'అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరు. ఉండేవి శాశ్వత ప్రయోజనాలు మాత్రమే'- బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ పామస్టన్ వ్యాఖ్యలివి. ఇటీవల ముగ్గురు విదేశీ ప్రముఖుల భారత పర్యటనలు పామస్టన్ మాటలు అక్షర సత్యాలని రుజువు చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో వాతావరణ సంక్షోభంపై నిర్వహించే వర్చువల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోదీని ఆహ్వానించడానికి ఆయన దూత జాన్ కెర్రీ దిల్లీ వచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా సరిగ్గా అదే సమయంలో దిల్లీని సందర్శించారు. ఆపైన వారం తిరగకుండానే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జా ఈవ్ లు ద్రియా ఇండియాకు వచ్చారు. వీరిలో రష్యా, ఫ్రాన్స్ మంత్రులు కొవిడ్, అసెంబ్లీ ఎన్నికల వల్ల మోదీని కలవలేకపోయారని అధికార వర్గాలు చెబుతుండగా- జాన్ కెర్రీ ఒకరోజు దిల్లీలోనే ఆగి మరీ మోదీని కలిసివెళ్లారు. మామూలుగానైతే భారత్‌కు అత్యంత అనుంగు మిత్రదేశమైన రష్యా మంత్రి కూడా వేచి ఉండాల్సింది. కానీ, లావ్రోవ్ అలా ఆగకుండా దిల్లీ నుంచి ఎకాయెకి పాకిస్థాన్‌కు వెళ్లిపోవడం ఆశ్చర్యకరం.
గతంలో భారత్, పాక్‌లను అమెరికా ఇలాగే ఒకే గాటన కట్టేది. ఇప్పుడు రష్యా అదే పని చేయడం మాస్కో దృక్పథంలో వచ్చిన మార్పునకు సంకేతంగా భావించాలి. ఫ్రెంచి విదేశాంగ మంత్రి సైతం మోదీని కలవలేకపోయినా ఇస్రోను సందర్శించి, భారత వ్యోమగాములను రోదసిలోకి పంపే గగన్‌యాన్ ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. అంతరిక్ష యత్రలకు ఒకప్పుడు పూర్తిగా రష్యాపై ఆధారపడిన భారత్ ఈసారి ఫ్రాన్స్ సహాయమూ తీసుకొంటోంది. అంతేకాదు, రష్యా నొచ్చుకుంటున్నా పట్టించుకోకుండా రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అమెరికా నుంచీ ఆధునిక ఆయుధాలను కొంటున్నది. మునుపటి రోజుల్లో దాదాపు అన్ని రకాల ఆయుధాల కోసం రష్యాపైనే ఆధారపడిన భారత్ ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ల నుంచి పెద్దయెత్తున ఆయుధాలు సమకూర్చుకొంటోంది.
కొత్త స్నేహాలు
పాత స్నేహాలు చెదిరిపోతూ కొత్త స్నేహాలు బలపడుతున్నాయా, లార్డ్ పామస్టన్ చెప్పినట్లు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారా- అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి అవునని సమాధానం చెప్పుకొంటూనే, చైనా మాదిరిగా తెగేవరకు లాగడం భారత్ నైజం కాదని గ్రహించాలి. నిజానికి గల్వాన్ లోయలో చైనా దుందుడుకు చేష్టలను అమెరికా ఖండించినంత ఘాటుగా రష్యా ఖండించకపోవడం భారత్‌కు నచ్చలేదు. అదేసమయంలో, లద్దాఖ్ ఘర్షణల సమయంలో భారత్ కోరిన వెంటనే రష్యా అనేక ఆయుధాలను పంపిన సంగతిని దిల్లీ మరచిపోలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ అంశాన్నే దిల్లీ పాత్రికేయుల సమావేశంలో లావ్రోవ్ సమక్షంలోనే అన్యాపదేశంగా ప్రస్తావించారు. ఈ మాట సూటిగా చెప్పి ఉంటే అటు చైనాకు, ఇటు అమెరికాకు కంటగింపయ్యేది. లౌక్యంగా పనులు పూర్తి చేసుకోవడమే భారత్ లక్షణం తప్ప చైనాలా బరితెగించడం కాదు. వాస్తవాలను గుర్తెరిగి ముందుకు సాగాలనీ భారత్‌కు తెలుసు. ఒకప్పటి అగ్రరాజ్యపు వెలుగులను కోల్పోతున్న రష్యా ఆర్థికంగా చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలతో సన్నిహిత సంబంధాల కోసం రష్యా మొదట్లోనే ప్రయత్నించినా, అటువైపు నుంచి తిరస్కారమే ఎదురైంది.
అఫ్గాన్‌లో పాక్, చైనాల ఆధిపత్యం
ఈఏడాది సెప్టెంబరు 11కల్లా అఫ్గాన్ నుంచి తమ సేనలను ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తరవాత అఫ్గాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయి తాలిబన్ రాజ్యం ఏర్పడటం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాలిబన్లకు పాకిస్థాన్ నుంచే కాకుండా చైనా, ఇరాన్, రష్యాల నుంచీ వత్తాసు లభిస్తోంది. 2001లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో ఏర్పడుతూ వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు భారత్ అండగా నిలుస్తూ వస్తోంది. భారీ వ్యయంతో రహదారులు, విద్యుత్కేంద్రాలు తదితర మౌలిక వసతులను నిర్మించింది. అమెరికా సేనల నిష్క్రమణ తరవాత అఫ్గాన్‌లో పాక్, చైనాల ఆధిపత్యం పెరిగి భారత్ ప్రయోజనాలకు భంగం కలగనుందన్నది అంచనా!