దేశంలో పాఠశాల విద్యారంగంలో నెలకొన్న మౌలిక వసతుల కొరత వల్లే విద్యార్థులు బడికి దూరమవుతున్నారని, నాణ్యమైన విద్య అందడం లేదని గతంలో అనేక అధ్యయనాలు చాటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో తాజాగా వెలువడిన విద్యా నివేదిక 2021 చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 24.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు; 94.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో ఏడుశాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 26:1 ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉన్నా, క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతిఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యత సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 21,077, ఉత్తర్‌ప్రదేశ్‌లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలోని పాఠశాలల్లో ఇప్పుడున్న విద్యార్థుల నిష్పత్తికి సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 3.23 లక్షలు, బిహార్‌లో 2.22 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 87,630, పశ్చిమ్ బంగలో 84,912 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇక తెలంగాణలో 37,204 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 27,398 మంది ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గత దశాబ్ద కాలంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ నియామకాలను విస్మరించాయి. అనేక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లతో సరిపెడుతున్నారు. మిజోరం, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రత్యక్ష నియామకాలు చేపట్టడం లేదు. ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావాలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడంతో ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి సన్నగిల్లుతోంది. కొన్ని విద్యా సంవత్సరాల్లో ఉపాధ్యాయ వృత్తివిద్యా కోర్సయిన బీఎడ్‌లో భారీగా సీట్లు మిగిలిపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.