తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మేలిమి విద్యే దేశానికి పెన్నిధి- నేటి బాలలే రేపటి నిపుణులు - అందరికీ ఉచిత విద్య

అందరికీ ప్రాథమిక విద్య అందించాలని, కొత్త విద్యావిధానాన్ని చేపట్టాలని 1966లో కొఠారీ కమిషన్‌ సిఫార్సు చేసింది. త్రిభాషా సూత్రం పాటించాలని, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల వినియోగం, పారిశ్రామిక, వ్యవసాయ విద్య, వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. మారుతున్న సాంఘిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1986లో కొత్త విద్యావిధానాన్ని చేపట్టింది. అయితే.. అందరికీ విద్య అందించాలనే లక్ష్యం ఇప్పటికీ సిద్ధించలేదు. గ్రామీణంలో పేదరికం, తల్లిదండ్రుల్లో అవగాహనలోపం వంటి కారణాలతో ఎందరో బాలలు నేటికీ విద్యకు దూరంగా ఉన్నారు.

children
పిల్లలు

By

Published : Nov 14, 2021, 8:15 AM IST

'బాలలు పూలతోటలోని మొగ్గల్లాంటివారు. వారే రేపటి పౌరులు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమగా పెంచి పోషించాలి. బాలలకు సరైన విద్య అందించడం ద్వారా మాత్రమే చక్కని సమాజాన్ని సృష్టించుకోగలుగుతాం' అని దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్ఘాటించారు. పిల్లలను ఇవాళ ఎలా తీర్చిదిద్దుతున్నామన్నదే.. జాతి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే విద్య పునాదులు పటిష్ఠంగా ఉండాలి. అందుకే, బాలలకు విద్యాహక్కు కల్పించడానికి, నాణ్యమైన చదువును అందించే ఉత్తమ విద్యాసంస్థలను నెలకొల్పడానికి నెహ్రూ అధిక శ్రద్ధ చూపారు.

భవితకు పునాదులు

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం బాలల హక్కుల ప్రకటనను 1959 నవంబరు 20న ఆమోదించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇండియా సైతం అదే రోజు జరిపేది. 1964లో జవహర్‌లాల్‌ నెహ్రూ కన్నుమూశాక ఆయన జన్మదినమైన నవంబరు 14ను భారత్‌లో బాలల దినోత్సవంగా నిర్వహించాలని పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించింది. బాలల హక్కులు, వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, విద్యాబుద్ధులపై అందరిలో అవగాహన, చైతన్యం పెంపొందించడం ఈ దినోత్సవ లక్ష్యం. బాలలు మన దేశ భవిష్యత్తుకు పునాదులని, మంచి సమాజానికి జవజీవాలని నెహ్రూ చాటిచెప్పారు. ఏ దేశం అభ్యున్నతి సాధించాలన్నా బాలలకు, యువతకు నాణ్యమైన విద్యను అందించాల్సిందే.

విద్య లేనిదే ఉత్తమ మానవ వనరులను సృష్టించలేం. బాలలు మంచి పౌరులుగా ఎదగడం చదువు ద్వారానే సాధ్యం. బ్రిటిష్‌ పాలకులు స్వప్రయోజనాలకు ఉపయోగపడే విద్యావిధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టారు. వారికోసం గుమాస్తాలను తయారుచేయడమే దాని ప్రధాన లక్ష్యం. ఆంగ్లేయుల పాలన ముగిసేనాటికి 1947లో భారత్‌లో అక్షరాస్యత రేటు కేవలం 12శాతం. 2011 జనగణన ప్రకారం అక్షరాస్యత రేటు 73శాతానికి పెరిగింది. 2020కల్లా అది 77.7శాతానికి చేరిందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. అందులో పురుష అక్షరాస్యత 84.7శాతం, స్త్రీల అక్షరాస్యత 70.3శాతం. అక్షరాస్యతలో తొలి రెండు స్థానాలను కేరళ, దిల్లీ ఆక్రమిస్తున్నాయి. స్వాతంత్య్రం అనంతరం దేశ సర్వతోముఖాభివృద్ధికి ఉపకరించే విద్యా విధానాన్ని చేపట్టడానికి మన ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చాయి. విద్యాసంస్థల నిర్వహణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల చేతుల మీదుగా జరుగుతోంది. వివిధ రాజ్యాంగ అధికరణలు, బాలలకు ఉచితంగా తప్పనిసరిగా విద్యను పొందే హక్కును ప్రసాదించిన 2009నాటి చట్టం- బాలల సంక్షేమంపై, విద్యాబుద్ధులపై శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నాయి. 6-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలు ప్రాథమిక హక్కుగా ఉచిత, తప్పనిసరి విద్య పొందడానికి అవి బాటలు వేశాయి.

1976లో 42వ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది. 2005-06లో దేశంలో 83.13శాతం ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం నడిపితే, మిగతావి ప్రైవేటు నిర్వహణలో ఉండేవి. విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లను నెలకొల్పారు. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ని ప్రభుత్వం ఏర్పరచింది. 93వ రాజ్యాంగ సవరణ అందరికీ విద్యను తప్పనిసరి చేసింది. 6-14 ఏళ్ల వయసు బాలలకు విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి సర్వశిక్షా అభియాన్‌ను చేపట్టారు.

దీర్ఘకాలిక సమస్యలెన్నో..

భారత విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి 2020లో నూతన విద్యావిధానాన్ని చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు అయిదో తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో భారత్‌లో విద్యారంగ స్థితిగతులపై ఒక నివేదిక వెలువరించింది. 'భారత విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. అభ్యసనానికి ఉపాధ్యాయులే ఆయువుపట్టని 2020 జాతీయ విద్యావిధానం గుర్తించింది. ఉపాధ్యాయులు లేనిదే తరగతి గదే లేదు. అందుకే భారత్‌లో విద్యారంగ స్థితిగతులపై యునెస్కో మూడో సంచికను ఉపాధ్యాయులకు అంకితమిస్తున్నాం' అని యునెస్కో భారత విభాగ డైరెక్టర్‌ ఎరిక్‌ ఫాల్ట్‌ ఉద్ఘాటించారు. అయితే, దేశంలో పది లక్షలకు పైగా ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు యునెస్కో నివేదిక కుండ బద్దలుకొట్టింది.

ప్రభుత్వ పాఠశాలలను అనాదిగా ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటిపైనా పాలకులు దృష్టిసారించాలి. విద్య, ఆరోగ్యం, చక్కగా ఎదగడానికి అనుకూలమైన వాతావరణం.. బాలల సర్వతోముఖాభివృద్ధికి కీలకం. పాఠ్య పుస్తకాలతోపాటు సామాజిక నైపుణ్యాలూ బాలలకు అవసరమే. బాలలు మానసికంగా, శారీరకంగా బలిష్ఠంగా ఎదగడానికి తగిన వ్యాయామ తరగతులు నిర్వహించాలి. ప్రతి పాఠశాలకు ఆట మైదానం, సాంస్కృతిక వినోద కార్యక్రమాలు తప్పనిసరిగా కావాలి. పిల్లలకు యోగా, ధ్యానాలను అలవరచాలి. పోషక విలువలు లేని ఆహారానికి దూరంగా ఉంచాలి. బయటకు వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల వారిలో శారీరక దారుఢ్యం, తోటివారితో కలిసిమెలసి మసలడం అలవడతాయి. బాలలు చక్కగా ఎదిగి దేశానికి సుస్థిర భవిష్యత్తును అందించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం అత్యవసరం.

నెరవేరని లక్ష్యం

అందరికీ ప్రాథమిక విద్య అందించాలని, కొత్త విద్యావిధానాన్ని చేపట్టాలని 1966లో కొఠారీ కమిషన్‌ సిఫార్సు చేసింది. త్రిభాషా సూత్రం పాటించాలని, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల వినియోగం, పారిశ్రామిక, వ్యవసాయ విద్య, వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. మారుతున్న సాంఘిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1986లో కొత్త విద్యావిధానాన్ని చేపట్టింది. అందరికీ విద్య అందించాలనే లక్ష్యం ఇప్పటికీ సిద్ధించలేదు. గ్రామీణంలో పేదరికం, తల్లిదండ్రుల్లో అవగాహనలోపం వంటి కారణాలతో ఎందరో బాలలు నేటికీ విద్యకు దూరంగా ఉన్నారు.

--డాక్టర్ హిమాచలం దాసర్రాజు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, తిరుపతి

ఇదీ చదవండి:

Cop26 Summit: వాతావరణ మార్పుల కట్టడిలో చేతలు కావాలి!

ABOUT THE AUTHOR

...view details