హిందూ మహాసముద్రంలో బలమైన నౌకాదళ శక్తిగా అవతరించాలంటే సముద్ర తీర దేశాలు, ద్వీపదేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి. ఆసియా-ఆఫ్రికాల మధ్య ఉన్న ఈ సముద్రమార్గం ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనది. అందుకే చైనా చాపకింద నీరులా ఇక్కడ తిష్ఠవేస్తోంది. ప్రత్యేకించి ఆఫ్రికా తూర్పు తీరం, మడగాస్కర్‌లను విడదీస్తున్న మొజాంబిక్ ఛానల్‌తో పాటు మడగాస్కర్ పశ్చిమ తీరమూ అంతర్జాతీయ సముద్ర మార్గాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఆసియా నుంచి భారీ రవాణానౌకలు హిందూ మహాసముద్రం నుంచి కేప్ ఆఫ్ గుడ్‌హోప్ ద్వారా అట్లాంటిక్ సముద్రం మీదుగా ఐరోపా, ఉభయ అమెరికా ఖండాలకు వెళ్లి వస్తుంటాయి. వీటి రాకపోకలు వెనీలా దీవుల సమీపంలోని మొజాంబిక్ ఛానల్ ద్వారా సాగుతాయి. హిందూ మహాసముద్ర నైరుతి ప్రాంతంలోని సార్వభౌమ దేశాలైన కమరొజ్, మడగాస్కర్, మారిషస్, సీషెల్స్; ఫ్రాన్స్ పాలనలోని మెయెటె, రీయూనియన్‌లను వెనీలా ద్వీపాలుగా వ్యవహరిస్తారు. వెనీలాను ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో వాటికి ఆ పేరు వచ్చింది. హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్లో ఎలాంటి అలజడి ఏర్పడినా అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమవుతుంది.
మారిషస్‌తో కీలక ఒప్పందాలు..
ఆధునిక యుద్ధతంత్రంలో విమాన వాహక నౌకలతో పాటు దీవుల్లో నౌకాదళ స్థావరాల ఏర్పాటు ముఖ్యమైనది. భారత్ సైతం మారిషస్, సీషెల్స్‌తో ఆ దిశగా ఒప్పందాలు కుదుర్చుకొంది. ఇటీవలే సీషెల్స్‌కు పీఎస్ జొరాస్టర్ అనే గస్తీనౌకను కానుకగా ఇచ్చింది. 2005 నుంచి ఇప్పటి వరకు భారత్ ఇలాంటి నాలుగు నౌకలను ఆ దేశానికి బహూకరించింది. 2018లో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మడగాస్కర్, మారిషస్ దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో పలు ఒప్పందాలు కుదిరాయి. అంతకు మూడేళ్ల ముందు ప్రధాని మోదీ సీషెల్స్, మారిషస్‌లతో కీలకమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 2014లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార వేడుకలో ఇరుగు పొరుగుదేశాల అధినేతలతో పాటు మారిషస్ అప్పటి సారథి నవీన్ రాంగులామ్ పాల్గొన్నారు. మారిషస్‌లో భారత సంతతి ప్రజలు లక్షల్లో ఉన్నారు. ఆ దేశంతో వాణిజ్య, సైనిక సంబంధాలను మెరుగుపరిచేందుకు అనాడు మోదీ వేసిన మొదటి అడుగు మంచి ఫలితాలనే ఇచ్చింది. నిరుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం కమరోజ్‌లో పర్యటించింది.