తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహమ్మారిని మించిన కాలుష్య భూతం - కాలుష్య ప్రభావం తో పెరుగున్న కరోనా మరణాలు

పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న వాయుకాలుష్యంతో కరోనా వ్యాప్తి తీవ్రతరం కావచ్చని ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తాజాగా హెచ్చరించారు. ఘన, జీవ ఇంధనాల వినియోగంతో 60శాతానికి పైగా దేశ ప్రజలు ఇళ్లలోనే కాలుష్యభూతం కోరల్లో చిక్కుకుంటున్నారు. నైట్రస్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాటితో పాటు సూక్ష్మ ధూళికణాల బారినపడుతూ వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు.

pollution
కాలుష్యం

By

Published : Nov 8, 2021, 6:25 AM IST

విశ్వవ్యాప్తంగా విరుచుకుపడిన కొవిడ్‌ మహమ్మారి- ఇండియాలో ఇంతవరకు 4.60 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఆసేతుహిమాచలం కోరచాస్తున్న వాయుకాలుష్యం- ఏటా అంతకు మూడు రెట్లు అధికంగా మృత్యుపాశాలు విసురుతోంది. ఊపిరి నిలిపే గాలే గరళమై ప్రాణాలను తోడేస్తున్న ఆ దుర్భరావస్థ- దీపావళి తరవాత ఇంకా తీవ్రమైందన్న కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిషేధాజ్ఞలను మీరి మోతెక్కిపోయిన బాణసంచా పేలుళ్లకు, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో దహనమవుతున్న పంటవ్యర్థాలు తోడై- దేశరాజధానిపై కాలుష్యమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. పండగ మరుసటి రోజు దిల్లీలో ప్రతి ఘనపు మీటరు వాయువులో 706 మైక్రోగ్రాముల మేరకు అతిసూక్ష్మ ధూళికణాలు(పీఎం 2.5) పరచుకున్నాయి. అక్టోబరు 29తో పోలిస్తే పర్వదినం నాడు భాగ్యనగరంలో అవి 55 నుంచి 81 మైక్రోగ్రాములకు పెరిగినట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు వాయువులో వాటి వాటా అయిదు మైక్రోగ్రాములు దాటితే- ప్రజారోగ్యం పెనుప్రమాదంలో పడినట్లే! బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల తరవాత అంతటి అధ్వాన వాయునాణ్యతకు చిరునామా భారతదేశమే! ప్రపంచవ్యాప్తంగా కాలుష్యకాసారాలైన 30 నగరాల్లో 22 ఇండియాలోనే పోగుపడినట్లు స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ అధ్యయనం ఇటీవలే వెల్లడించింది. జాతీయ వాయునాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో 105 నగరాలు వెనకపడినట్లు మూడు నెలల క్రితం కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. ఏపీలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం; తెలంగాణలో హైదరాబాద్‌, సంగారెడ్డి తదితరాలు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. ఎంపిక చేసిన 132 నగరాల్లో అతిసూక్ష్మ ధూళికణాల సాంద్రతను 2024 నాటికి 30శాతం వరకు తగ్గించడానికి రెండేళ్ల క్రితమే జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆ లక్ష్యం సఫలీకృతం కావాలంటే- క్షేత్రస్థాయిలో కార్యాచరణ చురుకందుకోవాలి. గ్రామీణ మహిళల ఆరోగ్యానికి పొగపెడుతున్న గృహ వాయుకశ్మలాన్ని కట్టడిచేయడమూ అత్యవసరం!

పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న వాయుకాలుష్యంతో కరోనా వ్యాప్తి తీవ్రతరం కావచ్చని ఎయిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తాజాగా హెచ్చరించారు. ఘన, జీవ ఇంధనాల వినియోగంతో 60శాతానికి పైగా దేశ ప్రజలు ఇళ్లలోనే కాలుష్యభూతం కోరల్లో చిక్కుకుంటున్నారు. నైట్రస్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాటితో పాటు సూక్ష్మ ధూళికణాల బారినపడుతూ వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. గృహ వాయుకాలుష్యం మూలంగా దేశవ్యాప్తంగా 2019లోనే ఆరు లక్షల మంది అసువులుబాసినట్లు అంచనా! గడచిన ఏడేళ్లలో రెట్టింపునకు మించి ఎగసిన గ్యాస్‌బండ ధర- పేదలను కాలుష్యకారక పిడకలు, కట్టెల పొయ్యిల వైపు మరింతగా నెట్టేస్తోంది. విషధూమాలను విడుదల చేసే పరిశ్రమలు, శిలాజ ఇంధనాలతో పరుగులు తీస్తున్న వాహనాలు, చెరిగిపోతున్న పచ్చదనపు ఆనవాళ్లు... వెరసి- పోనుపోను ఇంతలంతలవుతున్న వాయుకాలుష్యంతో ఇండియా ఏటా ఏడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్నీ మూటగట్టుకుంటోంది. సామాజిక వనాల పెంపకంతో పాటు ఇతరేతర కీలక చర్యలతో దేశీయంగా వాయు స్వచ్ఛత కోసం జనచైనా విశేష కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాల నిబద్ధత, చైతన్యపూరితమైన ప్రజా భాగస్వామ్యం కొరవడిన ఇక్కడ తద్భిన్నమైన పరిస్థితులు తాండవిస్తున్నాయి. సుప్రీంకోర్టు అభివర్ణించినట్లు గ్యాస్‌ఛాంబర్ల వంటి నగరాల్లో జాతి జవసత్వాలు ఉడిగిపోతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులను ఇతోధికంగా అందిపుచ్చుకుంటూ, ప్రజారవాణాకు పెద్దపీట వేస్తూ, నివాస ప్రాంతాలకు హరిత శోభను సంతరింపచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కదిలితేనే- స్వస్థ భారతం సాకారమయ్యేది!

ఇదీ చూడండి:వ్యక్తిగత గోప్యతకు తూట్లు- పెండింగులోనే బిల్లు

ABOUT THE AUTHOR

...view details