారత్‌ను విడచి వెళ్లేటప్పుడు దేశాన్ని అడ్డగోలుగా చీల్చారు. దాని ఫలితంగా కశ్మీర్ కోసం 1947-48లోనే పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన పదిహేనేళ్లకే చైనాతో యుద్ధం వచ్చిపడింది. అప్పట్లో భారత్‌కు సమర్థ నాయకత్వం, శత్రువు కుటిల ఎత్తులకు పైయెత్తులు వేసే చాకచక్యం కొరవడటం వల్ల 38,500 కిలోమీటర్ల అక్సాయ్ చిన్ భూభూగాన్ని కోల్పోవలసి వచ్చింది.
1965లో పాకిస్థాన్‌తో యుద్ధం వచ్చినప్పుడు దాన్ని రెండు సరిహద్దుల్లో సమరంగా మార్చడానికి పాక్, చైనాలు రెండూ పన్నాగం పన్నినా, భారత్ యుద్ధాన్ని వేగంగా ముగించి వాటికి ఆ అవకాశం చిక్కకుండా జాగ్రత్త పడింది.
1967లో భారత్, చైనాల మధ్య సాయుధ సంఘర్షణ జరిగిందనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సమరంలో భారత సేనలు సరిహద్దులో చైనా పప్పులు ఉడకనివ్వలేదు. ఇవాళ రెండు దేశాల సరిహద్దు ఇలా ఉందంటే కారణం- 1967నాటి సమరంలో భారత జవాన్లు చూపిన పరాక్రమమే.
భారత్, చైనా సరిహద్దును మూడు భాగాలుగా విభజించవచ్చు. ఇందులో పశ్చిమ సరిహద్దు లద్దాఖ్ ప్రాంతంలో 1,597 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. మధ్యభాగం లేదా 545 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పొలిమేరల్లో ఉంది. 1,346 కిలోమీటర్ల తూర్పు సరిహద్దు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో పొలిమేరల్లో ఉంది. ఈ మూడు సరిహద్దు రేఖలను కలిపి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)గా వ్యవహరిస్తున్నారు.