సరిహద్దుల వెంబడి డ్రాగన్ దూకుడును ప్రతిఘటించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత సైనికాధికార గణం ధీమాగా చెబుతున్నా- క్షేత్రస్థాయి కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 101 ఇళ్లతో ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా నాలుగున్నర కిలోమీటర్ల మేర మన భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు జనవరి నాటి ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. వివాదాస్పద హిమాలయ పర్వత ప్రాంతాల్లో సుమారు ఆరువందల ఆధునిక గ్రామాలు నిర్మించాలన్న చైనా యోచనను హాంకాంగ్ నుంచి వెలువడే 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' లోగడే బహిర్గతం చేసింది. అందుకోసం రూ.38 వేల కోట్ల మేర వ్యయీకరించిందన్న లెక్కలూ వెలుగు చూశాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దుల ఆవల వందల సంఖ్యలో చైనా గ్రామాల అవతరణ అక్షర సత్యమని ఈస్టర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే తాజా వాఖ్యలు ధ్రువీకరిస్తున్నాయి.
అంతర్గత సమస్యలు, కలహాల నుంచి ప్రజానీకం దృష్టిని మళ్లించడానికి సరిహద్దు అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్నారన్న చైనా అధికార మీడియా 'గ్లోబల్ టైమ్స్' కథనం సర్వం అబద్ధాల అల్లికేనని ఇప్పుడు నిర్ద్వంద్వంగా రుజువైంది. అంతిమ పరిష్కారం లభించేంత వరకు రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను కచ్చితంగా గౌరవించాలన్నది 1993 నాటి ఒప్పంద స్ఫూర్తి. దాన్ని తుంగలో తొక్కి ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం, దెమ్‌చోక్, గల్వాన్ లోయ, దౌలత్ బేగ్ ఓల్డీలను కబళించాలని తహతహలాడుతున్న చైనా కుత్సిత బుద్ధితో విస్తరణవాదానికే గట్టిగా ఓటేస్తోంది. తద్వారా విద్వేషాల చిచ్చు రగిలించడానికే అలవాటుగా తెగబడుతోంది.
గల్వాన్ లోయ తనదేనంటూ గత సంవత్సరం సరిహద్దులు మీరిన చైనా తెంపరితనం 20 మంది భారత వీర జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఈ పదిహేడు నెలలుగా- ఒకవైపు చర్చల ప్రస్తావన, మరోపక్క డ్రాగన్ కుహకాల బాగోతం.. రెండు నాల్కల ప్రతీపధోరణిని కళ్లకు కట్టింది. గల్వాన్ గాయం పచ్చిగా ఉండగానే 'రెడ్ ఎకో' పేరిట హ్యాకర్ల బృందమొకటి భారత విద్యుత్ రంగ వ్యవస్థలకు, నౌకాశ్రయాలకు గురిపెట్టి విధ్వంస సృష్టికి తెగబడింది.పెద్దయెత్తున సైబర్ దాడులతో దేశాన్ని అల్లకల్లోలం చేయగల సామర్థ్యం చైనాకుందంటూ, యావత్ యంత్రాంగం ఎంత అప్రమత్తంగా మెలగాలో రక్షణ బలగాల సారథి జనరల్ బిపిన్ రావత్ ఆరు నెలల క్రితమే ఉద్బోధించారు.