కరోనా వైరస్ జడలు విప్పి నర్తిస్తున్న ప్రస్తుత దశలో ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షలు నిర్వహించడం అభిలషణీయమేనా అనే చర్చ నడుస్తోంది. కొంతమంది ఐఐటీ ప్రొఫెసర్లు కరోనా కల్లోలం దృష్ట్యా పరీక్షల వాయిదాయే ఉత్తమమని భావిస్తుంటే, మరి కొందరు ఒకే దఫా పరీక్షతో ముగించడం ఉత్తమమని చెబుతున్నారు. ఇంకొందరు వినూత్న ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ మాజీ ప్రొఫెసర్ పీఆర్కే రావు ప్రవేశ పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే పద్ధతిని సూచించారు. దీనికింద ఐఐటీలలో చేరగోరే విద్యార్థులు ఇతర ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకూడదు. అలాగే ఇతర ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశం కోరే అవకాశం ఉండదు. ఐఐటీలలో చేరాలనుకునే విద్యార్థులు గరిష్ఠంగా రెండు బ్రాంచీలు, రెండు లేదా మూడు ఐఐటీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత స్థాయిని అందుకోలేని విద్యార్థులు కోర్సు నుంచి వైదొలగుతామని లిఖితపూర్వకంగా వాగ్దానం చేయాలి. నిర్దిష్ట కాలావధిలో ముందు వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం ప్రాతిపదికపై ప్రవేశాలు జరుగుతాయి.
ఇదీ ప్రక్రియ...
దేశంలో 23 ఐఐటీలుండగా, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన 3,289 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15,53,809 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జేెఈఈ మెయిన్స్ పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, దేశంలోని మొత్తం ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్లకు సమానం. అంటే ఐఐటీ ఆశావహులందరికీ ఏదో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో సీటు తప్పక లభిస్తుంది. ఏ రాష్ట్రంలోని ఐఐటీ, ఆ రాష్ట్రం లేదా ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలల సీట్లను అర్హులైన స్థానిక విద్యార్థులకు కేటాయించే బాధ్యతను తీసుకోవాలి. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని 296 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 1,42,972 సీట్లను ఆ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించే బాధ్యతను ఐఐటీ కాన్పూర్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తీసుకుంటాయి. తమ రాష్ట్రంలో సీట్లు లభించని విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ఖాళీ సీట్లను పొందవచ్చు.
పారదర్శకంగానే..
దేశంలోని ఇంజినీరింగ్ సీట్లన్నింటికీ (15,53,809) సరిపడా విద్యార్థులు 23 ఐఐటీలలోని పరిమిత సీట్లకు పోటీ పడుతున్నారంటే అర్థం- ఒక్కో ఐఐటీ 67,557 మంది ఆశావహులను మూల్యాంకనం చేయవలసి వస్తోంది. ఒక్కో ఐఐటీలో 200 మంది అధ్యాపక సిబ్బంది ఉంటారు. ఒక్కో అధ్యాపకుడు ఎనిమిది గంటల పని దినంలో ఒక్కో విద్యార్థిని 15 నిమిషాలసేపు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేస్తారనుకుంటే, పదిన్నర రోజుల్లో 338 మందిని ఇంటర్వ్యూ చేయగలుగుతారు. రిజర్వుడు సీట్లకు, విద్యార్థినులకు కేటాయించే సీట్ల కోసం ఇంటర్వ్యూలూ ఇందులో కలిసి ఉంటాయి. ఈ విధంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డు పరీక్షలతో నిమిత్తం లేకుండా మొత్తం సీట్లను ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, కౌన్సెలింగ్‌తోనే భర్తీ చేస్తారు. ఎవరికి ఏ బ్రాంచీ, ఏ కళాశాలను కేటాయించాల్సిందీ ఈ పద్ధతిలోనే నిర్ణయిస్తారు. అభ్యర్థుల సత్తా ఆధారంగా ఈ కేటాయింపు జరుగుతుంది. అంతిమంగా ఎంపిక అయిన విద్యార్థుల జాబితాను సంబంధిత ఐఐటీ వెబ్‌సైట్లో బహిరంగంగా ప్రకటిస్తారు కాబట్టి అంతా పారదర్శకంగా ఉంటుంది.