ఇటీవల వెలుగుచూసిన గ్రామీణభారత పరిస్థితి మదింపు అధ్యయనం (ఎస్‌ఏఎస్) ప్రకారం కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన 277 రూపాయలే! కుడిఎడమగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద లభించే కూలీ మొత్తంతో సమానమిది! దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నెలకు నాలుగు వేల నుంచి పది వేల రూపాయల లోపు ఆదాయాలతో అన్నదాతలు ఈసురోమంటున్న దుర్భర స్థితిని ఆ నివేదిక కళ్లకుకట్టింది. క్షేత్రస్థాయిలో గిట్టుబాటు కాని సేద్యం- రోజుకు రెండు వేల మంది సాగుదారులను ఇతర వృత్తుల్లోకి నెట్టేస్తున్నట్లుగా లోగడే వెల్లడైంది. ఉత్పత్తి కేంద్రక విధానాలతో దేశీయంగా గడచిన కొన్ని దశాబ్దాల్లో పంటల దిగుబడులు ఇతోధికమైనా- సేకరణ, నిల్వ, విక్రయాల్లో మేటవేసిన సమస్యలు అన్నదాతలకు అశనిపాతాలవుతున్నాయి. వాటికి సహేతుక పరిష్కారాలు అన్వేషించాల్సిన తరుణంలో వరి చుట్టూ రేగుతున్న రాజకీయ ఆవేశకావేషాలు ఆందోళన పరుస్తున్నాయి.
అన్నదాతలకు అన్యాయం జరగకూడదన్న ఆవేదన అందరిలోనూ ప్రస్ఫుటమవుతున్నా- అందివచ్చిన ఫలసాయాలను సేకరించి సద్వినియోగపరచుకోవడం ఎలాగో అంతుపట్టని సందిగ్ధత నెలకొంది. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను బట్టి నేలల స్వభావానికి అనుగుణంగా ఎక్కడ ఏయే పంటలను ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలో సూచించే విస్పష్ట ప్రణాళిక కొరవడటమే ప్రస్తుత ఆందోళనలకు ఆజ్యంపోస్తోంది. ఇండియాతో పోలిస్తే తక్కువ సాగుభూములు కలిగిన చైనా- తన ఆహార అవసరాల్లో 95శాతాన్ని సొంతంగానే తీర్చుకుంటోంది. తద్భిన్నమైన దుస్థితి తాండవిస్తున్న భారతదేశంలో వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల దిగుమతుల విలువ నిరుడు దాదాపు మూడు శాతం పెరిగి, రూ.1.41 లక్షల కోట్లకు చేరింది. నూనెగింజలు వంటి వాటికోసం ఇప్పటికీ విదేశాల వైపే చూడాల్సి వస్తోంది. హరిత విప్లవ పితామహులు ఎం.ఎస్.స్వామినాథన్ ఏనాడో సూచించినట్లుగా ఉత్పత్తి వ్యయానికి యాభై శాతాన్ని జోడించి మద్దతు ధరలను నిర్ణయించడం సహా అవి పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వాలు పూచీపడాలి. అప్పుడే నిలకడైన ఆదాయాల లేమితో అస్తిత్వ పోరాటంలో అలసిపోతున్న అన్నదాతలకు సరైన జీవనాధారం దక్కుతుంది. జాతీయస్థాయి పంటల ప్రణాళికతో కేంద్రం, రాష్ట్రాలు ఏకోన్ముఖంగా ముందుకు సాగితేనే- సాగురంగంలో ఆత్మనిర్భరత సాధ్యపడుతుంది!