జగత్తును సృష్టించిన రోజు
పూర్వం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో వేదాలను దొంగిలించాడట. వాటిని తిరిగి తేవడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సోమకున్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేస్తాడు. అప్పుడే బ్రహ్మ ''చైత్రమాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే..'' అంటూ చైత్రమాసంలో తొలి రోజైన శుద్ధ పాడ్యమి నాడు సకల జగత్తును సృష్టించాడట. అదే యుగానికి ఆదిగా.. యుగాదిగా పిలిచారు. కాలక్రమంలో దాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. కృష్ణావతారం పరిసమాప్తి అయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రవేశించింది. కలియుగారంభం జరిగిన ఈ రోజునే ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఖగోళ శాస్త్ర పరంగా..
365రోజుల్లో ఒక రోజుకు రాత్రింబవళ్లు సమానంగా ఉంటాయి. ఆ రోజు తర్వాత వచ్చే తొలి పాడ్యమిని మనం ఉగాదిగా జరుపుకొంటున్నాం. భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట సైతం చైత్ర శుద్ధ పాడ్యమినాడు భూమి పైకి సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారట. మరో ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు సైతం తాను రూపొందించిన పంచాంగాన్ని చైత్ర శుద్ధ పాడ్యమినాడే ప్రజలకు అంకితం ఇచ్చారు.
ప్రకృతి పరంగా..
మనం రుతువులను అనుసరించి పండగలను జరుపుకొంటాం. ఉగాది కూడా అలాంటిదే. ఆకురాలే కాలం అయిన శిశిర రుతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టే రోజున మనం ఉగాది జరుపుకొంటాం. అప్పటి వరకు ఎండిన మోడుల్లా కనిపించిన మొక్కలు చిగురు తొడగడం ప్రారంభిస్తాయి. ప్రకృతి కాంత పచ్చదనాల చీరను కట్టుకొంటుంది. పక్షుల కిలకిలారావాలు.. లేలేత చిగురులు.. ప్రకృతికి మరింత శోభను చేకూర్చుతాయి. రుతువులు మారడం వల్ల వ్యాధులు విజృంభిస్తాయి. కాబట్టి వాటిని తట్టుకొనే శక్తిని పొందడానికి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు.
వేర్వేరు రోజుల్లో..
ఉగాదిని వేర్వేరు యుగాల్లో వేర్వేరు రోజుల్లో జరుపుకొన్నారు. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజు ఉగాదిని జరుపుకొన్నారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ, ద్వాపర యుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు జరుపుకొన్న ఉగాది కలియుగానికి వచ్చేసరికి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొంటున్నారు.
ఇష్టదైవ ప్రార్థనతో..