తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆకలిమంటల్ని ఎగదోస్తున్న కరోనా!

కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో భాగంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతూ అసంఖ్యాకంగా బతుకులు పొగచూరుతున్నాయి. 1998 తరవాత మొదటిసారి ఈ ఏడాది అంతర్జాతీయంగా పేదరికం జడలు విరబోసుకుంటుందంటున్న ప్రపంచ బ్యాంకు, డిసెంబరు నాటికి 8 శాతం దాకా విశ్వజనాభా దుర్భరమైన పేదరికంలోకి కూరుకుపోతుందంటోంది.

Increasing poverty rate due to corona
ఆకలిమంటల్ని ఎగదోస్తున్న కరోనా!

By

Published : May 2, 2020, 8:35 AM IST

హింస వికృత రూపమే పేదరికం అనేవారు జాతిపిత బాపూ. దేశదేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణ అటువంటి హింసను ఆవేదనను ప్రేరేపిస్తున్నదంటున్నాయి ప్రపంచబ్యాంకు తాజా అంచనాలు! మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో భాగంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తుండటం తెలిసిందే. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతూ అసంఖ్యాకంగా బతుకులు పొగచూరుతున్నాయి. 1998 తరవాత మొదటిసారి ఈ ఏడాది అంతర్జాతీయంగా పేదరికం జడలు విరబోసుకుంటుందంటున్న ప్రపంచ బ్యాంకు, డిసెంబరునాటికి ఎనిమిది శాతం దాకా విశ్వ జనాభా దుర్భరమైన పేదరికంలోకి కూరుకుపోతుందంటోంది. 780 కోట్ల ప్రపంచ జనసంఖ్యలో ఆ రాశి సుమారు 62 కోట్లుగా లెక్కతేలుతోంది! సగం వరకు ఉద్యోగాలు మటుమాయం కానున్న సబ్‌-సహారన్‌ ఆఫ్రికా ప్రాంతం పాతికేళ్లలో తొలిసారి మాంద్యం పాలబడనుంది. దక్షిణాసియా గత నలభై ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి ఆర్థిక అవ్యవస్థను ఎదుర్కోబోతోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2006-2016 సంవత్సరాల మధ్య 21 కోట్ల మందిని దారిద్య్ర రేఖ ఎగువకు చేర్చిన ఇండియాకు సైతం ఇప్పుడు ఒడుదొడుకులు అనివార్యమన్నది ప్రపంచ బ్యాంకు అంచనా.

102వ స్థానంలో..

107 దేశాల అంతర్జాతీయ క్షుద్బాధా సూచీలో 102వ స్థానాన నిలిచి నిరుడు అప్రతిష్ఠ పాలైన ఇండియాపై కొవిడ్‌ సంక్షోభం తాలూకు దుష్ప్రభావ తీవ్రతను ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) ఇప్పటికే మదింపు వేసింది. కర్కశ వైరస్‌ దేశార్థికాన్ని కకావికలం చేస్తోందని, ఈ మహోత్పాతం సరైన జీవిక కొరవడ్డ 40 కోట్లమందిని పేదరికంలోకి ఈడ్చుకుపోతుందని మూడు వారాల క్రితమే అది హెచ్చరించింది. ఆ అంచనాల వెలుగులో ప్రపంచబ్యాంకు విశ్లేషణల్ని పరిశీలిస్తే- ఆశలు తెగటారి బతుకుచిత్రం ఛిద్రమయ్యే అభాగ్యుల సంఖ్య మరింతగా విస్తరించే ముప్పు ప్రస్ఫుటమవుతోంది!

డబ్బు లేకపోవటం ఒక్కటే కాదు..

కేవలం డబ్బు లేకపోవడమొక్కటే కాదు- అనారోగ్యం, పోషకాహారం పొందలేకపోవడం, నాణ్యమైన పనికి విద్యకు మంచినీటికి విద్యుత్తుకు నోచకపోవడాన్ని పేదరిక చిహ్నాలుగా ఐక్యరాజ్య సమితి నిర్వచించింది. 2005లో అటువంటి పేదల సంఖ్య ఇండియాలో 64 కోట్లు; 2016నాటికి 37కోట్లు. దారిద్య్రం కోరల నుంచి అభాగ్యుల్ని ఆదుకోవడంలో విద్య, ఆరోగ్య రంగాల ప్రాముఖ్యాన్ని ఆకళించుకున్న బంగ్లాదేశ్‌ వంటివీ తమదైన పురోగతిని నమోదు చేశాయి. గత రెండు దశాబ్దాల్లో 3.3 కోట్లమంది పౌరుల్ని పేదరికం నుంచి బంగ్లాదేశ్‌ వెలికిలాగిందని అంచనా. భూగోళం నలుమూలలా అటువంటి విజయగాథలన్నింటినీ కరోనా తుడిచిపెట్టేస్తుండటం- ప్రపంచానికే పీడకల! వాస్తవానికి 2030నాటికి 17 సుస్థిరాభివృద్ధి ఆశయాల సాధనకు ప్రతిన పూనిన సమితి- పేదరికం, ఆకలి మలిగిపోవాలని నినదిస్తోంది. మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్యల్ని సుస్థిరాభివృద్ధి సాధకాలుగా అది తీర్మానించింది. వృద్ధిరేట్లు క్షీణించి, ఆర్థికంగా చతికిలపడిన స్థితిలో- ఆ అజెండా అమలు గాడితప్పకుండా ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలి. భిన్న రంగాలు, వ్యవస్థలు కాలూచేయీ కూడదీసుకునే క్రమంలో- ఆకలితో, అనిశ్చితితో అలమటిస్తున్న కోట్లమంది శ్రామికులు, వలసజీవులను సాంత్వనపరచడానికి దేశీయంగా ప్రభుత్వాలు సమధిక ప్రాధాన్యమివ్వాలి. గ్రామీణ ఆధారిత వృద్ధి యోజనలే వ్యవసాయ ప్రధాన భారతావనికి విశేష ప్రయోజనకరమని నిపుణులు ఎన్నాళ్లుగానో ఉద్బోధిస్తున్నారు. ఆ హితబోధకు మన్నన కొరవడి- వియత్నాం, మొరాకో, శ్రీలంక ప్రభృత దేశాలకన్నా దిగనాసిగా మూడింట రెండొంతుల భారతీయులు ఆకలితో భారంగా బతుకులీడుస్తున్నట్లు లోగడ ప్రపంచ ఆహార భద్రతా సూచీయే ఆక్షేపించింది. కరోనా కోరసాచిన దరిమిలా పెద్దయెత్తున స్వస్థలాలకు చేరుతున్న బడుగు జీవుల సముద్ధరణే ధ్యేయంగా, గ్రామీణ ఆధారిత వ్యూహాలు చురుగ్గా పదునుతేలాలి. ఆ మేరకు సమగ్ర కార్యాచరణే గతానికి భిన్నంగా పేదరికాన్ని, గ్రామీణ నైరాశ్యాన్ని చెదరగొట్టగలుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details