తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బలగాల ఉపసంహరణతో భారత్​పై తీవ్ర ప్రభావం! - అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా సేనలు వడివడిగా వెనక్కి అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే అఫ్గాన్‌పై తాలిబన్‌ తాచుపాముల పడగనీడ పరుచుకుంటోంది. ఈ పరిణామాల ప్రభావం భారత్​పై తీవ్ర స్థాయిలో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌లో భారత ప్రయోజనాలను పరిరక్షించుకోవడంపై కేంద్రం నిశితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

impact of the withdrawal of US troops from Afghanistan
అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ

By

Published : Jul 5, 2021, 7:00 AM IST

Updated : Jul 5, 2021, 7:19 AM IST

'శాశ్వత స్వేచ్ఛ' కోసమంటూ సమరశంఖం పూరించి అఫ్గాన్‌ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా- రెండు దశాబ్దాల దరిమిలా రక్తసిక్త రిక్తహస్తాలతో రణరంగాన్ని వీడుతోంది! రెండు లక్షలకు పైగా ప్రాణాలు, రెండు లక్షల కోట్ల డాలర్ల నిధులను హరించిన యుద్ధక్షేత్రం నుంచి ఆగమేఘాలపై నిష్క్రమిస్తోంది. ముష్కర మూకలపై ముప్పేట దాడులకు మూలకేంద్రమైన కీలక బగ్రామ్‌ వైమానిక స్థావరం నుంచి సంకీర్ణ సేనలు మూడు రోజుల క్రితం మూటాముల్లే సర్దేశాయి. ఆగస్టు మాసాంతం కల్లా నిష్క్రమణ పర్వాన్ని పూర్తిచేస్తామని ఆ వెంటనే పెంటగాన్‌ వర్గాలు ప్రకటించాయి. తాలిబన్లతో అర్థరహిత శాంతి ఒప్పందానికి తలొగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారుపై నిరుడు విమర్శలెన్నో వ్యక్తమయ్యాయి. అఫ్గాన్‌ భవిష్యత్తును బలిపీఠంపైకి నెడుతున్నారంటూ అంతర్జాతీయంగా ఆందోళనలు రేగాయి. బైడెన్‌ అధ్యక్షులయ్యాక బలగాల ఉపసంహరణకు సెప్టెంబర్‌ 11ను తుది గడువుగా నిర్దేశించి- ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను పట్టాలెక్కించారు. అందుకనుగుణంగా అగ్రరాజ్యమెంత వడివడిగా వెనకబాట పడుతోందో అంత వేగంగా అఫ్గాన్‌పై తాలిబన్‌ తాచుపాముల పడగనీడ పరుచుకుంటోంది.

'శత్రువులను నిలువరించగలిగిన శక్తిసామర్థ్యాలు అఫ్గాన్‌ ప్రభుత్వానికి ఉన్నాయి' అన్న బైడెన్‌ వ్యాఖ్యలకు భిన్నంగా తరుముకొస్తున్న తాలిబన్‌ తండాల ధాటికి అష్రాఫ్‌ ఘనీ సర్కారు ఎదురు నిలువలేకపోతోంది. దేశంలోని 407 జిల్లాల్లో ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అధీనంలో ఉన్నవి 78 మాత్రమేనంటున్న అంతర్జాతీయ పరిశీలకులు.. అఫ్గానిస్థాన్‌ మరోమారు అనాగరిక ఏలుబడిలోకి జారిపోయే దుర్దినమెంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. తమ కబంధ హస్తాల్లోకి వచ్చిన ప్రాంతాల్లో పౌరస్వేచ్ఛకు ఛాందసవాద సంకెళ్లు బిగిస్తూ తాలిబన్లు ఇప్పటికే పేట్రేగిపోతున్నారు. మధ్యయుగాల నాటి రాక్షసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న ముల్లా ఒమర్‌ వారసులు అధికారంలోకి రావడం తథ్యమని తేలిపోతున్న తరుణంలో దాదాపు నాలుగు కోట్ల అఫ్గానీల భవితే అగమ్యగోచరమవుతోంది. తాలిబన్లకు పాకిస్థాన్‌ వెన్నుదన్ను, ఆ దేశాన్ని అడ్డంపెట్టుకుని అఫ్గాన్‌లో చక్రం తిప్పాలనుకుంటున్న చైనా వ్యూహం.. వెరసి- ప్రస్తుత పరిణామాలన్నీ ఇండియాకు కంటి మీద కునుకును దూరం చేసేవే! అఫ్గానిస్థాన్‌లో భారత ప్రయోజనాలను పరిరక్షించుకోవడంపై కేంద్రం నిశితంగా దృష్టి సారించాల్సిన తరుణమిది!

అరాచకత్వం రాజ్యమేలి అభివృద్ధి అడుగంటిపోయిన అఫ్గానిస్థాన్‌లో ఆ తరవాత ఎడతెగని రక్తపాతంతో జనజీవనం ఛిద్రమైంది. ఆ దేశ పునర్నిర్మాణ క్రతువులో భాగస్వామిగా గడచిన ఇరవై ఏళ్లలో ఇండియా అక్కడ 300 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. అఫ్గాన్‌ భద్రతాదళాలకు శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు 400కు పైగా ప్రాజెక్టులను తలకెత్తుకున్న భారత్‌- తాలిబన్లకు కంటగింపుగా మారింది. దౌత్య కార్యాలయాలు, ప్రాజెక్టులపై దాడులు; భారతీయుల అపహరణలతో ఉగ్రవాద ముఠాలు ఇండియాపై క్రోధాన్ని వెళ్లగక్కిన సందర్భాలనేకం! ఆ తండాలే తిరిగి అక్కడ అధికార పీఠమెక్కితే కీలక 'తాపీ' గ్యాస్‌ పైప్‌లైన్‌తో సహా భారత ప్రాజెక్టులు చిక్కుల్లో పడతాయన్న భయసందేహాలు నెలకొంటున్నాయి.

పాకిస్థాన్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదానికి తాలిబన్‌ తోడేళ్ల మద్దతు తోడైతే ఆందోళనకర పర్యవసానాలు తప్పవు. దట్టంగా పరచుకుంటున్న ఈ ముప్పు మేఘాలను తొలగించడానికి తాలిబన్లతో ఇండియా రహస్య చర్చలు చేస్తున్నట్లు వినవస్తోంది. ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించకపోయినా- తాలిబన్ల పట్ల భారత వైఖరిలో విస్పష్ట మార్పు కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరుకు తార్కిక ముగింపునివ్వకుండా అగ్రరాజ్యం తన దారి తాను చూసుకుంటున్న వేళ- దేశ ప్రయోజనాలే పరమావధిగా పటుతర వ్యూహాలకు ఇండియా పదునుపెట్టాలి. భారత వ్యతిరేక చర్యలకు అఫ్గానిస్థాన్‌ నెలవు కాకుండా కాచుకోవాలి!

ఇదీ చూడండి:'హాట్​డాగ్'​ తిండిబోతు టైటిల్​ మళ్లీ జోస్​కే​

Last Updated : Jul 5, 2021, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details