"అంచు డాబేగాని పంచె డాబు లేద"న్నట్లు పేరుకేమో దేశానికి ప్రధాని. కానీ, అది సైన్యం మెహర్బానీ. దాన్ని కాదని అధికారం చలాయించాలని చూస్తే అంతే సంగతులు. అయినా ఏదో చెయ్యాలి! అటు స్కంధావారాన్ని మెప్పిస్తూ ఇటు జన సామాన్యాన్ని ఆకర్షిస్తూ, తనను తాను ఆదర్శ నేతగా చిత్రించుకుంటూ ఆట నడిపించాలి. ఈ రాజకీయ క్రీడ గతితప్పి ప్రతిసారీ తనకు తానే హిట్ వికెట్ కావాల్సొస్తోంది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
ఇటీవల పార్లమెంట్‌లో మాట్లాడుతూ అల్‌ఖాయిదా అగ్రనేత, 9/11 విధ్వంసంలో వందల మంది మరణానికి కారణమైన ఒసామా బిన్ లాడెన్‌ను అమర వీరుడిగా కీర్తించారు ఈ మాజీ క్రికెటర్. దీంతో అప్పటి వరకు ‘తాలిబాన్ ఖాన్’గా వేనోళ్ల అపకీర్తి పొందుతున్న ఈ ప్రధాని, కొత్తగా ‘ఇమ్రాన్ బిన్ లాడెన్’ నామధేయాన్నీ సొంతం చేసేసుకున్నారు.
పార్లమెంటు సాక్షిగా..
ఠాట్... మాకు చెప్పకుండా మా దేశంలోకొచ్చి ఒక వ్యక్తిని చంపేయడమేమిటి? దీనివల్ల ప్రతి పాకిస్థానీయుడి హృదయం ఎంత నొచ్చుకుందో తెలుసా? అంటూ ఆవేశంతో ఊగిపోతూ తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు ఖాన్. అయితే, లాడెన్ స్తుతి తిన్నగా సాగిందా అంటే, అంతా యతిమతపు గోలే! ముందు ‘మార్‌దియా’ (చంపేశారు), ఆ వెంటనే ‘షహీద్ కర్‌దియా’ (అమరుణ్ని చేశారు) అంటూ తత్తరపడటంలోనే తెలుస్తుంది ఆయనగారి తాటి మట్ట నాలుక ఘనత! పైగా అటొటాబాద్‌లో లాడెన్‌ను చంపేసిన తరవాత పాకిస్థాన్‌ను ప్రపంచం మొత్తం ఎంత తిట్టుకుందో తెలుసా? అంటూ మొసలి కన్నీరు కార్చడం మరీ పెద్ద విచిత్రం. వేల మంది చావుకు కారణమైన వ్యక్తికి అక్రమంగా దేశంలో ఆశ్రయమిస్తే వహ్వా, భళీ అనేంత దొడ్డ మనసు అందరికీ ఉండాలన్నది ఆయనగారి పగటికలేమో!
లాడెన్ కుటుంబం హత్య తప్పే..
తనను తాను ఎప్పుడూ అహింసావాదిగా చెప్పుకొనే ఖాన్‌కి లాడెన్‌ని ఉగ్రభూతం అంటే చెప్పరాని కోపం! ఆశ్చర్యం ఏంటంటే దేవుడు కలిపిన జంట లాగా ఇది తీవ్రవాదం కుదిర్చిన బంధం. ఇదే అత్యంత విచారకర దౌర్భాగ్యం! పాక్‌లో అమెరికా డ్రోన్ దాడుల్ని వ్యతిరేకించినా, పశ్చిమ దేశాలకు మాత్రమే లాడెన్ ఉగ్రవాది అని గగ్గోలుపెట్టినా అంతా సైన్యం శాసనాలను శిరసా వహించడమే కర్తవ్యమన్నది జగమెరిగిన సత్యం!