రెండు నెలల లాక్‌డౌన్ వలస జీవుల పాలిట పిడుగుపాటై మానవ మహా విషాద చరిత్రను రక్తాశ్రువులతో లిఖిస్తోంది. కరోనా మహమ్మారి కట్టడే ఏకైక లక్ష్యంగా ఎక్కడి వారిని అక్కడే ఉంచాలంటూ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చి చివరి వారంలోనే ఆదేశించినా.. సొంత ఊళ్లో అయినవాళ్ల బాగోగులపై బెంగతో లక్షలాది వలస కూలీల మహా పాదయాత్ర మొదలైంది. 'కరోనా వైరస్ చాలదన్నట్లు అంతకు మించి ప్రభుత్వం మమ్మల్ని చావకొడుతోంది' (కరోనా నా మార్ రహీ హై జో ఊపర్ సే సర్కార్ మార్ దాలేగి) అంటూ కన్నీటి పర్యంతమైన వలస కార్మికుల ఆవేదనలకు స్పందించి ఈ నెలారంభం నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లను కేంద్రం నడుపుతోంది. తొలి మూడు వారాల్లో 35 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చామని, బస్సుల ద్వారా మరో 40 లక్షల మంది స్వరాష్ట్రాలకు చేరారంటున్న కేంద్రం.. వచ్చే పదిరోజుల్లో మరో 2,600 రైళ్లు నడిపి ఇంకో 36 లక్షల మందిని ఆయా రాష్ట్రాలకు చేరవేసే కార్యాచరణ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య అర్థవంతమైన సమన్వయం ఉండాలని, పిన్నలు, పెద్దలు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రయాణికుల పారిశుద్ధ్యం, ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ.. పాటించాల్సిన ప్రామాణికాల్ని కొన్నాళ్ల క్రితం నిర్దేశించింది. అవేవీ అమలు కాకపోబట్టే దిల్లీ రైల్వేస్టేషన్లో ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్ల లూటీ, బిహార్ వెళుతున్న రైలులో ఆహారం కోసం కొట్లాటలు నమోదయ్యాయి. పదినుంచి 20 గంటల పాటు రైళ్లలో మగ్గిపోతున్నా, ఆహారం కాదు కదా, మంచినీరూ అందుబాటులో లేని దుస్థితి వలస కార్మికుల్ని క్షోభిల్లజేస్తోంది. రద్దీ దృష్ట్యా కొన్ని మార్గాల్లో రైళ్లను గంటల కొద్దీ నిలిపివేయడం, చుట్టూ తిప్పి తీసుకెళ్లడంతో 30-40 గంటలు మించుతున్న ప్రయాణకాలం ప్రత్యక్ష నరకాన్ని అనుభవంలోకి తెస్తోంది. జాతి సౌభాగ్యానికి భుజం కాస్తున్న శ్రామికుల బాగోగుల పట్ల మానవీయంగా స్పందించలేమా అన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది!