సాధారణంగా నాలుగేళ్లకోసారి ఘనంగా నిర్వహించే ఒలింపిక్స్ అంటే- ప్రపంచం నలుమూలలా అసంఖ్యాక క్రీడాభిమానులెందరికో నేత్రానంద పర్వం. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది వాయిదా పడి నేడు జపాన్ రాజధాని టోక్యోలో ఆరంభమవుతున్న క్రీడా సంరంభానిది, ఒలింపిక్స్ చరిత్రలోనే నవశకం. ఎన్నో పరిమితులు, సవాళ్లను అధిగమిస్తూ విశ్వక్రీడోత్సవాలకు ఆతిథ్యమివ్వడానికి సన్నద్ధమైన జపాన్ అడుగడుగునా ఆధునిక సాంకేతికతకు చోటుపెడుతోందన్న కథనాలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ నిబంధనావళిని కచ్చితంగా అమలుపరచడంలో భాగంగా పదిరోజుల క్రితమే టోక్యో నగరంలో ఆత్యయిక స్థితి విధించారు. ప్రత్యక్ష ప్రేక్షకులుండరు. పతక విజేతలను సత్కరించడానికి గౌరవ అతిథులకూ తావుండదు. రోబోలు, కృత్రిమ మేధ, వర్చువల్ రియాల్టీలను వినియోగిస్తూ క్రీడా నిర్వహణకు కొత్త సొబగులద్దుతారంటున్నారు.
మహిళలకు ప్రాధాన్యం..
ఈసారి లింగపరమైన సమతౌల్యం పాటించేలా చూస్తామన్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కనీసం 49 శాతం మహిళలు పాల్గొంటారని ముందుగానే ప్రకటించింది. అందుకు అనుగుణంగా రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తమ జట్లలో 50 శాతానికిపైగా వనితలకు చోటుపెట్టాయి. చైనా బృందంలో 69 శాతం, కెనడాకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో 61 శాతం స్త్రీలే కావడం విశేషం. టోక్యో బరిలో భారత్ తరఫున పోటీపడుతున్న 127 మంది క్రీడాకారుల్లో మహిళలు 44శాతంగా లెక్కతేలారు. క్రితంసారి రియో డి జనీరో వేదికపై పదమూడు క్రీడాంశాల్లో పాల్గొన్న ఇండియా టోక్యోలో ఆ సంఖ్యను 18కి విస్తరించడం పతకాల విజయావకాశాల్ని ఏ మేరకు మెరుగుపరుస్తుందో చూడాలి. రియోలో కనీసం డజను పతకాలు గెలవాలంటూ సచిన్ తెందుల్కర్ ప్రభృతులు నిర్దేశించిన లక్ష్య సాధనలో విఫలమైన మన జట్టు కేవలం రెండు పతకాలకే పరిమితమైంది. టోక్యోలోనైనా రెండంకెల సంఖ్యలో ఒలింపిక్ పతకాలు ఒడిసిపట్టడంలో భారత్ కృతకృత్యమవుతుందా?
పటిష్ఠ క్రీడా సంస్కృతి..
టోక్యో విశ్వ క్రీడాంగణంలో శాయశక్తులా సత్తా చాటుతామంటున్న 127 గురు సభ్యుల జట్టులో 50మంది హరియాణా, పంజాబ్‌లకు చెందినవారేనన్నది విస్మయపరచే యథార్థం. దేశ జనాభాలో కేవలం నాలుగు శాతానికి నెలవైన ఆ రెండు చిన్న రాష్ట్రాలూ 40 శాతం ఒలింపియన్లను పంపడం ఎంతో స్ఫూర్తిమంతం. తమిళనాడు, కేరళ, యూపీ, మహారాష్ట్ర, మణిపూర్ సైతం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ స్పర్ధకు పోటీదారుల్ని సన్నద్ధపరచడంలో తమవంతు భూమిక పోషించాయి. 138కోట్ల సువిశాల జనబాహుళ్యానికి ఆలవాలమైన భారతావనిలో రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో క్రీడావికాస ప్రణాళికలు చురుగ్గా అమలుకు నోచుకుని ఉంటే- ఏళ్లతరబడి పతకాల దుర్భిక్షం దాపురించేదే కాదు. ఈసారి షూటింగ్, జావెలిన్ త్రో, హాకీ, షటిల్ బ్యాడ్మింటన్, ఈత పోటీల్లో మనవాళ్లు దీటైన పాటవ ప్రదర్శన చేయగలరంటున్నా- ఇదమిత్థంగా విజయావకాశాలపై ధీమాగా చెప్పగల వీల్లేదు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్‌లో అమెరికా, జిమ్నాస్టిక్స్‌లో చైనా, ధనుర్విద్యలో దక్షిణకొరియా తదితరాలు తమ పట్టు బిగించి సగర్వంగా పతకాలు కొల్లగొడుతున్నాయి. అదే ఇక్కడ? పతకాలకు తీవ్ర కాటకం వేధిస్తోంది. ప్రతి పాఠశాలలో ఆటస్థలం, క్రీడాసామగ్రి విధిగా ఉండాల్సిందేనన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తి వాస్తవిక కార్యాచరణలో నిలువునా నీరోడుతోంది. క్రీడల్ని ప్రోత్సహించడంలో మందకొడిగా ఉన్న రాష్ట్రాలన్నీ గుర్తెరగాల్సింది ఏమిటంటే- వ్యాయామ విద్య, శారీరక శ్రమ అనేవి పిల్లల ఏకాగ్రతను, కుశాగ్రబుద్ధిని వికసింపజేస్తాయి. వారిలో ఉమ్మడి తత్వాన్ని పెంపొందించి, ఓటమీ జీవితంలో భాగమేనన్న సత్యాన్ని బోధపరుస్తాయి. క్రీడలన్నవి కప్పులు, పతకాలు నెగ్గడానికే కాదన్న స్పృహతో రేపటి పౌరుల బహుముఖ వికాసానికి దోహదపడేలా పటిష్ఠ క్రీడా సంస్కృతికి కేంద్రం, రాష్ట్రాలు అన్నిందాలా కూడిరావాలి. ఆ క్రమంలో సహజసిద్ధ ప్రతిభా సంపన్నులు వెలికివస్తే అంతర్జాతీయ క్రీడావేదికలపై భారత్ తలెత్తుకుని నిలవగలుగుతుంది!
ఇదీ చదవండి:Tokyo Olympics: ప్రారంభ వేడుకకు వేళాయెరా..