తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​పై పాక్​ విష ప్రచారం.. ఆ ఛానళ్లను అడ్డంపెట్టుకుని... - india ban on pakistan social media accounts

India ban on Pakistan social media accounts: భారత్​పై దాడి చేసేందుకు ప్రతీ వనరుని పాకిస్థాన్​ అస్త్రంగా వాడుకుంటోంది. కొత్తగా సామాజిక మాధ్యమాల్లో భారత్​పై విష ప్రచారం చేస్తోంది. ఇలా మన దేశంపై విషప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు రెండు ట్విటర్‌ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను కేంద్రం నిషేధించింది. ఇలా బ్యాన్​ చేయడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

india banned pakistani youtube channels
సామాజిక మాధ్యమాల్లో పాక్‌ బరితెగింపు

By

Published : Feb 1, 2022, 9:31 AM IST

India ban on Pakistan social media accounts: భారత్‌పై విద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ పాకిస్థాన్‌ వదిలి పెట్టడం లేదు. సరిహద్దుల్లో ఆగడాలు, ఉగ్రవాద దాడులతో ఇబ్బందిపెట్టే దాయాది దేశం- ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఇండియాలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, భారత్‌పై విషప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు రెండు ట్విటర్‌ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తాజాగా కేంద్రం నిషేధించింది. ఇలా నిషేధించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.

'లద్దాఖ్‌లో చైనా సైన్యానికి సహకరించేందుకు ఉత్తర కొరియా సేనలు అక్కడికి చేరుకున్నాయి. దాంతో మోదీ ప్రభుత్వం నిర్ఘాంతపోయింది; జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 371ను దుర్వినియోగం చేసినందుకు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన సేనలను అక్కడ మోహరించబోతున్నారు; 300 మంది భారతీయ గూఢచారులను ఉరితీసిన తాలిబన్లు...'- ఇవన్నీ పాక్‌ గడ్డపై నుంచి నడుస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లలో వచ్చిన పతాక వార్తలు. భారత వ్యతిరేక ప్రచారం చేయడమే కాకుండా, మన సార్వభౌమత్వానికీ భంగకరంగా అవి వ్యవహరిస్తున్నాయి. రెండు దఫాలుగా నిషేధం విధించిన మొత్తం 55 ఛానళ్ల వెనక నయా పాకిస్థాన్‌ గ్రూప్‌, అప్నీ దునియా, తల్హా ఫిలిం నెట్‌వర్క్‌ లాంటి బలమైన వ్యవస్థలు ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. వాటిలో భారత వ్యతిరేక వార్తల శీర్షికలు, హ్యాష్‌ట్యాగ్‌లు ఒకేలా ఉండటం, ఒకే రకమైన వార్తలను అవన్నీ ప్రచారం చేస్తుండటాన్నిబట్టి ఆ సంస్థలన్నీ ఒకే రకమైన దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా కొనసాగిస్తున్నాయని అర్థమవుతుంది. వాటిలో చాలా ఛానళ్లను పాకిస్థాన్‌లో ప్రముఖ వార్తా సంస్థల యాంకర్లే నిర్వహిస్తున్నారు. దాన్నిబట్టి అవన్నీ దాయాది దేశానికి తెలిసే జరుగుతున్నాయన్న విశ్లేషణలకు బలం చేకూరుతోంది. విద్వేష ప్రచారమే కాకుండా నకిలీ వార్తల వ్యాప్తితో అవన్నీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వర్గవిభేదాలు తెచ్చి సమాజంలో కల్లోలం రేపేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. దాంతో వాటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడిం చారు. ప్రజలు సైతం తమ దృష్టికి వచ్చే ఇలాంటి దుష్ప్రచారంపై సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు. భారతీయ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించడానికి ఈ యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు సామాజిక మాధ్యమాలనూ పాకిస్థాన్‌లోని పలు సంస్థలు వినియోగించుకుంటున్నాయి. అయిదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలనూ ప్రభావితం చేసేలా వాటి దుష్ప్రచారం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పాక్‌ కేంద్రంగా సాగే యూట్యూబ్‌ ఛానళ్లు చిలవలు పలవలు చేసి చూపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం, సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణం, భారత సైన్యం, భారత్‌-చైనా సంబంధాలు... ఇలా ప్రతి అంశంలోనూ మన దేశంపై దుష్ప్రచారమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయి. తాజాగా నిషేధించిన 35 యూట్యూబ్‌ ఛానళ్లను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 1.20 కోట్లకు పైనే ఉంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2021లోని కీలక సెక్షన్ల కింద వాటిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని నియంత్రించడానికి భారత్‌ ఐటీ చట్టానికి పదును పెట్టడంతోనే నిషేధం వంటి కఠిన చర్యలు తీసుకోగలుగుతున్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనం కఠినంగా వ్యవహరిస్తుండటంతో సామాజిక మాధ్యమ సంస్థలు సైతం వాటిపై గట్టి చర్యలకు సిద్ధమవుతున్నాయి. 35 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌ నిషేధాన్ని ప్రకటించిన మర్నాడే గతంలో నిషేధించిన వాటిలో 19 ఛానళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ప్రసారం కాకుండా కట్టడి చేసినట్లు యూట్యూబ్‌ ప్రకటించింది. పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మన ప్రయత్నాలకు ఇది నైతిక స్థైర్యాన్ని ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమ సంస్థలనూ కేంద్ర ప్రభుత్వం నకిలీ వార్తల విషయంలో అప్రమత్తం చేస్తోంది. నకిలీ వార్తలను, దేశంపై దుష్ప్రచారాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నేరుగా సామాజిక మాధ్యమ సంస్థలనూ హెచ్చరించడం ఇప్పుడు అత్యవసరం. లేదంటే పేర్లు, ఐపీ చిరునామాలు మార్చి దాయాది దేశ సంస్థలు మరో వైపునుంచి దాడిని కొనసాగించే ప్రమాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details