సరిహద్దులో ఓవైపు చైనా కయ్యానికి కాలుదువ్వుతుంటే.. మరోవైపు నేపాల్ ప్రభుత్వం భారత్‌తో ఎప్పటినుంచో పెనవేసుకొని ఉన్న సంబంధాలను విస్మరిస్తూ గిల్లికజ్జాలకు దిగుతోంది. భారత్ అధీనంలో ఉన్న ప్రాంతాలను తమదిగా వాదిస్తూ వస్తోంది. భౌగోళిక చిత్రపటాలకు కొత్తరూపు ఇచ్చింది. సరిహద్దులో మొదలైన వివాదాన్ని మరింత సాగదీసేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ నదిపై చేపట్టిన వరద నియంత్రణ పనులను నిలిపివేస్తూ నేపాల్ జూన్ 21న(ఆదివారం) నేపాల్ నిర్ణయం తీసుకుంది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆదివారం నేపాల్ పోలీసులు, జిల్లా అధికారులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి:చైనా పాటకు నేపాల్ ఆట.. సరిహద్దు వివాదానికి ఆజ్యం
నేపాల్ నుంచి ప్రవహించే ఈ నది బిహార్ సితామఢి జిల్లాలో బాగ్మతి నదిలో కలుస్తుంది. లాల్బకేయతో పాటు నేపాల్ నుంచి ప్రవేశించే నదులు ప్రవాహం వల్ల బిహార్ చాలా నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నదులపై భారత్ అనేక ఆనకట్టలు నిర్మించింది. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు అధికారులు వాటిని పరిశీలించి, మరమ్మతులు నిర్వహిస్తారు. అయితే నేపాల్ అధికారుల జోక్యం చేసుకొని ఈసారి పనులను అడ్డుకున్నారు. నేపాల్ వైఖరితో ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.
నెలలో రెండోసారి
ఈ నెలలో భారత్‌తో తగువు పడటం ఇది రెండోసారి. జూన్ 12న సరిహద్దు దాటి వచ్చాడన్న కారణంతో ఓ భారత పౌరుడిని నేపాల్ సాయుధ బలగాలు కాల్చి చంపాయి. ఈ ఘటన స్థానిక శాంతిభద్రతల సమస్యగా అధికారులు చెబుతున్నప్పటికీ... ఆదివారం జరిగిన పరిణామాలు మాత్రం ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
2015లోనే అసలు సమస్య!
లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల విషయంలో వివాదం మొదలైనప్పటికీ.. 2015లోనే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో నేపాల్‌లో ఆర్థికపరమైన దిగ్బంధం(ఎకనామిక్ బ్లాకేడ్) వెనుక భారత్ ఉందన్నది వారి వాదన. అప్పటి నుంచి భారత్- నేపాల్ మధ్య ఉన్న ప్రతికూల పరిస్థితులను వేరొక దేశం తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి విశ్లేషిస్తున్నారు నిపుణులు.
ఇదీ చదవండి:భారత్-నేపాల్ విభేదాలకు కారణాలు ఇవేనా?
"కచ్చితంగా ఇందులో మూడో దేశం జోక్యం ఉంది. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్రస్తుత నేపాల్ నాయకత్వానికి చాలా రకాలుగా ప్రోత్సాహం లభించి ఉంటుంది."
-ప్రొఫెసర్ ఎస్డీ ముని, మాజీ దౌత్యవేత్త
భారత్-నేపాల్ మధ్య చాలా కాలంగా కాలాపానీ రగడ నలుగుతోందని దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణులు కె. యోమ్ పేర్కొన్నారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"నిజానికి సమస్య కాలీ నది జన్మస్థలం గురించి కాదు. భారత్ ఒక నిర్దిష్ట మార్గంలో వివరిస్తే... నేపాల్ మరో కోణంలో చూస్తోంది. సరిహద్దు వివాదాలు, ప్రాదేశిక సమస్యలు భావోద్వేగాలకు సంబంధించినవి. కాబట్టే ఇరుపక్షాలు దీన్ని పరిష్కరించలేకపోయాయి."
-కె. యోమ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్
నేపాల్ కాలాపానీ సమస్యను ప్రస్తావించడం కొత్తేం కాదు. 2015లో భారత్-చైనా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో లిపులేఖ్ పాస్‌ను ప్రస్తావించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
"నాథులా, కియాంగ్లా/లిపులేఖ్ పాస్, షిప్కిలా సరిహద్దుల ద్వారా వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసుకోవడం సహా వర్తక ఉత్పత్తుల జాబితాను పెంచడానికి చర్చలు జరిపేందుకు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి."
-భారత్-చైనా సంయుక్త ప్రకటన(మే 15, 2015)