2020 జూన్ 15... ప్రశాంతంగా ఉండే హిమగిరుల్లో రక్తపాతం జరిగిన రోజు. విస్తరణ కాంక్షతో మదమెక్కిన డ్రాగన్ బరితెగింపునకు దిగిన రోజు. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనికులతో భారత జవాన్లు వీరోచితంగా పోరాడిన రోజు. భారత సైన్యంలో 20 మంది కొదమ సింహాలు అసువులు బాసిన రోజు.
భారత్-చైనా సైన్యాల మధ్య అత్యంత భీకరమైన పోరాటం జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. సరిగ్గా సంవత్సరం క్రితం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు ఇరుదేశాల సైన్యం మధ్య రక్తపాతం చోటు చేసుకుంది. అతిపెద్ద ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి అనేక విడతలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో జూన్ 15న ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ప్రస్తుతం పరిస్థితులెలా ఉన్నాయని ఒక్కసారి పరిశీలిస్తే..
గల్వాన్ ఘటనకు కారణం?
గల్వాన్ ఘటనకు ముందే భారత్ చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన మొదలైంది. వాస్తవాధీన రేఖ విషయంలో మే 5న ఈ వివాదం మొదలైంది. క్రమంగా పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తన పట్టును పెంచుకుంటూ వచ్చింది. సైన్యాన్ని అధికంగా మోహరించింది. పాంగాంగ్ సరస్సు చుట్టూ 100 గుడారాలను నిర్మించింది.
ఇదీ చదవండి:భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!
ఈ నేపథ్యంలో చైనా నిర్మించిన గుడారాలను తీసేందుకు కర్నల్ బీఎస్ సంతోష్ బాబు నేతృత్వంలోని బిహార్ రెజిమెంట్ గల్వాన్ లోయలోని చైనా స్థావరం వైపు వెళ్లింది. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. ఇనుప రాడ్లు, మేకులు దించిన చువ్వలతో చైనా సైనికులు కర్నల్ సంతోష్ బాబు బృందంపై దాడి చేశారు. అయితే, వీరిని సంతోష్ బాబు బృందం దీటుగా ఎదుర్కొంది. ఈ ఘటనలో సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు సుమారు 45 మంది చనిపోయినట్లు అంచనా. అయితే ఆ దేశం మాత్రం మృతుల సంఖ్యపై బుకాయిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి:ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?
సైనిక చర్చలు
గల్వాన్ ఘటన జరిగిన తర్వాత భారత సైన్యం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య 11 విడతల చర్చలు జరిగాయి. 2020 జూన్ 6న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య తొలి సమావేశం జరిగింది. పాంగాంగ్ సో సరస్సుతో పాటు, గోగ్రా, హాట్‌స్ప్రింగ్, దెమ్చోక్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నీ మిశ్రమ ఫలితాలే అందించాయి. పాంగాంగ్ సెక్టార్లో సైనికులను వెనక్కి తీసుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించుకోవడం కొంత సానుకూల విషయం అయితే, మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ సైతం పేపర్‌పైనే ఉందని, చైనా ఈ ఒప్పందాన్ని అమలు చేయడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:గల్వాన్ లోయలో ఆ రోజు అసలేం జరిగింది?