తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'ఆర్థిక వృద్ధి' ఆశల మొలకలు అప్పుడేనా? - Lockdown effect on Business

భారత్​- చైనా దేశాల సరిహద్దు ఘర్షణలు అందరి దృష్టిని మరల్చి.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి నెడుతున్నాయి. తొలుత భారత జీడీపీ వృద్ధి చెందుతుందని అంచనా వేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం వల్ల సుమారు 4.5 శాతం పతనమౌతుందని హెచ్చరికలు జారీచేసింది. 100 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం సరకుల కొనుగోళ్లు పెరుగుతాయని ఆశించిన వ్యాపారులకు కొవిడ్​ భయంతో భారీ ఆదాయాలకు గండిపడింది. మన్నిక గల వస్తువులకు కూడా గిరాకీ లేక ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయింది.

India has ignoring the Facts and thought for the growth of Economy
ఆశల మొలకలు అప్పుడేనా?

By

Published : Jul 10, 2020, 11:23 AM IST

చైనాతో సరిహద్దు వివాదం అందరి దృష్టినీ మరల్చినా, దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందన్న వాస్తవాన్ని విస్మరించడం పెద్ద పొరపాటు అవుతుంది. మొదట్లో భారత్‌ జీడీపీ వృద్ధిపై కాస్త ఆశావహ అంచనా వెలువరించిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, తాజాగా మన జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం మేర కోసుకుపోతుందని హెచ్చరించింది. అయినా కొందరు కేంద్ర మంత్రులు మన ఆర్థిక వ్యవస్థలో ఆశల మొలకలను చూస్తున్నారు. ఆ మొలకలు ఎప్పుడు పెరిగి పుష్పించి, ఫలాలు అందిస్తాయో వారికే తెలియాలి.

అది తొందరపాటే..

మంత్రులు తమకు అనువుగా ఉండే గణాంకాలను సూచిస్తున్నారే తప్ప అసలు నిజాలను గమనించడం లేదు. ఉదాహరణకు లాక్‌డౌన్‌కు ముందటి నెలకన్నా గత నెలలో రైల్వే రవాణా 26 శాతం పెరిగిందని ప్రభుత్వం చెప్పినా, అందులో తిరకాసు ఉంది. ఏప్రిల్‌లో పూర్తి లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో రైల్వే రవాణా స్తంభించిపోయింది. మే నెలలో లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల సరకుల రవాణా కాస్త పుంజుకొంది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరగడానికీ ఇదే కారణం. అంతమాత్రానికే ఆర్థిక వ్యవస్థలో ఆశాంకురాలను చూడటం తొందరపాటు అవుతుంది. ఈ ఏడాది మే నెలలో రైల్వే సరకుల రవాణాను, దేశమంతటా పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని గతేడాది మే నెలతో పోల్చిచూస్తే- వాస్తవమేమిటో బోధపడేది.

తగ్గిపోయిన 'గిరాకీ'

మన ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలతో పాటు గతంలో అనుక్షణం రద్దీగా ఉన్న బజార్లు సైతం ఇప్పుడు బోసిపోవడాన్ని బట్టి వస్తుసేవలకు గిరాకీ ఎంత పలచబడిపోయిందో వెల్లడవుతోంది. 100 రోజుల లాక్‌డౌన్‌ ముగిసిన తరవాత జనం ఎగబడి సరకులు కొంటారని ఆశించిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. జనంలో కరోనా భయానికి తోడు తరిగిపోయిన ఆదాయాలు ఈ దురవస్థకు దారితీశాయి. పారిశ్రామికోత్పత్తి ఇప్పటికీ సాధారణ స్థాయికి చేరుకోలేదు. మన్నిక గల వినియోగ వస్తువులకూ గిరాకీ లేక ఉత్పత్తి, సరఫరా స్తంభించాయి. హోటళ్లు, విమానయాన రంగాలు పూర్తిగా పడకేశాయి. మోటారు వాహనాల రంగం గిరాకీ లేక సతమతమవుతోంది.

పెరిగిన ఇంధన ధరలు

అంతర్జాతీయ విపణిలో పీపా ముడి చమురు ధర 40 డాలర్లకు పతనమైనా, స్వదేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల బాదుడు వల్ల లీటరు పెట్రోలు, డీజిల్‌ ధరలు రూ.80కి పైబడ్డాయి. అంతర్జాతీయ విపణిలో ధరల పతనం వల్ల ముడి చమురు దిగుమతులపై ప్రభుత్వానికి 5,000 కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. పెట్రోలియం చిల్లర ధరలపై సుంకాల పెంపు వల్ల అదనంగా లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇలా ఇంధన ధరలు పెరగడం ద్రవ్యోల్బణం హెచ్చడానికి దారితీసి ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది. మన ఉత్పత్తి వ్యయం పెరిగి ఇతర దేశాల సరకులతో పోటీపడలేని పరిస్థితి దాపురిస్తుంది. ప్రస్తుత కారుచీకట్లలో వ్యవసాయమొక్కటే వెలుగు రేఖ. రబీలో బంపర్‌ దిగుబడులు వచ్చాక, ఖరీఫ్‌లో నాట్లు జోరందుకున్నాయి. ఎరువులకు గిరాకీ పెరగడమూ సేద్యం దూసుకెళ్లబోతోందని సూచిస్తోంది. ఇంతా చేసి భారత జీడీపీకి వ్యవసాయం వల్ల సమకూరే వాటా కేవలం 15 శాతం కనుక, యావత్‌ ఆర్థిక రథాన్ని పరుగులు తీయించే జవనాశ్వం పాత్రను సేద్యరంగం పోషించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినందువల్ల భారత్‌ నుంచి ఎగుమతులు పెరిగే ఆశ లేదు. వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతులు జీడీపీని పరుగు తీయించే సూచనలు లేనప్పుడు, కేంద్ర మంత్రులకు ఆశల మొలకలు ఎలా కనిపించాయో వారికే ఎరుక.

మరో మాట...

బాబా రాందేవ్‌, కేజ్రీవాల్‌ మధ్య పోలికలున్నాయి. వీరిద్దరూ అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఎదిగిన ప్రముఖులే. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు ఉభయులూ ఇప్పుడు హజారే గురించి మరచిపోయారు. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు వ్యాపారిగా రూపాంతరం చెందారు. రాందేవ్‌ కోట్లకు పడగలెత్తితే, కేజ్రీవాల్‌ దిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలని కలలుకంటున్నారు. ఇద్దరూ అలవికాని వాగ్దానాలు చేయడంలో దిట్టలు. రాందేవ్‌ ఎయిడ్స్‌, క్యాన్సర్‌, కరోనా వ్యాధులకు మందు కనిపెట్టానని చెప్పుకొంటారు. స్వలింగ సంపర్కాన్ని అసహజంగా పరిగణించి, దాన్ని నయం చేసే మందునూ ఆవిష్కరించానన్నారు.

విఫలమైన దిల్లీ సర్కార్​

కొవిడ్‌ వ్యాధిని ఎదుర్కోవడంలో కేజ్రీవాల్‌ పూర్తిగా విఫలమయ్యారు. దిల్లీ ప్రభుత్వం నడిపే ఆస్పత్రుల్లోనూ వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సాధనాలను (పీపీఇ) కానీ, టెస్ట్‌ కిట్లను, తాగునీరు, ఆహారాన్ని కానీ సక్రమంగా అందించలేకపోయారు. వైద్య సిబ్బంది దిల్లీలో ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు చేస్తారన్న హామీని ఇంకేమి నిలబెట్టుకొంటారు? ఇక రాందేవ్‌ కనీసం ఎటువంటి క్లినికల్‌ ప్రయోగాలు చేయకుండానే కొవిడ్‌కు మందు కనిపెట్టేశానన్నారు. ఇద్దరి విషయంలో ప్రచారం జాస్తి, ఆచరణ నాస్తి.

- వీరేంద్ర కపూర్​, రచయిత

ఇదీ చదవండి:'గాలిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి- కానీ..'

ABOUT THE AUTHOR

...view details