భూగోళం జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు. ప్రపంచం ఆధునికతను సంతరించుకుంటున్నకొద్దీ ప్రకృతి వనరుల వినియోగం విచక్షణారహితంగా విచ్చలవిడిగా పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణలతో ఉత్పన్నమవుతున్న కాలుష్యం; అడవుల క్షయీకరణ వంటి కారణాలతో వాతావరణంలోకి హానికర కర్బన ఉద్గారాలు పెద్దయెత్తున విడుదలవుతున్నాయి. ఆ కర్బన ఉద్గారాలు కనీసం 300 నుంచి వెయ్యి సంవత్సరాల పాటు వాతావరణంలో తిష్ఠ వేసి- భవిష్యత్ తరాలకు శాపంగా తయారవుతున్నాయి. దీంతో భూతాపం పెచ్చరిల్లుతోంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొనే శక్తిని సైతం భూగోళం కోల్పోతోంది. ధ్రువప్రాంతంలో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని పలుచోట్ల అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడం, అనూహ్యంగా మంచు కురవడం, కొన్నిచోట్ల మొక్కలు కూడా మొలకెత్తని పరిస్థితి ఏర్పడి ఎడారిగా మారడంవంటి ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ కాలుష్యం పెరిగేకొద్దీ మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే 68శాతం జీవ జాతులకు పైగా కనుమరుగైపోయినట్లు అంచనా. ఇకనైనా మేలుకోకుంటే మానవాళి మనుగడ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఉద్గారాల నియంత్రణతోనే రక్షణ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇటీవల రచించిన 'వాతావరణ విపత్తును నివారించడం ఎలా? (హౌ టు అవాయిడ్ ఎ క్లైమేట్ డిజాస్టర్)' పుస్తకంలో, మానవాళి అనాలోచిత కార్యక్రమాలతో వాతావరణం ధ్వంసం అయిందని, వీటి దుష్ప్రభావాలతోనే కరోనా వైరస్ వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు తెస్తున్న సంక్షోభాలను ఎదుర్కొనే క్రమంలో- ఆర్థిక వనరులు, పర్యావరణ ప్రాధాన్యాల మధ్య సంఘర్షణలు ఎదురవుతున్నాయని వివరించారు. ఏది ఏమైనా, ప్రమాదకర గ్రీన్‌హౌస్ వాయువులను 2050 నాటికి పూర్తిగా తొలగించే శాస్త్రీయ వ్యవస్థను సత్వరమే చేపట్టి శూన్య ఉద్గారాల (నెట్ కార్బన్ జీరో ఎమిషన్స్) స్థితి తీసుకురావాలని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. నిర్దేశిత ప్రాంతంలో వివిధ రకాల ఇంధనాలను వినియోగించడం వల్ల వెలువడిన కర్బన ఉద్గారాల మొత్తాన్ని, ఆ మేరకు వాతావరణం నుంచి తొలగించి పూర్వపు స్థితికి తీసుకురావడాన్ని 'నెట్ కార్బన్ జీరో ఎమిషన్స్' అంటారు. 2015లో రెండు వందల దేశాలతో పారిస్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశ (ఐపీసీసీ) అవగాహన ఒప్పందం ప్రకారం 2050 నాటికి సగటు భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించకుండా చేయాలని సంకల్పించాయి. ఇందుకోసం కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించి 2030 సంవత్సరానికి 50 శాతానికి తగ్గించాలని, 2050కల్లా శూన్యాని(నెట్ జీరో)కి చేర్చాలని ప్రతినబూనాయి. గడచిన శతాబ్దకాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత (13.83 నుంచి 14.83) ఒక డిగ్రీ పెరగగా, దీనిలో ఎక్కువ భాగం 1970 తరవాత పెరిగిందే.
పురోగమిస్తున్న భారత్
ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం, 2019లో భూ ఉపరితల వాతావరణంలో చేరిన కర్బన ఉద్గారాలు 5,910 కోట్ల టన్నులు. వీటి విడుదలలో అగ్ర భాగాన- చైనా (26.8శాతం), అమెరికా (13.1శాతం), ఐరోపా సమాఖ్య దేశాలు (తొమ్మిది శాతం) ఉండగా, తరవాత స్థానంలో భారత్ (ఏడు శాతం) ఉంది. ఇటీవలి కాలంలో అమెరికాతో పాటు 120కి పైగా దేశాలు కర్బన ఉద్గారాల విడుదలను 2050 సంవత్సరానికల్లా శూన్యానికి (నెట్ జీరో ఎమిషన్స్) తెస్తామని ప్రకటించాయి. కానీ, అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువరించే చైనా 2060కల్లా దాన్ని సాధిస్తామంటూ వాగ్దానం చేసింది. కేవలం పది దేశాలు తప్ప మిగతావి దశలవారీ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించకపోవడంతో- ఈ ప్రకటనల అమలు సందేహాస్పదమే అవుతోంది. గతంలో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం పారిస్ ఒడంబడిక నుంచి తప్పుకొన్నప్పటికీ, కొత్తగా వచ్చిన బైడెన్ ప్రభుత్వం మళ్లీ చేరింది. ఈ సంవత్సరం ధరిత్రీ దినోత్సవం నాడు చైనాతో పాటు సుమారు 40 ముఖ్య దేశాలతో వాతావరణ సదస్సు తలపెట్టడం హర్షించదగిన పరిణామం. భారత్ నెట్ జీరోపై ఇప్పటివరకు ప్రత్యేక విధాన ప్రకటన చేయనప్పటికీ, ఆ దిశగా చర్యల్లో నిమగ్నమైంది. కర్బన ఉద్గారాలను నిలువరించే దిశలో 2030కల్లా 4.50 లక్షల మెగావాట్ల సౌర, పవన తదితర విద్యుత్ కేంద్రాలను (మొత్తం ఉత్పత్తిలో 40శాతం) స్థాపించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను 2025నాటికి మూసివేయాలని యోచిస్తోంది. స్వచ్ఛభారత్, గ్రీన్ ఇండియా పథకాల ద్వారా అడవుల పెంపకంపై దృష్టి సారించింది. 2022నాటికి ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం అమలు చేయాలనే సంకల్పంతో ఉంది. 2050కల్లా నికర కర్బన ఉద్గారాలను శూన్య స్థాయికి చేర్చడానికి అనువైన కార్యాచరణను రూపొందించింది. ఈ మహాయజ్ఞంలో పౌరులంతా భాగస్వాములు కావలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో సంఘటితంగా చేయి చేయి కలిపితే, కాలుష్య రహిత ధరణిని పునఃప్రతిష్ఠించుకోవడం అసాధ్యమేమీ కాదు!