పంటలకు కనీస మద్దతు ధర చెల్లింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యాలు నిల్వ చేయడం వల్ల అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో అసమతుల్యత ఏర్పడుతోందంటూ (WTO and Indian Agriculture) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), సంపన్న దేశాలు పదేపదే వివాదం రేపుతుంటాయి. ఆహార సబ్సిడీలు మొత్తం పంట విలువలో పది శాతానికి మించకూడదని పరిమితులూ విధిస్తాయి. ఈ క్రమంలో భారత్, చైనాలతోపాటు వర్ధమాన దేశాల బృందమైన గ్రూప్ ఆఫ్ 33, ఆఫ్రికా దేశాలు- సబ్సిడీలపై పట్టువిడుపులు ప్రదర్శించాలంటూ డబ్ల్యూటీఓపై ఒత్తిడి తెస్తున్నాయి. కనీస మద్దతు ధరను మరింత పెంచాలని కోరుతున్నాయి. దీనిపై పరస్పర ప్రయోజనం దక్కేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించాయి. నవంబరు 30న జెనీవాలో జరిగే డబ్ల్యూటీఓ సమావేశంలో అదేపనిగా వరసపెట్టి నోటిఫికేషన్లు జారీ చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్ధమాన దేశాల ప్రజల కోసం ఆహార ధాన్యాలను, ఇతర పంటలను మొత్తం ఎంతమేర నిల్వ చేయాలో అంచనా వేయడానికి మరింత సమాచారం కావాలంటూ బ్రిటన్, కెనడా వంటి దేశాలు ఇటీవల డబ్ల్యూటీఓ వ్యవసాయ సంఘం సమావేశంలో అభిప్రాయపడ్డాయి. కరోనా మహమ్మారి వల్ల బడుగు దేశాల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారని రుజువు చేసేందుకు ఎలాంటి సమాచారం, సాక్ష్యాధారాలు అక్కర్లేదని భారత్ స్పష్టంచేసింది. ఆహార సబ్సిడీల (WTO and Agricultural Subsidies in India) వల్ల అంతర్జాతీయ ఎగుమతి విపణిపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, సబ్సిడీలు లేదా కనీస మద్దతు ధర చెల్లించి సేకరించే ధాన్యాన్ని, ఇతర ఉత్పత్తులను స్వదేశంలోనే వినియోగిస్తాం తప్ప, ఎగుమతి చేయబోమని భారత్, చైనా, జీ-33 దేశాలు భరోసా ఇస్తున్నాయి. ఈ విషయమై భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అక్టోబరు 20న దిల్లీ వచ్చిన డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకాంజో ఐవీలాతో చర్చలు జరిపారు.
మద్దతు ధరపై స్వేచ్ఛ
కరోనా వల్ల దెబ్బతిన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించడానికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో పంట ఉత్పత్తి వ్యయంకన్నా 150 శాతం ఎక్కువ ధరను కనీస మద్దతు ధరగా (Minimum Support Price in India) ప్రకటించారు. ఇది డబ్ల్యూటీఓ విధించిన పది శాతం పరిమితిని మించిపోతుంది. నవంబరులో జరిగే సమావేశంలో అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాలు దీనికి తీవ్రంగా అభ్యంతరపెట్టనున్నాయి. భారత్ ప్రకటించే కనీస మద్దతు ధర వరి, గోధుమ సాగు విలువలో 60 నుంచి 70శాతం వరకు ఉండి, డబ్ల్యూటీఓ విధించిన పది శాతం పరిమితిని అతిక్రమిస్తోందని అమెరికా వాదిస్తోంది. అసలు కనీస మద్దతు ధరపై పరిమితి విధించడం వెనక తర్కం ఏమిటని భారత్ నిలదీయాలి. తన ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడే విధంగా మద్దతు ధరను నిర్ణయించుకోవడానికి తనకు స్వేచ్ఛ ఉండాలని మనదేశం భావిస్తోంది. వ్యవసాయ ధరల్లో వచ్చే హెచ్చు తగ్గుల నుంచి సన్నకారు, చిన్నకారు రైతులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో అసలు సబ్సిడీలను లెక్కించడానికి డబ్ల్యూటీఓ అనుసరిస్తున్న విధివిధానాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుత సబ్సిడీలను నిర్ణయించడానికి డబ్ల్యూటీఓ 1986-88 నాటి అంతర్జాతీయ ధరల సగటును ప్రాతిపదికగా తీసుకోవడం అభ్యంతరకరం. ఈ సగటుకన్నా ఎక్కువ చెల్లించే వర్ధమాన దేశాలు అంతర్జాతీయ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ, ఆ దేశాలపై జరిమానా విధించే అధికారం డబ్ల్యూటీఓకు ఉంది. సంపన్న దేశాలు తమ ఆహార ధాన్యాలను పేద దేశాల్లో కారుచౌక ధరలకు గుమ్మరించి, స్థానిక వ్యవసాయాన్ని దెబ్బతీసి, తామే అక్కడ పాగా వేయడానికి డబ్ల్యూటీఓ విధానం ఉపకరిస్తుంది.
మోకాలడ్డుతున్న సంపన్న దేశాలు
ఏటా 17,000 కోట్ల డాలర్ల వ్యవసాయ సబ్సిడీలను ఇస్తున్న అమెరికా, ఐరోపాలు- పేద దేశాలకు మాత్రం మోకాలడ్డుతున్నాయి. వ్యవసాయం ద్వారా సంపన్న దేశాలకు చేకూరుతున్న జీడీపీలో 50శాతాన్ని తిరిగి సబ్సిడీల కింద చెల్లిస్తున్నాయి. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ బిల్లు, అక్కడి వ్యవసాయ కార్పొరేషన్లకు జాక్‌పాట్‌లా మారింది. బిల్లు పుణ్యమా అని అమెరికన్ బహుళజాతి వ్యవసాయ కంపెనీలు నేడు ప్రపంచవ్యాప్తంగా సోయా, మొక్కజొన్న, పత్తి, కోడి మాంసం ధరలను శాసిస్తున్నాయి. కానీ, భారత జీడీపీలో వ్యవసాయ సబ్సిడీల వాటా పది శాతంకన్నా తక్కువే. అయినా సబ్సిడీలను తగ్గించాలని సంపన్న దేశాలు ఒత్తిడి తీసుకురావడం విస్మయకరం.