తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​-ఈయూ మధ్య ఆ ఒప్పందం కష్టమే! - భారత్ ఐరోపా సమాఖ్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

సమీప భవిష్యత్తులో ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో వియత్నాంతో ఈయూ ఒప్పందం కుదుర్చుకోవడం భారత్​కు ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. బ్రెగ్జిట్ వంటి పరిణామాలు దీనికి మరో కారణంగా చెబుతున్నారు. ఇరుపక్షాలు సమతుల్యమైన విధానాలు పాటించి ఒప్పందం విషయంలో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.

India-EU free trade agreement unlikely in near future: Experts
భారత్​-ఈయూ మధ్య ఆ ఒప్పందం కష్టమే!

By

Published : Jul 19, 2020, 11:50 AM IST

Updated : Jul 19, 2020, 12:57 PM IST

భారత్, ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య వర్తక సంబంధాలు మెరగుపరిచే విధంగా అత్యున్నత స్థాయి చర్చలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇరుపక్షాల మధ్య సమీప భవిష్యత్తులో స్వేచ్ఛా వాణిజ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. గత నెలలోనే వియత్నాంతో ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భారత్​ అవకాశాలు సన్నగిల్లాయని స్పష్టం చేస్తున్నారు.

లాభదాయకమైన ఐరోపా మార్కెట్లోకి ప్రవేశించాలని భారత్​తో పాటు వియత్నాం సైతం తీవ్రంగా శ్రమించింది. గత నెలలో వియత్నాంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది ఈయూ. ఆసియాలో సింగపూర్​ తర్వాత ఈ ఒప్పందం చేసుకున్న దేశం వియత్నాం మాత్రమే.

ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్ మిషెల్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్​ డర్ లయెన్​లతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15వ ఇండియా-ఈయూ సదస్సులో పాల్గొన్నారు. వర్చువల్ మోడ్​లో జరిగిన ఈ సదస్సులో రాజకీయ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక సహకారంపై విస్తృతంగా చర్చించారు.

గణాంకాలు ఘనం

విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల(2018) ప్రకారం భారత్​కు ఐరోపా సమాఖ్య అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కాగా.. ఐరోపాకు భారత్ తొమ్మిదో పెద్ద భాగస్వామి. ఇరుదేశాల మధ్య 2018-19లో 115.6 బిలియన్ డాలర్ల వర్తకం జరిగింది. ఇందులో భారత ఎగుమతులు 57.17 బిలియన్ డాలర్లు ఉండగా.. దిగుమతులు 58.42 బిలియన్ డాలర్లు. సేవల ఎగుమతిలో భారత్​ ఈయూకి నాలుగో పెద్ద భాగస్వామి.

అంతేకాకుండా భారత్​కు వస్తున్న అత్యధిక పెట్టుబడులు ఐరోపా సమాఖ్య నుంచే ఉన్నాయి. ఏప్రిల్ 2000 నుంచి జూన్ 2018 మధ్య మొత్తం 90.7 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు భారత్​కు వచ్చాయి. ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 24 శాతం. దీంతో పాటు యూరోపియన్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంక్ 2017 మార్చిలో దిల్లీలో శాఖను ప్రారంభించింది. భారత్​లో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు రుణాలు అందిస్తోంది.

ఒప్పందానికి గ్రహణం

ఇలా ఈయూ, భారత్​ మధ్య లోతైన సంబంధాలు ఉన్నప్పటికీ.. బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్​మెంట్ అగ్రీమెంట్(బీటీఐఏ)​ అని పిలిచే.. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం మాత్రం తుది దశకు చేరలేకపోతోంది. 2007లో ప్రారంభమైన బీటీఐఏ చర్చలు దాదాపు 12 సమావేశాల తర్వాత 2013లో నిలిచిపోయాయి.

అన్ని దేశాలతో భారత్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు(బీఐటీ) రద్దు చేసుకోవడం వల్లే ఐరోపా దేశాల పెట్టుబడులకు ప్రస్తుతం రక్షణ లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. 2015 డిసెంబర్​లో కొత్త బీఐటీ విధానాన్ని రూపొందించిన తర్వాత భారత ప్రభుత్వం అన్ని దేశాలతో ఒప్పందాలను రద్దు చేసుకుంది.

ఆ తర్వాత పెట్టుబడి రక్షణ బాధ్యతలను ఐరోపా సభ్యదేశాలన్నీ యూరోపియన్ యూనియన్​కు కట్టబెట్టాయి. అనంతరం చోటుచేసుకున్న బ్రెగ్జిట్ వంటి పరిణామాలు భారత్-ఈయూ మధ్య వాణిజ్య సంబంధాలను అనిశ్చితిలోకి నెట్టాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

"ఆటోమొబైల్స్, విడిభాగాలు, వైన్​, డెయిరీ ఉత్పత్తులు, సమాచార భద్రత వంటి అంశాలన్నీ భారత్​- ఈయూ బీఐటీఏను నిలువరిస్తున్నాయి. ఓ ఎగుమతి సంస్థగా మేం ఎఫ్​టీఏను కోరుకుంటున్నాం. కానీ ఇదంతా.. ఇరుపక్షాల చొరవపై ఆధారపడి ఉంటుంది. రెండు వైపులా సమతుల్యమైన విధానం కావాలి."

-అజయ్ సహయ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్​పోర్ట్ ఆర్గనైజేషన్స్

బ్రెగ్జిట్ ఎఫెక్ట్

భారత్​కు బ్రిటన్ ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సెంటర్​ ఫర్ యూరోపియన్ స్టడీస్ ఛైర్​పర్సన్ గుల్షన్ సచ్​దేవా పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన నేపథ్యంలో బీటీఐఏపై భారత్​ భిన్న వైఖరి అనుసరించాలని అభిప్రాయపడ్డారు. ఈయూతో యూకే చేసుకునే ఒప్పందాన్ని బట్టి భారత్​ వాణిజ్య ఒప్పందం ఆధారపడి ఉంటుందని అన్నారు.

"వాణిజ్యం, పెట్టుబడులపై మరోమారు అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది కేవలం బీటీఐఏ చర్చలను పునరుద్ధరించే ప్రక్రియపైనే ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కాబట్టి సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం లేదు."

-గుల్షన్ సచ్​దేవా, సెంటర్​ ఫర్ యూరోపియన్ స్టడీస్ ఛైర్​ పర్సన్, జేఎన్​యూ

(రచయిత-అరూనిమ్ భుయాన్)

ఇదీ చదవండి-'పునరుత్పాదకంలో పెట్టుబడులకు అపార అవకాశాలు'

Last Updated : Jul 19, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details