తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'మన సత్తా పెరగాలి.. చైనా కట్టడికి ఇదే మార్గం' - పారిశ్రామిక శక్తిలో చైనా భారత్​ బలాలు

భారత్​- చైనా మధ్య అన్ని విషయాల్లో తీవ్ర పోటీ ఉంటుంది. అయితే పారిశ్రామిక శక్తి విషయంలో చైనా కాస్త ముందుందనే చెప్పాలి. అయితే ఇటీవల గల్వాన్​ లోయలో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత చైనాపై ఆధారపడకూడదనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మరి చైనాపై ఆధారపడకుండా ఉండాలంటే భారత్​ చేయాల్సిందేమిటి? పారిశ్రామిక శక్తిలో చైనాను కట్టడి చేసేందుకు భారత్​ అనుసరించాల్సిన విధానాలపై నిపుణులు ఏమంటున్నారు?

India and China are industrial powers
చైనాకు పోటీగా భారత్ పారిశ్రామిక శక్తిగా ఎదగాలంటే

By

Published : Aug 9, 2020, 9:00 AM IST

గల్వాన్‌ ఘర్షణల దరిమిలా- చైనా మీద ఆర్థికంగా ఏమాత్రం ఆధారపడకూడదని భారత్‌ భావిస్తోంది. చైనా వస్తువులు కారుచౌక అని పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. వ్యాపారం చేసేది లాభం కోసమే కనుక, భారతీయ సంస్థలు, వ్యాపారులు చైనా సరకుల మీద అతిగా ఆధారపడ్డారు. చైనాలో ఉత్పత్తి వ్యయం బాగా తక్కువ కాబట్టి, ఆ దేశ సరకులు మహా సరసమైన ధరలకు లభిస్తున్నాయి. భారత్‌ కూడా ఆ సత్తాను అందుకోవాలంటే ఉత్పత్తి సాధనాల వ్యయాన్ని తగ్గించాలి. కార్మికుల ఉత్పాదకతను పెంచాలి. ఆధునిక సాంకేతికతతో భారీయెత్తున ఉత్పత్తి చేపట్టినప్పుడు ఇది సాధ్యపడుతుంది. పరిశ్రమలకు తక్కువ వడ్డీకి పెట్టుబడులు లభించాలి, వాటి నిర్వహణ సామర్థ్యం మెరుగుపడాలి. సరకుల బట్వాడా వ్యయం తగ్గాలి. దీనంతటికీ ప్రభుత్వ విధానాలు అండగా నిలవాలి. ఈ పరామితుల్లో భారత్‌ స్థానాన్ని ఎన్నోరెట్లు మెరుగుపరచాల్సిందిపోయి, అన్నింటికీ భూసేకరణపరంగా, కార్మికులపరంగా వస్తున్న సమస్యలే కారణమని నిందిస్తే ఉపయోగం ఉండదు.

విలువ జోడింపు కీలకం

కేవలం ముడిసరకుల ఎగుమతితో సరిపెట్టుకోకుండా, ఆ ముడిపదార్థాలను ఇక్కడే వస్తురూపంలోకి మారిస్తే అదనపు విలువ జోడింపు జరుగుతుంది. వస్తూత్పత్తిని ఆధునిక సాంకేతికతతో ఎప్పటికప్పుడు మెరుగుపరచుకొంటూ అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భాగస్వామి కావాలి. నేడు అనేకానేక వస్తువులు ఒక్కచోటనే తయారుకావడం లేదు. వాటి విడి భాగాలు వేర్వేరు దేశాల్లో ఉత్పత్తి అవుతూ, ఒకచోట కూర్పు అవుతాయి. ఈ క్రమాన్ని అంతర్జాతీయ సరఫరా గొలుసు అంటారు. ఉదాహరణకు ఆపిల్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ అమెరికాలో తయారైతే, దాని ఉత్పత్తి కాంట్రాక్టును తైవాన్‌కు ఇచ్చారు. తైవాన్‌ కంపెనీ ఆపిల్‌ కోసం విడిభాగాలను దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి తెచ్చి, చైనాలో కూర్పుచేస్తోంది. చైనాలోనూ అనేక ఆపిల్‌ ఫోన్‌ విడిభాగాలు తయారవుతాయి. దీంతోపాటు చైనా పలు వస్తువులను తానే పూర్తి రూపంలో తయారుచేస్తూ అదనపు విలువ జోడిస్తూ ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్నదేమిటి?

భారత్‌ కూడా ఇదేవిధంగా పూర్తిగా తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తే, అధిక ధరలను రాబట్టగలుగుతుంది. కానీ, ఇప్పుడు జరుగుతున్నదేమంటే- అధిక విలువ గల వస్తువులను చైనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ, తక్కువ ధర పలికే ముడిపదార్థాలను, పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. ఉదాహరణకు గత అయిదేళ్లలో భారత్‌ ఏటా చేసుకున్న దిగుమతుల్లో 12 నుంచి 14 శాతం చైనా నుంచి వస్తే, చైనా దిగుమతుల్లో కేవలం ఒక శాతమే భారత్‌ నుంచి వెళ్ళాయి. 2019లో చైనా నుంచి భారత్‌ భారీ యంత్రాలు, ఎలక్ట్రిక్‌ పరికరాలు, ఫార్మా పరిశ్రమకు కావలసిన రసాయనాలు, వాహన విడిభాగాలు, ఇనుము ఉక్కు ఉత్పత్తులు, ఎరువులు, ప్లాస్టిక్‌ వస్తువులను దిగుమతి చేసుకుంది. చైనాకు పత్తి, కాఫీ, తేయాకు, ఉప్పు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, ఖనిజ సంబంధ వస్తువులను మాత్రమే భారత్‌ ఎగుమతి చేస్తోంది. చైనా ఈ వస్తువులను భారత్‌ నుంచే కాకుండా వేరే ఏ దేశం నుంచైనా దిగుమతి చేసుకోగలదు. అదే భారతదేశం అధిక విలువ గల వస్తువుల కోసం కారుచౌక చైనా దిగుమతుల మీద ఆధారపడాల్సినస్థితి నెలకొని ఉంది.

నిధులొచ్చినా..

భారతదేశం ప్రధానంగా స్వదేశీ వినియోగం కోసమే వస్తూత్పత్తి చేస్తోందే తప్ప, విదేశాలకు ఎగుమతి చేయడానికి కాదు. ఇటీవల భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన వాల్‌మార్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలు మన విపణి కోసమే నిధులు ప్రవహింపజేశాయని మరచిపోకూడదు. ‘భారత్‌లో తయారీ’ కోసం ఇక్కడకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) కూడా స్వదేశీ వినియోగం కోసం వచ్చాయేతప్ప విదేశాలకు ఎగుమతి చేయడానికి కాదు. ఎఫ్‌డీఐ ప్రధానంగా వస్తువుల కూర్పు యూనిట్లలోకి ప్రవహిస్తోందే తప్ప, వస్తువులను పూర్తిగా ఇక్కడే తయారుచేయడానికి కాదు. ఉదాహరణకు, భారతదేశంలో తయారవుతున్న మొబైల్‌ ఫోన్లలో ఇక్కడ జరుగుతున్న విలువ జోడింపు 15 శాతానికి మించదు.

భారతీయ వస్తువులు అంతర్జాతీయ విపణిలో పోటీపడలేకపోవడానికి ప్రధాన కారణం- ఇక్కడ భారీస్థాయిలో వస్తూత్పత్తి జరగకపోవడమే. భారీ పెట్టుబడులు, ఆధునిక యంత్రాలు, ఉన్నతస్థాయి నైపుణ్యాలతో పెద్దయెత్తున పారిశ్రామికోత్పత్తి చేపడితే, ఒక్కో యూనిట్‌కు కార్మిక వ్యయం తగ్గిపోతుంది. దీన్నే ఉత్పాదకత పెరుగుదల అంటారు. నిజానికి చైనాకన్నా భారత్‌లో కార్మికవ్యయం ఎక్కువేమీ కాదు. భారత్‌లో కనీసవేతనం చైనాలో సగంకన్నా లేదా మూడింట రెండు వంతులకన్నా తక్కువే. కానీ, కార్మికుల నైపుణ్యాల విషయంలో ప్రపంచంలో చైనా 44వ స్థానాన్ని ఆక్రమిస్తే, భారత్‌ 79వ స్థానంలో నిలుస్తోంది. స్థూల మానవ మూలధన సూచీలో భారత్‌ 103వ స్థానంతో సరిపెట్టుకుంటే, చైనా 34వ స్థానంలో ఉంది.

వియత్నాం, థాయ్‌లాండ్‌ సైతం భారత్‌కన్నా మెరుగైన స్థానాల్లో నిలిచాయి. సరకురవాణా వ్యయంలో బట్వాడా (లాజిస్టిక్స్‌) వాటా భారత్‌లో 14శాతం ఉంటే- ఐరోపా, అమెరికాల్లో 8 నుంచి 9 శాతం మించదు. భారత్‌లో సరఫరా గొలుసులో లొసుగులవల్ల పరోక్షవ్యయం పెరుగుతోంది. ఇది మొత్తం వస్తూత్పత్తి వ్యయంలో 40శాతం ఉంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో 10శాతానికి మించదు. భారత్‌లో అధిక పరోక్ష వ్యయానికి అవినీతి, చోరీలు, రవాణా నష్టాలే కారణం. మౌలిక వసతులు, విద్య, శిక్షణ, కార్మిక విపణి సామర్థ్యం, సాంకేతిక సన్నద్ధత, వ్యాపార నవీకరణ, వేతనాలు, ఉత్పాదకతల్లో చైనా భారత్‌కు అందనంత దూరంలో ఉంది. మహిళా సిబ్బంది భాగస్వామ్యం, స్థూల ఆర్థిక వాతావరణాల్లోనూ అంతే. ఒక్కమాటలో ముఖ్యమైన పరామితులన్నింటిలో భారత్‌ వెనకబడి ఉన్నందువల్ల, వ్యాపార సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే మేలన్న ధోరణిలో ఉన్నాయి.

సమస్యకు పరిష్కారాలు

విద్యా, సాంకేతికత స్థాయులను ఇనుమడింపజేయడానికి భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్‌, దక్షిణ కొరియా, చైనాలు భావి సాంకేతికతల్లో, విజ్ఞానాధారిత పరిశ్రమల్లో భారత్‌కు ఎన్నెన్నో ఆమడల దూరం ముందున్నాయి. ఆ దేశాల్లో మాదిరి పని సంస్కృతి ఇక్కడా నెలకొనాలంటే ఉత్పాదకతను అధిక జీతభత్యాలతో గౌరవించాలి. సకాలంలో అధిక నాణ్యత గల వస్తువులను అందించాలి. ఒప్పందాలకు బద్ధులై సక్రమంగా నెరవేర్చాలి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కీలక స్థానం అందుకోవాలి. ఈ అంశాల్లో భారతీయ ప్రజానీకం, ప్రైవేటురంగం ఇతర దేశాలకన్నా వెనకబడి ఉన్నాయి. భారీస్థాయి ఉత్పత్తి చేపట్టడానికి, అధునాతన సాంకేతికతతో ఉత్పాదకతను పెంచడానికి- నిరంతరం భారీ పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఏదో ఒక్కసారికి పెట్టుబడులు పెట్టి ఊరుకుంటే సరిపోదు. దురదృష్టవశాత్తు ఓటుబ్యాంకు రాజకీయాల్లో కూరుకుపోయిన భారతదేశం, పన్నుల ద్వారా పిండుకునే ధనాన్ని తిరిగి ఓట్లవేటకే ఖర్చుపెడుతున్నందువల్ల పారిశ్రామిక ప్రగతికి ఊపునిచ్చే దీర్ఘకాల పెట్టుబడులకు డబ్బు ఉండటం లేదు!

(రచయిత:డాక్టర్​ ఎస్​.అనంత్​, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)

ఇదీ చూడండి:మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details