దిల్లీ ఉన్నత న్యాయస్థానం అభివర్ణించినట్లు సునామీలా విరుచుకుపడుతున్న కరోనా రెండోదశ భారత్‌కు పెనుముప్పుగా పరిణమిస్తోంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు, స్నేహితులు... ఇలా పెనవేసుకున్న బంధాలన్నింటినీ ఛిద్రం చేస్తోంది. భార్యకు తెలియకుండా భర్తకు, తండ్రికి తెలియకుండా బిడ్డకు దహన సంస్కారాలు చేసే దుస్థితి ఏర్పడింది. ఒకే చితిపై అనేక మృతదేహాలను దహనం చేస్తున్న ఉదంతాలతో కదిలిపోయిన న్యాయస్థానాలు- 'అంతిమ సంస్కారాలను కాస్త గౌరవనీయమైన పద్ధతిలో చేయండి' అని ఆవేదనతో సూచిస్తున్నాయి. నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మొదటి దశను భారత్ సమర్థంగానే ఎదుర్కొంది. ఆ తరవాత అందరిలోనూ అజాగ్రత్త పెరిగింది. కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సభలు, మతపరమైన కార్యక్రమాలు విచ్చలవిడిగా జరిగాయి. ఇదే అదనుగా జన్యుపరంగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ జనంలో వేగంగా విస్తరించింది.
యువశక్తిపై పంజా
గడచిన వారం రోజుల్లో దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల నాలుగు లక్షలకు మించిపోయింది. సగటున నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త రోజువారీ కొవిడ్ కేసుల్లో 46శాతం, మరణాల్లో 25శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ రూపంలో మానవాళి ఇంతటి ఉత్పాతాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మొదటి దశ వ్యాధి వ్యాప్తిలో అమెరికా, ఐరోపా దేశాల కంటే భారత్‌లో తక్కువ కేసులే నమోదయ్యాయి. కానీ, తరవాత రెండోసారి పడగవిప్పిన ఆ మహమ్మారి దాదాపు కోటిన్నర మంది భారతీయులను పొట్టనపెట్టుకుంది.
కరోనా రెండోదశ వ్యాప్తి ఎప్పటికి అదుపులోకి వస్తుందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూన్ రెండో వారం నాటికి ఇది తగ్గుముఖం పడుతుందని కొంతమంది చెబుతున్నారు. ఇంకొన్నాళ్లు పడుతుందని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇప్పుడు యువత ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడుతోంది. మనదేశ జనాభాలో 19-59 ఏళ్ల మధ్య వయసువారు 62 శాతం. దేశాభివృద్ధిలో, ఆర్థిక కార్యకాలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వయసు పౌరులు కొవిడ్ కోరల్లో చిక్కి ప్రాణాలు వదలడం ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూరుస్తోంది. దేశం ఇప్పుడిప్పుడే 'మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా...' లాంటి సృజనాత్మక పథకాల ద్వారా యువతను ప్రోత్సహిస్తోంది. వాళ్ళను విజయవంతమైన వ్యాపారస్తులుగా, చురుకైన ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయాలు నెరవేరాలన్నా దేశానికి యువజనం చాలా అవసరం.
మరింత ఆర్థిక సాయంతో ఆదుకోవాలి..