రాజ్యాంగ అధికరణ 19(1) పౌరులకు ఇచ్చిన వాక్‌స్వాతంత్య్రాన్ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు అసమ్మతి గొంతు నొక్కేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల ఆట కట్టిస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తీరును విమర్శించిన ఒక వ్యక్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా ప్రాసిక్యూట్ చేయడాన్ని న్యాయస్థానం అత్యంత తీవ్రంగా పరిగణించి చీవాట్లు పెట్టింది.
ట్వీట్లపై అభియోగాలు
విమర్శిస్తే రాజ ద్రోహమా? యశ్వంత్ సింగ్ అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్‌లో 'జంగిల్‌రాజ్' నడుస్తోందని, శాంతిభద్రతలు కొరవడ్డాయని ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై అతడి మీద 2020 ఆగస్టులో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు అయింది.
వ్యక్తుల అపహరణ, భారీగా డబ్బు గుంజడం, హత్యలు చేయడం తదితర నేరాల దృష్టాంతాలను ఆ వ్యక్తి తన ట్వీట్లో ప్రస్తావించారు. ఇలా ట్వీట్ చేసి ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని భారత శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద, వంచనకు పాల్పడ్డారని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2008లోని 66డి కింద అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై యశ్వంత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వ్యాఖ్యానించే హక్కు.. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణ యశ్వంత్ సింగ్‌కు ప్రసాదించిన రాజ్యాంగ హక్కు పరిధిలోకే వస్తుందని, కేవలం అసమ్మతి అనేది నేరం కిందకు రాదని ఫిర్యాదుదారు వాదించారు. ఎలాంటి నేరం చేయనందువల్ల ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. జస్టిస్ పంకజ్ నక్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్‌లతో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ఫిర్యాదుదారుడి మీద చేపట్టిన ఇతర చర్యలనూ నిలిపివేసింది. సంబంధిత ట్వీట్‌ను ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చాలన్న దుశ్చేష్టగా భావించలేమని, ఇది ఐపీసీ సెక్షన్ 500 కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
''రాష్ట్రంలోని శాంతిభద్రతల స్థితిపై అసమ్మతి వ్యక్తీకరణ మన ఉదారవాద ప్రజాస్వామ్య విశిష్టత అని, 19వ అధికరణ ద్వారా రాజ్యాంగం దీనికి రక్షణ కల్పించిందని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు.''
ఐటీ చట్టం-2008లోని 66డీని ఉల్లంఘించారన్నది ఫిర్యాదుదారుపై యూపీ సర్కారు మోపిన రెండో అభియోగం. ఎఫ్‌ఐఆర్‌లో చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ- న్యాయమూర్తులు ఈ సెక్షన్‌ను విశ్లేషించారు. ఫిర్యాదుదారు ఎలాంటి దాపరికం లేకుండానే ట్వీట్ చేశారని, వేరెవరి ట్విటర్ ఖాతానూ వాడుకోలేదని, వంచన ఆరోపణ ఏదీ అతడి మీద లేదని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సెక్షన్ కిందా యశ్వంత్ సింగ్ ఎలాంటి నేరానికీ పాల్పడలేదని స్పష్టీకరించారు. ఈ ట్వీట్ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై దోషారోపణ చేయడం తప్ప మరొకటి కాదని రాష్ట్రం చేసిన వాదనను కొట్టేశారు.
ముఖ్యమంత్రి 'శాంతిభద్రతలు అదుపు చేస్తున్నతీరు'పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక పౌరుడిని- నేరపూరితంగా ప్రభుత్వాన్ని అపఖ్యాతి (క్రిమినల్ డిఫమేషన్) పాలు చేశారంటూ- జరిమానా లేదా రెండేళ్ల ఖైదుకు అర్హమైన సెక్షన్ కింద విచారించడమన్నది ఈ దేశంలో కనీవినీ ఎరగనిది. అలా చేసినందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయమూర్తులు చీవాట్లు పెట్టారు.
ఒక్క యూపీనే కాదు..బంగాల్‌లోనూ
ఇది ఒక్క యూపీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. పలువురు ఇతర ముఖ్యమంత్రులూ ఇదే బాటలో నడుస్తూ- రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మౌలిక స్వాతంత్య్రాలను సవాలు చేస్తున్నారు. పశ్చిమ్ బంగ ఈ విషయంలో కేసుల సంఖ్యాపరంగానే కాకుండా, విమర్శకులను జైలు పాలు చేయడంలోనూ ముందుంటుంది. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు మహాపాత్రను, ఆయన మిత్రుడిని అరెస్టు చేయడం ద్వారా మమతాబెనర్జీ ప్రభుత్వం కొత్త ఒరవడికి నాంది పలికింది. ముఖ్యమంత్రిపై నిందాపూర్వక వ్యంగ్యచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నందుకు ఐటీ చట్టం కింద అభియోగాలు మోపింది. దీంతో వారు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించగా- అది ఈ అరెస్టులను విమర్శించడంతో పాటు వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రం ఈ ఆదేశాల్ని ఖాతరు చేయకపోవడంతో, మహాపాత్ర కోల్‌కతా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు మానవ హక్కుల సంఘం ఉత్తర్వును సమర్థించి, పరిహారాన్ని రూ.75 వేలకు పెంచింది.