ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ అతలాకుతలం చేసింది. ఆ మహమ్మారి నియంత్రణకు చేపట్టిన దీర్ఘకాలిక 'లాక్‌డౌన్' ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఆదాయాలు పడిపోయాయి. ఫలితంగా 2020-21లో ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. ఇది దాదాపు (-) 7.5 శాతం ఉండవచ్చని రిజర్వ్ బ్యాంకు తాజా అంచనా. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టి వృద్ధివైపు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కింద ఆర్థిక ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం ఉద్దీపన విలువ రూ.29,87,647 కోట్లు. ఇది జీడీపీలో 15శాతం. ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగం తొమ్మిది శాతం; మిగిలినది ఆర్బీఐ వివిధ రూపాల్లో ప్రకటించింది. మొదటి ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థలోని బలహీన వర్గాలపై గురిపెట్టింది. వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు 'క్రెడిట్ గ్యారెంటీ' పథకం రూపంలో ప్రోత్సాహకాలిచ్చింది. రెండో ప్యాకేజీ ద్వారా ప్రైవేటు వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేసింది. ఆర్థిక వ్యవస్థలో సరఫరా కారకాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే దేశ ఆర్థిక వృద్ధిలో కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నది వినియోగ డిమాండు. ఇది కొంతకాలంగా కుదించుకు పోయింది. ప్రైవేటు తుది వినియోగ వ్యయ వృద్ధి రేటు 3.1 శాతాని(18 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి)కి పడిపోయింది. అంతేకాక జీడీపీలో ఇది ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి (57.7 శాతం) చేరింది. ఈ సంకట స్థితిలో ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపి ఆర్థిక వృద్ధిని ఉరకలెత్తించడానికి సరఫరా కారకాల కంటే గిరాకీని ప్రేరేపించే కారకాలే శరణ్యం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం మూడో ఉద్దీపన చర్యల్లో ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే విధానాలకు ప్రాధాన్యమిచ్చింది. కార్మిక విపణి, ఒత్తిడికి గురైన రంగాలు, సాంఘిక సంక్షేమం, తయారీ, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు, వ్యవసాయం వంటి బహుళ రంగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవస్థలో డిమాండును ప్రేరేపించాలన్నది ప్రధాన ఉద్దేశం.
డిమాండులో స్తబ్ధత
సామాజిక, ఆర్థిక నిర్మాణంలో (పిరమిడ్) అగ్రభాగంలో ఉండే కేవలం 10కోట్ల మంది ప్రజలు వివిధ వస్తుసేవల వినియోగానికి చేసే డిమాండు ఇప్పటివరకు దేశాభివృద్ధిని ప్రధానంగా ప్రభావితం చేస్తోంది. తమ అవసరాలు తీరడంతో వీరి వినియోగ డిమాండులో స్తబ్ధత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో వాహనాలు, గృహాలు మొదలుకొని చాలా వస్తువుల వినియోగ డిమాండు సాపేక్షంగా బలహీనంగా ఉండటానికి కారణమిదే. సరిగ్గా ఇదే సమయంలో కొవిడ్ రూపంలో ఉపద్రవం దేశ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్టింది. అంతులేని నష్టానికి కారణమైంది. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన యంత్రంగా గృహనిర్మాణ రంగాన్ని కేంద్రం ఎంచుకుంది.
ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి వివిధ దశల నిర్మాణంలో దాదాపు 4,50,000 యూనిట్లకుపైగా గృహాలు అమ్ముడుపోని జాబితాలో ఉన్నాయి. వీటిలో దాదాపు రూ.3.7 లక్షల కోట్ల దాకా స్థిరాస్తి వ్యాపారుల మూలధనం నిలిచిపోయింది. ఈ ప్రోత్సాహకాల వల్ల స్థిరాస్తి వ్యాపారులకు అదనపు పన్ను బాధ్యత లేకుండా ఇళ్ల కొనుగోలుదారులకు తక్కువ మార్కెట్ ధరలకే గృహాలు అందించే అవకాశం కలిగింది. తద్వారా గిరాకీ లేక పెద్దమొత్తంలో పేరుకుపోయిన తమ గృహాలు అమ్ముకునే వెసులుబాటు లభించింది. సగంలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి బిల్డర్లకు మద్దతు అందితే- కరోనా నేపథ్యంలో నగరాలను వీడిన కార్మికులు తిరిగి పట్టణ గృహనిర్మాణ పనులకు ఆకర్షించడంలో అది ప్రధాన పాత్ర వహిస్తుంది. దానివల్ల స్థిరాస్తి నిర్మాణరంగానికి మేలు జరుగుతుంది. తద్వారా అనేక రంగాలపై సానుకూల ప్రభావం పడి ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవం నింపుతుంది.
ద్రవ్యలోటు ఆందోళన అనవసరం