ఇటీవల లద్దాఖ్‌లో భారత్, చైనా సైనిక ఘర్షణ చిన్న స్థాయిలోనే జరిగినా, అది పెరిగి పెద్దదై అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచం కలవరపడింది. అలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) భరోసా ఇస్తోంది. భారత్, చైనా, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌లకు చెందిన 119 మంది నిపుణులను ఇంటర్వ్యూ చేసిన మీదట సిప్రి ఈ నిర్ధరణకు వచ్చింది. ఈ నిపుణుల్లో అత్యధికులు ఇంకా సర్వీసులో ఉన్న సైన్యాధికారులే. భారత్, చైనాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశమే లేదని, అది అనూహ్యమని సిప్రి తేల్చిచెప్పింది. తమకుతాముగా ఏ దేశం మీదా అణు దాడి చేయకూడదన్నది భారత్, చైనాల ప్రకటిత విధానం కావడమే ఇందుకు కారణం.
2018లో అరిహంత్ జలాంతర్గామిని జలప్రవేశం చేయించేటప్పుడు ప్రధాని మోదీ స్పందిస్తూ- భారత్ తనకుతానుగా ఏ దేశంపైనా అణ్వస్త్ర ప్రయోగానికి దిగబోదని స్పష్టంగా ప్రకటించారు. ఏదైనా దేశం తమ మీద అణుదాడికి దిగినప్పుడు మాత్రమే ఎదురుదాడి చేస్తాం తప్ప, తామే ముందుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమని రెండు దేశాలూ మొదటి నుంచీ చెబుతున్నాయి. కనుక రెండు దేశాల మధ్య అణుయుద్ధం అనూహ్యమని సిప్రికి నిపుణులు వివరించారు. భారత్, చైనా, పాకిస్థాన్, అమెరికాల సమీకరణలు- దక్షిణాసియా స్థితిగతులను కొత్త కోణం నుంచి దర్శించాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. పాకిస్థాన్‌కు చైనా సాధారణ ఆయుధాలతోపాటు అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. మరోవైపు భారత్, అమెరికాలు ఇండో-పసిఫిక్, క్వాడ్ పేరిట సైనికంగా చేరువవుతున్నాయి. ఈ పొత్తుల పట్ల భారత్, చైనాలకు ఎవరి భయాలు వారికి ఉన్నాయి. దక్షిణాసియాలోని మూడు అణ్వస్త్ర దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీయడం, ఈ భయాలకు మూలకారణం.
ఉద్రిక్తతలు నెలకొన్నా..
లద్దాఖ్‌లో గత ఏడాది నుంచే భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా, రెండు దేశాలు ఏ దశలోనూ అణ్వస్త్రాల కోసం ప్రయత్నించలేదు. ఉభయ దేశాల అణ్వస్త్ర బలగాల అధికారులు రహస్య సమావేశాలు జరపడం కానీ, రాజకీయ నాయకులు అణు యుద్ధ హెచ్చరికలు జారీచేయడం కానీ జరగలేదు. ఉభయ దేశాల్లో ఇలాంటి ప్రమాదం గురించి చర్చలూ లేవు. దీనికి కారణం- తమకుతాముగా మొట్టమొదట అణ్వస్త్ర ప్రయోగానికి దిగకూడదన్న విధానమే. పాకిస్థాన్‌కు అలాంటి పట్టింపులేమీ లేవు. భారత్‌తో నేరుగా తలపడి నెగ్గలేమనే ఉద్దేశంతో అణ్వస్త్ర బెదిరింపులకు దిగుతుంటుంది. ఇలాంటి ప్రమాదకర విధానానికి భారత్, చైనా బహుదూరం. ఇతర దేశాలు తమను అణ్వస్త్ర పరంగా బెదిరించకుండా నిలువరించేందుకే అణు ఆయుధాలను సమకూర్చుకున్నాయే తప్ప తామే దాడులకు పాల్పడే ఆలోచన లేదు. అందుకే ఈ విషయంలో సంయమనం, స్థిరత్వాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అరిహంత్ జలాంతర్గామితో..