India Canada Issue : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ 18న కెనడాలో హత్యకు గురయ్యాడు. ఆగస్టు 12న ఆ దేశంలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ప్రఖ్యాత లక్ష్మీనారాయణ ఆలయంపై ఖలిస్థానీ ఉన్మాదులు దాడి చేశారు. 'హర్దీప్ హత్యోదంతంలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేయాలి' అంటూ రాసుకొచ్చిన పోస్టర్లను ఆ మందిరం గోడలపై అతికించారు. ఈ నెల 18న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ- తమ దేశ పౌరుడు నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండవచ్చుననే విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయంటూ వాచాలత్వం ప్రదర్శించారు.
భారతదేశంపై విద్వేష విషాన్ని విరజిమ్ముతున్న ఖలిస్థానీల వదరబోతు వ్యాఖ్యలనే ఆయన వల్లెవేశారు. పన్నెండుకు పైగా ఖూనీ, ఉగ్రవాద కేసుల్లో నిందితుడైన నరహంతకుడు నిజ్జర్. తప్పుడు పాస్‌పోర్ట్ మీద పాతికేళ్ల క్రితం కెనడాకు పారిపోయాడు. 2014లోనే ఇంటర్‌పోల్ అతడిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది. హర్దీప్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ, అతడి అరాచకాలపై కెనడాకు ఇండియా ఎప్పుడో పూర్తి వివరాలు అందజేసింది. ముష్కర మిన్నాగును పట్టి బంధించడంపై కెనడా అధికారవర్గాలు ఆసక్తి చూపలేదు సరికదా- హర్దీప్‌కు ఏకంగా తమ దేశ పౌరసత్వాన్ని కట్టబెట్టాయి.
కర్కోటక ఉగ్రవాదిని సొంత పౌరుడిగా చంకనెక్కించుకోవడమే సిగ్గుచేటు అయితే- ఇండియాపై నోరుపారేసుకోవడం ట్రూడో తెలివిమాలినతనానికి నిదర్శనం. అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ తాజాగా మండిపడినట్లుగా- నిరాధార ఆరోపణలకు తెగబడటం ద్వారా కెనడా ప్రధాని సరిదిద్దుకోలేని భారీ తప్పిదానికి పాల్పడ్డారు. ఖలిస్థానీలకు మద్దతుదారుడైన నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ సాయంతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న జస్టిన్ ట్రూడో- తన పదవికోసమే ముష్కరులకు పక్కవాద్యం వాయిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇండియాపై అవాకులూ చెవాకులూ పేలిన ఆయన- ఇరుపక్షాల నడుమ దౌత్యపరమైన ఉద్రిక్తతలను చేజేతులా రాజేశారు!
భారతదేశ జాతీయ భద్రతకు అతిప్రమాదకరమైన ముష్కర మూకలకు కెనడా స్వర్గధామం కావడం కొత్తేమీ కాదు. 'కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఖలిస్థాన్'గా తనకు తాను ప్రకటించుకున్న సూర్జన్ సింగ్ గిల్- 1982లో కెనడాలోని వాంకూవర్‌లో సమాంతర సర్కారీ దుకాణాన్ని తెరిచాడు. ఖలిస్థానీ పాస్‌పోర్టులను జారీచేయడం వంటి విపరీత పనులకు ఒడిగట్టాడు. పంజాబ్‌లో ఇద్దరు పోలీసులను చంపి పరారైన తల్వీందర్ సింగ్ పర్మార్‌ను ఇండియాకు అప్పగించేందుకు అప్పటి కెనడా ప్రధానమంత్రి పిరె ఇలియట్ ట్రూడో(నేటి ప్రధాని జస్టిన్ తండ్రి) నిరాకరించారు. ఆపై 1985లో ఎయిరిండియా 'కనిష్క' విమానాన్ని పేల్చేసిన ఖలిస్థానీలు- మూడొందలకు పైగా నిండు జీవితాలను బూడిద చేశారు.