నేరం ఏదైనా, ఏ కారణంతో జరిగినా- మానవత్వానికే అది మాయని మచ్చ అని స్పష్టీకరించారు జాతిపిత మహాత్మా గాంధీ. ఆ అహింసామూర్తి అడుగుజాడల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందిపుచ్చుకొన్న ఇండియాలో నేర పరంపర మానవ ప్రశాంతతకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది. జాతి ప్రగతినే అపహసిస్తోంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా వార్షిక నివేదిక- భారత్‌లో నానాటికీ పెచ్చుమీరుతున్న హింసా ప్రవృత్తిని మరోమారు కళ్లకు కట్టింది. గతేడాది దేశవ్యాప్తంగా అరవై ఆరు లక్షలకు పైగా నేరాలు వెలుగుచూశాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 28శాతం అధికం. కొవిడ్ ఆంక్షల ఉల్లంఘనులపై నమోదైన కేసుల వాటా ఈసారి ఎక్కువ. హేయ నేరాలూ పెచ్చరిల్లాయి. మనిషిలోని రాక్షసత్వానికి నిదర్శనంగా నిలిచే హత్యలు 29వేలకు పైగా చోటుచేసుకొన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలూ తొమ్మిది శాతానికి పైగా పెరిగాయి. దేశీయంగా అపహరణ ఘటనలు కొంతవరకు తగ్గుముఖం పట్టినా, వాటిలో 62శాతం బాధితులు బాలలే.
అంతులేని నేరప్రవృత్తి..
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నేరాలు ఎకాయెకి 63శాతానికి పైగా 'వృద్ధి'ని నమోదుచేశాయి. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇండియాలో నిరుడు 947 మానవ అక్రమ రవాణా ఉదంతాలు బయటపడ్డాయి. వాటిలో మహారాష్ట్ర తరవాత అత్యధికంగా 11శాతం ఘటనలు తెలంగాణలోనే చోటుచేసుకొన్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు, దళితులపై దౌర్జన్యాల్లోనూ గడచిన సంవత్సరం తెలంగాణ- దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. 2019తో పోలిస్తే నిరుడు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలు దాదాపు 16శాతం అధికమయ్యాయి. గతేడాది ఒక్క తెలంగాణలోనే సైబర్ ఘాతుకాల్లో పెరుగుదల 86శాతం! ఏపీలో ఎస్సీలపై అకృత్యాలది అంతులేని కథ. దళితులపై అత్యధిక దాష్టీకాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది అయిదో స్థానం. పోనుపోను ఇంతలంతలవుతున్న వ్యవస్థీకృత నేరాలతో పాటు అణగారిన వర్గాలపై అకృత్యాలను అరికట్టడంలో యంత్రాంగం వైఫల్యం- సామాన్యుల ధన మాన ప్రాణాలు గాలిలో దీపాలేనని చాటుతోంది.