తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మౌలిక సౌకర్యాలతోనే రైతుల ఆదాయం పెరుగుదల - రైతుల ఆదాయం పెరుగుదల

కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచింది వ్యవసాయమే. పంట దిగుబడులు, వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తులు రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు విదేశాల్లోనూ మన దేశ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. దీంతో రైతుల ఆదాయం పెరగాల్సింది పోయి.. తగ్గుతోంది. దళారులు, వ్యాపార సంస్థలు మాత్రం లాభాలు పొందుతున్నారు. అయితే లోపం ఎక్కడుంది?

Increases farmers income with infrastructure improvements in ground level
అలా చేస్తే రైతుల ఆదాయం పెరుగుదల సాధ్యం

By

Published : Mar 30, 2021, 6:58 AM IST

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సమయంలో మానవాళికి అన్నం పెడుతూ భారతదేశం అన్నపూర్ణగా అవతరించింది. కరోనా దెబ్బకు భారత వాణిజ్య ఎగుమతులు 15.5శాతం తగ్గి కుదేలయ్యాయి. వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తులు రికార్డు స్థాయిలో 9.8శాతం, బియ్యం ఎగుమతులు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా రెట్టింపునకు పైగా పెరిగాయి. కొవిడ్‌ కోరలు సాచిన ఏడాదిలో ఆహార ధాన్యాల దిగుబడులు దేశ చరిత్రలోనే తొలిసారి 30 కోట్ల టన్నులను దాటనున్నాయని తాజా అంచనా. పలు పంటల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 'ఆహారోత్పత్తుల ధరల సూచీ (ఎఫ్‌పీఐ)' 2014-16తో పోలిస్తే ఈ ఏడాది 100 నుంచి 113.3 పాయింట్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల భారత వ్యవసాయరంగానికి బాగా కలిసొచ్చింది. భారత ఆహారోత్పత్తులను కొనేందుకు విదేశాలు పోటీ పడుతున్నాయి. కానీ, ఇంత గిరాకీని రైతులకు ఆదాయం పెంచేలా మార్చడంలో క్షేత్రస్థాయిలో కార్యాచరణ సరిగ్గా లేకపోవడం వల్ల పంట పండించిన వారికి కాకుండా దళారులు, వ్యాపార సంస్థలకు లాభాలు కురుస్తున్నాయి.

కేంద్రం రాష్ట్రాల సమన్వయం

తెలుగు రాష్ట్రాల నుంచి పంటల ఎగుమతులకు సరైన సదుపాయాలు లేక రైతులకు ఆదాయం పెరగడం లేదు. విదేశాల్లో గిరాకీ ఉన్న పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యానశాఖలు శ్రద్ధ చూపడం లేదు. రసాయన పురుగుమందుల వినియోగం విచ్చలవిడిగా ఉన్న పంటలను విదేశాలు కొనవు. ఈ కోణంలో- రైతులకు మందుల పిచికారీపై అవగాహన కల్పించడం లేదు. సమగ్ర ప్యాకింగ్‌ కేంద్రం, శీతల గిడ్డంగులు, నాణ్యత పరీక్షలకు ప్రయోగశాలలు, శుద్ధి కేంద్రాలు వంటి సదుపాయాలు లేక తెలుగు రైతులు పంటలను అధికంగా పండించినా విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంటల ఎగుమతులకు ఉపయోగపడే ప్యాక్‌హౌస్‌లు, శీతలగిడ్డంగులు, శుద్ధి కేంద్రాలు, ఆధునిక ప్రయోగశాలల వంటి మౌలిక సదుపాయాల పెంపు పథకాలకు నిధుల ఊసే లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పండే బంగినపల్లి, దసేరా వంటి రకాల మామిడిపండ్లకు అనేక దేశాల్లో గిరాకీ ఉంది. కానీ, మౌలిక సదుపాయాలు, మాగపెట్టే, శుద్ధి చేసే కేంద్రాలు లేక వీటి ఎగుమతులు పెరగడం లేదు. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక 'పంటలు, ఆహారోత్పత్తుల ఎగుమతి విధానం' రూపొందించి మౌలిక సదుపాయాలు పెంచి, ప్రోత్సాహకాలు ఇవ్వాలని జాతీయ విధానంలో కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశం నుంచి 2018-19లో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తులను కొన్న అగ్రశ్రేణి పది దేశాల్లో వియత్నాం, ఇరాన్‌, ఇరాక్‌, ఇండొనేసియా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి పేదదేశాలే ఉన్నాయని 'భారత వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార్పోత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి (అపెడా)' తాజా నివేదికలో వెల్లడించింది. రష్యా, సింగపూర్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, చైనా తదితర 20 ప్రముఖ దేశాల్లో భారత పంటలకు, ఆహారోత్పత్తులకు భారీ గిరాకీ ఉందని అధ్యయనంలో తేలినట్లు అపెడా స్పష్టం చేసింది.

ఎగుమతులుంటేనే రాబడి

ఇజ్రాయెల్‌ వంటి చిన్న దేశం ఐరోపా దేశాలకు పంటలు, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసి ఆదాయాన్ని పొందుతోంది. రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేస్తామని నాలుగేళ్ల క్రితం కేంద్రం లక్ష్యాన్ని ప్రకటించింది. విదేశాలకు ఎగుమతులు పెరిగితేనే పంటల ఆదాయం రెట్టింపు అవుతుందనేది నిర్వివాదాంశం. ఉదాహరణకు దేశంలోనే అత్యధికంగా పసుపు పంట పండించే రాష్ట్రంగా తెలంగాణకు పేరుంది. కానీ తెలంగాణకన్నా తక్కువ పసుపు పండించే తమిళనాడు, మహారాష్ట్ర రైతులకు ఎక్కువ ఆదాయం వస్తోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో పసుపు దిగుబడులకు అనుగుణంగా శుద్ధి, మార్కెటింగ్‌ సదుపాయాలు లేకపోవడమే.

ఆఖరికి పచ్చిమిరప, మునగ, ఉల్లిగడ్డ వంటి కూరగాయలు సైతం ఇక్కడి ప్రజలకు అవసరమైనన్ని పండించలేక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం కొనాల్సిన దుస్థితి నెలకొంది. వరి, పత్తి వంటి రెండు లేదా మూడు పంటల సాగుకే రైతులను పరిమితం చేసి, ఎగుమతులపై దృష్టి పెట్టకుండా రైతుల ఆదాయం పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వాలు గుర్తించాలి. తెలుగు రాష్ట్రాలకన్నా పరిమాణంలో చిన్నవైన ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌ లాంటి దేశాల్లో మౌలికసదుపాయాలు, ఎగుమతుల పెంపుద్వారా పంటలకు, పాడి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడా రైతు ఆదాయం పెంపుదలపై చిత్తశుద్ధితో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

క్షేత్రస్థాయిలో వైఫల్యాలు

ప్రపంచ మార్కెట్‌లో భారత పంటలకు, ఆహారోత్పత్తులకు భారీగా గిరాకీ పెరుగుతోంది. చుట్టుపక్కల దేశాలతో ఏర్పడిన సరిహద్దు వివాదాలతో గత ఏడాదికాలంగా చైనా ఆహారోత్పత్తులు, వంటనూనెల దిగుమతులు పెంచేసింది. ప్రపంచ మార్కెట్‌లో ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలకు ఇది కూడా ఓ కారణం. ఏడాది కాలంగా వంటనూనెల ధరలు పెరుగుతున్నా దేశంలో నూనెగింజల దిగుబడులేమీ పెద్దగా పెరగలేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లోనే సాధారణ బియ్యం 82.17 లక్షల టన్నులు, బాస్మతి బియ్యం మరో 33.80 లక్షల ఎగుమతులతో రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది వచ్చిన రూ.31 వేల కోట్లతో పోలిస్తే మరో 14 వేల కోట్ల ఆదాయం అదనంగా దేశానికి రావడం రైతుల కష్టం ఫలితమే. ఇలాగే గోధుమల ఎగుమతులూ 456, మొక్కజొన్న వంటి ఇతర తృణధాన్యాలు 189శాతం అదనంగా పెరిగాయి. ఎగుమతులపై ఆదాయం భారీగా పెరిగినా- పంట పండించిన రైతుల్లో చాలామందికి అధిక ధరలు అందలేదు. గోధుమలు, వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతుధర చెల్లించి కొనాల్సి వచ్చింది. మొక్కజొన్నలకైతే మద్దతు ధరా రాక నష్టానికి రైతులు తెగనమ్ముకోవాల్సి వచ్చింది.

రచయిత- మంగమూరి శ్రీనివాస్‌

ABOUT THE AUTHOR

...view details