తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అగ్రరాజ్యంతో 'రక్షణ' బంధం మరింత బలోపేతం - భారత్ అమెరికా సంబంధాలు

భారత్​, అమెరికాల మధ్య సైనిక పరమైన సహకారం మరింత పెరిగేందుకు వీలుగా ‘బేసిక్‌ ఎక్స్‌ఛేంజి అండ్‌ కోఆపరేషన్‌ (బెకా) ఒప్పందంపై మంగళవారం ఉభయ దేశాలు సంతకం చేశాయి. భారత్ చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో బెకా ఒప్పందం కీలకం కానుంది.

india-america- beca -deal
అగ్రరాజ్యంతో రక్షణ బంధం

By

Published : Oct 28, 2020, 8:29 AM IST

భారత్​, అమెరికా మధ్య సంబంధాల్ని బలోపేతం చేసే దిశగా మంగళవారం కీలకమైన బేసిక్‌ ఎక్స్‌ఛేంజి అండ్‌ కోఆపరేషన్‌ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అత్యాధునిక మిలిటరీ సాంకేతికతను, ఉపగ్రహ రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవటానికి ఈ ఒప్పందం వీలు పడుతుంది. ఒకే రకమైన విలువల్ని విశ్వసిస్తూ, ఒకే విధమైన లక్ష్యం కోసం పరిశ్రమిస్తున్న భారత్‌ అమెరికాలు పరస్పర సంబంధాల్ని మెరుగుపరచుకొని పటిష్ఠ భాగస్వాములుగా ఎదగాలన్న వ్యూహాత్మక ఒడంబడిక పట్టాలకెక్కి రెండు దశాబ్దాలైంది.

నాలుగు కీలక ఒప్పందాలు :

ఇండియాతో ప్రగాఢ భాగస్వామ్యం లేని ప్రపంచాన్ని ఊహించలేక పోతున్నానన్న బిల్‌క్లింటన్‌ జమానాలోనే రెండు దేశాల నడుమ ‘జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలిటరీ ఇన్‌ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌’పై 2002లో సంతకాలు జరిగాయి. అగ్రరాజ్యంతో సుదృఢ సహకారానికి ప్రాతిపదికలైన నాలుగు కీలక ఒప్పందాల్లో అది మొదటిది. ఒబామా హయాములో ఇండో పసిఫిక్‌ తీరంలో భారత్‌ పోషించగల క్రియాశీల భూమికపై దార్శనిక పత్రం వెలువడింది. 2016 ఆగస్టులో సైనిక బలగాల మధ్య అనుసంధానం మరింత బలపడేలా ‘లాజిస్టిక్స్‌ ఎక్స్‌ఛేంజి మెమోరాండం’ ఒప్పందం కుదరగా- 2018లో ఇరుదేశాల రక్షణ విదేశాంగ మంత్రుల ఉమ్మడి తొలి భేటీలోనే సమాచార అనుకూలత భద్రత ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

బెకా ఒప్పందం :

అదే ఊపులో ఉభయ దేశాల రక్షణ సంబంధాల్ని మరింతగా ముడివేస్తూ ‘బేసిక్‌ ఎక్స్‌ఛేంజి అండ్‌ కోఆపరేషన్‌ (బెకా) ఒడంబడికపై తాజాగా దిల్లీ వాషింగ్టన్లు చేవ్రాలు చేయడంతో- వ్యూహాత్మక బాంధవ్యం కొత్త పుంతలు తొక్కుతోంది.

అత్యాధునిక మిలిటరీ సాంకేతికతను, ఉపగ్రహ రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపకరించే తాజా ఒప్పందం వల్ల ఇండియా సైనిక రహస్యాలు అమెరికా గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదంపై భయానుమానాలు వ్యక్తమయ్యాయి. కూలంకష చర్చల దరిమిలా వాటిని నివృత్తి చేసుకొన్నాకే కుదిరిన ఒప్పందం రక్షణ పరంగా భారత్‌ అమెరికాల్ని మరింత చేరువ చేసింది.ఇటీవలే అమెరికా జపాన్‌ ఇండియా ఆస్ట్రేలియాల ‘క్వాడ్‌’కు అంకురార్పణ జరిగి సంయుక్త నౌకా విన్యాసాలకూ ముహూర్తం ఖరారైన వేళ- ‘బకా’ భారత్‌కు వ్యూహాత్మక దన్ను కానుంది.

భారత్​ వ్యూహాత్​క భాగస్వామి :

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పట్టుమని వారం కూడా లేని తరుణంలో హడావుడి ఒప్పందాలు ఎందుకన్న గళాలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. డెమోక్రాట్లు రిపబ్లికన్లలో ఎవరు గెలిచినా భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా ఇండియా ప్రాధాన్యం తగ్గేది కాదని ఇరవయ్యేళ్ల అనుభవాలు చాటుతున్నాయి. సామ్రాజ్యవాద ధోరణులతో మిడిసిపడుతున్న చైనా విస్తరణ కాంక్ష అమెరికా ఇండియా సహా ఎన్నెన్నో దేశాలకు కలవర కారకమవుతోంది. దక్షిణ చైనా సముద్రంపై సర్వం సహాధిపత్యం తనదేనంటూ ట్రైబ్యునల్‌ తీర్పునూ కాలదన్నుతున్న చైనా- తైవాన్‌ను గుప్పిటపట్టేందుకు ‘రణ’గొణ ధ్వనులు చేస్తోంది.

చైనా దుశ్చర్యలకు కళ్లెం :
ఆరు నెలలుగా లద్దాఖ్​ సరిహద్దుల్లో అతిక్రమణలకు తెగించిన బీజింగ్‌- తన ‘వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌’ ఆధ్వర్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి కీలక ప్రాంతాలన్నింటా మౌలిక సదుపాయాల మెరుగుదల వ్యూహంతో ఉద్రిక్తతల్ని ఊహాతీతంగా పెంచుతోంది. ‘సైనికంగా గట్టి ఒత్తిడి తెస్తేనేగాని సరిహద్దు సమస్యపై ఇండియా దారికి రా’దంటూ చైనా ప్రభుత్వం తన మనోగతాన్ని ‘గ్లోబల్‌టైమ్స్‌’ ద్వారా పలికించింది.

ఆర్థికంగా సైనికంగా బలీయశక్తిగా ఎదిగిన చైనా- తనకు వ్యతిరేకంగానే ఇండియా అమెరికాలు చేరువ అయ్యాయంటూ వాటి వ్యూహాలకు దీటుగా జవాబిస్తామనీ ప్రకటించింది. ఒకనాటి ప్రచ్ఛన్న యుద్ధం సోవియట్‌ యూనియన్‌ పతనంతో కాలగర్భంలో కలసిపోయినా, చైనా విస్తరణ వాదంతో అది మళ్ళీ పురుడు పోసుకుంటున్న వాతావరణం నెలకొంటోంది.

విద్య, వైద్యం, ఇంధనం, ద్వైపాక్షిక వాణిజ్యం, అఫ్గానిస్థాన్‌లో శాంతి, సమాచార ప్రసార సాంకేతికత, ప్రజల నడుమ సంబంధ బాంధవ్యాలు, 5జి పరిజ్ఞానం వంటి బహుళ అంశాలను తాజా సంయుక్త ప్రకటన స్పృశించినా- రక్షణ రంగ సహకారమే ప్రధానంగా పైకి తేలిందంటే అది చైనా సృష్టించిన ఉద్రిక్తతల చలవే. తాజా ఒప్పందం బీజింగ్‌ దుందుడుకుతనానికి కొంతైనా బ్రేకులు వేసేదే!

ABOUT THE AUTHOR

...view details