India Alliance in Madhya Pradesh :2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విపక్షాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఎవరి దారి వారిదే అన్న రీతిలో సాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నెలకొన్న మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, ఆమ్ఆద్మీ, జేడీయూ నుంచి 90కిపైగా స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉండటం.. కాంగ్రెస్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
India Alliance in Assembly Elections :రసవత్తరంగా సాగుతున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారైనా గెలిచి అధికారాన్ని తిరిగి అందుకోవాలన్న కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా సాధారణ మెజార్టీకి 116 స్థానాలు అవసరం. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల నుంచి 92 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. సమాజ్‌వాదీ(ఎస్పీ), ఆమ్ఆద్మీ, జేడీయూ పార్టీలు మొత్తంగా 92 చోట్ల పోటీ చేస్తుండగా.. వీటిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన, ఓడిన సీట్లు అనేకం ఉన్నాయి.
Samajwadi Vs Congress in Madhya Pradesh :2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఒక చోట నెగ్గిన సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. మిత్రపక్షం జీజీపీతో కలిసి 1.3 శాతం ఓట్లు సాధించింది. ఈసారి కాంగ్రెస్ తమకు కనీసం 6 స్థానాలు కేటాయిస్తుందని ఎస్పీ ఆశించింది. అందుకు కాంగ్రెస్ నిరాకరించడం వల్ల సమాజ్‌వాదీ పార్టీ ఒంటరి పోరుకు దిగింది. 46 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. సమాజ్‌వాదీ ప్రస్తుతం బరిలో ఉన్న స్థానాల్లో 19 సీట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవే. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌తో తాము ఇలానే వ్యవహరిస్తామని ఇప్పటికే సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తేల్చి చెప్పారు.
ఆప్ సైతం..
మరోవైపు, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా కృతనిశ్చయంతో ఉంది. దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆప్ 208 నియోజకవర్గాల్లో పోటీ చేయగా అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 0.66 శాతం ఓట్లు వచ్చాయి. అయితే వింధ్య ప్రాంతంలోని సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఆప్ అధ్యక్షురాలు రాణి అగ్రవాల్ విజయం సాధించారు. తద్వారా బీజేపీ ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరారు. ఆ విజయం ఆమ్‌ఆద్మీ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున దిల్లీ, పంజాబ్ సీఎంలు మధ్యప్రదేశ్‌లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో పోటీ చేయని జేడీయూ కూడా మధ్యప్రదేశ్‌లో ఈసారి 10 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.