Karnataka assembly election 2023 : ఒకే నియోజకవర్గం.. వేర్వేరు పార్టీలు.. అభ్యర్థుల పేర్లు మాత్రం సేమ్! ఓటరు కాస్త ఏమరపాటుగా ఉంటే ఇక అంతే! ఒకరికి పడే ఆ ఓటు ఇంకొకరి ఖాతాలోకి చేరడం ఖాయం. కర్ణాటకలోని 20 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. త్రిముఖ పోరు నడుస్తున్న ఈ ఎన్నికల్లో ఒకే పేరుతో పలువురు అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న పలు నియోజకవర్గాల్లో.. అదే పేరుతో ఉన్న కొందరు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమవుతోంది. ఇలా నామినేషన్ వేయడానికి కారణమేంటి? దీని వెనుక ప్రధాన పార్టీల హస్తం ఉందా? ఉంటే.. దాని వల్ల వచ్చే లాభమేంటో చూద్దాం. అంతకుముందు ఇలా ఏఏ నియోజకవర్గాల్లో ఉన్నారో పరిశీలిద్దాం.
హొసకోటె
ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన శరత్ బాచెగౌడ.. ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎంటీబీ నాగరాజ్.. శరత్‌ను ఢీకొడుతున్నారు. బలమైన అభ్యర్థులుగా ఉన్న వీరిద్దరికీ.. అదే తరహా పేరు ఉన్న ప్రత్యర్థుల నుంచి సవాల్ ఎదురవుతోంది. శరత్ బాచెగౌడ పేరుతోనే మరో అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా నాగరాజ్ పేరుతో మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఎన్ నాగరాజ్, టీ నాగరాజ్ అనే వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
కుమారస్వామికీ అదే ఇబ్బంది
మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్న చన్నపట్టణ స్థానం నుంచి వైసీ కుమారస్వామి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగారు. ఇక్కడ కుమారస్వామే ఫేవరెట్ అయినప్పటికీ.. పేరును చూసి అయోమయానికి గురై ఎవరైనా రెండో అభ్యర్థికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు.
శ్రీనివాస్పుర్ నియోజకవర్గం
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేఆర్ రమేశ్ కుమార్ మరోసారి ఇక్కడ అదృష్టం పరీక్షించుకోనున్నారు. బీజేపీ నుంచి గుంజూర్ ఆర్ శ్రీనివాస రెడ్డి, జేడీఎస్ నుంచి జీకే వెంకటశివారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని పోలిన మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎన్ఆర్ రమేశ్ కుమార్, ఎస్ రమేశ్ కుమార్ పేర్లతో బరిలో నిలిచిన ఇద్దరు.. కాంగ్రెస్ ఓట్లు చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి పేరును పోలిన వ్యక్తులూ బరిలో ఉన్నారు. అచ్చం జీకే వెంకటశివారెడ్డి అనే పేరుతో ఒకరు.. టీఎన్ వెంకటశివారెడ్డి అనే పేరుతో మరొకరు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ స్వతంత్రులే.
యలహంక
యలహంక నుంచి మొత్తం 20 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ బరిలో ఉండగా.. అదే పేరును పోలి ఉన్న ఎస్వీ విశ్వనాథ్, హెచ్‌జే విశ్వనాథ్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. జేడీఎస్ నుంచి 'మునెగౌడ ఎం' బరిలో ఉండగా.. మునెగౌడ ఎన్, బీఎం మునెగౌడ, మునెగౌడ వీ అనే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఆయనకు తలనొప్పిగా మారారు.
దసరాహళ్లి
ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఇక్కడ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ తరఫున ఎస్ మునిరాజు, కాంగ్రెస్ తరఫున జీ ధనంజయ బరిలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థి పేరును పోలిన ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయడం గమనార్హం. ఎన్ మంజునాథ్, మంజునాథ్ ఆర్, ఆర్ మంజునాథ్ అనే స్వతంత్ర అభ్యర్థులు.. దసరాహళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.