గురి తప్పని అస్త్రంలా దేశదేశాల్నీ చుట్టేసిన మహమ్మారి కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా 17.65 కోట్లమందికి సోకి సుమారు 38 లక్షల 12వేల నిండుప్రాణాల్ని కబళించేసింది. ఇంతగా మృత్యుపాశాలు విసరుతూ రెచ్చిపోయిన వైరస్ మానవ ప్రేరేపితమేనన్న కథనాలు, వుహాన్ ప్రయోగశాలే దాని పురిటిగడ్డ అన్న విశ్లేషణలు కొన్నాళ్లుగా ప్రపంచాన్ని కలవరపరుస్తూనే ఉన్నాయి. విధ్వంసక వైరస్ మూలాల గుట్టుమట్లు రట్టు కావాల్సిందేనంటూ నిరుడు గళమెత్తిన ఆస్ట్రేలియా మీద చైనా ఒంటికాలిపై విరుచుకుపడింది. వాణిజ్యపరమైన ఆంక్షలకు తెగబడింది. బీజింగ్‌తో సుదీర్ఘ మంతనాల దరిమిలా అక్కడ పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం, కరోనా మూలం వుహాన్ ప్రయోగశాల కాదని మొన్న ఫిబ్రవరిలో నీళ్లు నమిలింది. బలవంతాన అలా చెప్పించారన్న వాదనల్ని బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తల ఇటీవలి అధ్యయన నివేదిక గట్టిగా బలపరచింది. వైరస్ జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు మార్చేశారని, తత్ఫలితంగానే కొవిడ్ కారక 'సార్స్ - కొవ్ 2' పుట్టుకొచ్చిందని పుణె శాస్త్రవేత్తల తాజా పరిశోధనా ధ్రువీకరిస్తోంది.
చైనా ఎంతగా మసిపూసి మారేడు చేయజూసినా ప్రపంచాన్ని ఏమార్చలేదంటున్న బ్రిటన్ నిష్పాక్షికంగా లోతైన అధ్యయనం జరిగి తీరాలంటోంది. వైరస్‌లోని స్పైక్‌ప్రొటీన్‌పై ధనావేశం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలు మానవ శరీరంలోని రుణావేశ భాగాలకు బలంగా అతుక్కునేలా వుహాన్ శాస్త్రవేత్తల బృందం లక్షించిందన్న విశ్లేషణల్ని బ్రిటన్ దృఢంగా విశ్వసిస్తోంది. వైరస్ ఆనుపానులు, మూలాలను వెలికితీసే బాధ్యతను శ్వేత సౌధాధిపతి బైడెన్ గూఢచార విభాగానికి కట్టబెట్టారు. నిన్నటితో ముగిసిన జి-7 సదస్సూ కొవిడ్ మూలాల వెలికితీతకు డిమాండు చేసింది. అందరూ తనను బోనులో నిలబెడుతున్నా చైనా స్పందనలో తెంపరితనమే ప్రస్ఫుటమవుతోంది!
ఏమాత్రం ఉపేక్షించకూడదు..
మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలంలో తీవ్రస్థాయి చర్చోపచర్చలకు తెర తీసిన అంశం- జీవాయుధాల ప్రయోగం. శత్రుపక్షాన్ని ప్లేగు, ఆంత్రాక్స్, బ్రజిలాసిస్ తరహా భయానక వ్యాధులకు గురిచేసే జీవాయుధాల ఉత్పత్తిని, వినియోగాన్ని కట్టడి చేయాలన్న సంకల్పం 1925నాటి జెనీవా ప్రొటోకాల్‌లో అంతర్భాగమైంది. ఏళ్లతరబడి మేధామథనం సాగిన దరిమిలా, ఆ మేరకు అంతర్జాతీయ ఒప్పందమొకటి ఖరారు కావడానికి అయిదు దశాబ్దాలు పట్టింది. ఎటువంటి సాయుధ సంఘర్షణల్లోనైనా జీవాయుధాల్ని ప్రయోగించడం నిషిద్ధమన్న ఒడంబడిక స్ఫూర్తికి అడపాదడపా తూట్లు పడుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, లిబియా, చైనా, రష్యా, ఉత్తరకొరియా ప్రభృత దేశాలు ఆ అమానుష మారణాయుధాల తయారీ సామర్థ్యం సంతరించుకున్నాయన్న విశ్లేషణలు లోగడే వెలుగుచూశాయి. ఆ వరసలో చేర్చదగిందిగా చెబుతున్న కరోనా వైరస్ చైనా ప్రయోగశాలలో సృష్టించినదేనన్న వైరాలజిస్ట్ డాక్టర్ లీమెంగ్ యాన్ వాంగ్మూలం గత అక్టోబరులో పెను ప్రకంపనలు పుట్టించింది. 'బయొలాజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్' రూపకర్త డాక్టర్ ఫ్రాన్సిస్ బోయల్ వంటివారు అది జీవాయుధమేనని తెగేసి చెబుతున్నారు. వాటిని ఖండిస్తూ బీజింగ్ కాకమ్మ కథలు, కుట్ర సిద్ధాంతాలెన్ని వినిపించినా- కొన్నేళ్లుగా జీన్ ఎడిటింగ్ సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించిన చైనా అప్రకటిత లక్ష్యాలనుంచి ప్రపంచాన్ని ఏమార్చలేదు. ఏ ఉద్దేశంతోనైనా మానవాళికి కీడు వాటిల్లజేయడంలో పాత్ర, ప్రమేయం రుజువైతే- ప్రపంచదేశాలు చైనాను, జీవాయుధాల ముప్పునూ ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఆస్ట్రేలియాలా ఒంటిస్వరంతోకాక దిగ్గజశక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి జీవాయుధ వ్యతిరేక పోరును కొత్తపుంతలు తొక్కించాలి. 1975నాటి ప్రొటోకాల్‌కు మెరుగులద్ది జీవాయుధాల తయారీని పకడ్బందీగా నిషేధించేలా, వాటి పీడ శాశ్వతంగా విరగడ అయ్యేలా పటిష్ఠ వ్యవస్థల నిర్మాణానికి పూనిక వహించాలి.
ఇదీ చదవండి:దౌత్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు